హోలీ;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 గోపికలు- కృష్ణ....రేపు హోలీ పండుగ కదా ఎప్పుడూ నల్లగా ఉంటావని 
నిన్ను హేళన చేసే రాధని, మరి ఏ రంగుతో అలంకరిస్తావు నువ్వు???
రాధా- అయితే ఒక షరతు నన్ను కృష్ణుడు తాకకుండా, 
ఏ రంగుని అంటినా ఆ రంగు నేను నిర్మొహమాటంగా 
అలంకరించుకుంటాను అంటుంది...
అప్పుడు,
గోపికలు- తాకకుండా రంగు అంటడమా అది ఎలా సాధ్యం రాధా???
రాధా- ఏం మాట్లాడకుండ అలా మౌనంగా వున్నావెందుకు
ఓటమిని అంగీకరించినట్లేనా కృష్ణ....
కృష్ణుడు - పోటీకి నేను సిద్ధం రాధా రేపు ఉదయం
నువ్వు సిద్ధంగా ఉండు అంటూ చిరునవ్వు నవ్వాడు...
రాధా- అసాధ్యమైన పనిని కృష్ణుడు ఎలా చేస్తాడని 
ఆలోచిస్తూ మౌనంగా వెళ్లిపోయింది...
గోపికలు అందరు ఉదయన్నే గట్టున వున్న చెట్టు దగ్గరకు 
చేరుకొని కన్నయ్య ఎలా పందెం నెగ్గుతాడోనని తెగ ఆలోచిస్తున్నారు....
కృష్ణుడు- వచ్చాడు
రాధ కూడా ఆలస్యం కావడంతో పరుగున వచ్చింది....
అందరు తీక్షణంగా చూస్తున్నారు....
కృష్ణుడు అద్దాన్ని తెచ్చి రాధ వెనుక ఉంచాడు ఎవ్వరికీ ఏమి అర్ధం కాలేదు....
రాధా పోటీకి సిద్ధమా!!!!
అయితే సరే మరి....
కృష్ణుడు- ఓ రాధా....
నీ వాలు కళ్ళ తలుపులను తెరిచి,
నీ  వేవేల తలపులలో నిలిచి,
నీ అందమైన మనసును గెలిచిన
నీలమేఘశ్యాముడు, అయిన నేను నీ ఎదుట నిలువగా
నీ నీలి కనులలోని కనుపాపలను అంటిన, ఆ రంగు ఏంటి రాధా???
అందరు ఒక్కసారి ఆశ్చర్యపోయారు!!!!
అప్పుడు గోపికలు నీలం అంటూ జవాబు ఇచ్చారు...
కృష్ణుడు- పొద్దుపొద్దున్నే నాకు పొలమారేలా చేసి,
నీ పాదాల పారాణి ఆరక ముందే నా వద్దకు పరుగులు తీసి,
ఇంత సేపు చెట్టు చాటున చేరి చిలిపిగా చూసి,
తీరా నే నిన్ను చూడగానే లేలేత నీ బుగ్గలు 
పులుముకున్న రంగు ఏంటి రాధా???
కృష్ణుడు తనను చూసేసాడని చెప్పగానే సిగ్గు పడింది రాధ...
అప్పుడు గోపికలు గులాబీ రంగు అంటూ జవాబు ఇచ్చారు...
కృష్ణుడు- నల్లనివాడినంటూ, అల్లరివాడినంటూ,
నన్ను ఆటపట్టిస్తూ...
చిటికీమాటికీ మూతిముడుచుకుంటూ నన్ను నీ వెంట 
తిప్పుకుంటూ.......
అని కృష్ణుడు అంటుండగానే
సిగ్గుతో మోముదాచి వెనుకకు తిరిగిన రాధ వద్దకు చేరుకొని ఇదిగిదిగో
ఇప్పుడు నీ పెదవులపై వెన్నెలలా విరిసిన చిరునవ్వు రంగు 
ఏంటి రాధా అంటూ ఎదురుగా వున్న అద్దాన్ని చూపాడు???
అప్పుడు గోపికలు అద్దంలో ముద్దుగా ఒదిగిన రాధాక్రిష్ణుల జంటను చూస్తూ 
తెలుపు రంగు అంటూ జవాబు ఇచ్చారు... దాంతో కొంటె కృష్ణుడు విజేతగా నిలిచాడు....

కామెంట్‌లు