పయనాల ముగింపు;-డా. నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 చిక్కని గాలి క్షేమం కాదుగా 
వాడిన పువ్వుల సొగసుకు...
ముసలి వయసుకు కీర్తి కిరీటాల ఆభరణాలు, కితాబుల కాలక్షేపాలు,
అవును...నిజమే...
కాలం చెల్లిన అనుభవాలు కొన్ని కాగితాల గోడల పై నుంచి శాశ్వతంగా తొలగిపోతున్నాయి...
నిశి రాతిరి నిశ్శబ్దం వీడిందా లేదా అని
కన్నీటి చుక్కలు తొంగి తొంగి చూస్తున్నాయి...
వేళ కాని వేళ వీలు 
చూసుకొని కళ్ళు కప్పి కారు 
మబ్బులు మెల్లగా కమ్ముకుంటున్నాయి...
వరమైన వారసత్వాలకు తియ్యని జ్ఞాపకాల ప్రసాదాన్ని
పంచుతుంటే తెలియకుండానే పొద్దెప్పుడు తిరిగిపోయిందో మరి... 
అందరూ కలిసి అబద్దాన్ని అందంగా నమ్మించే
ప్రయత్నాన్ని చేసినా,
నిప్పులాంటి నిజాలు మాత్రం సొంత కలలకు కొంత మేర కొరివిని పెడుతూనే ఉన్నాయి...
రాలుతున్న నక్షత్రాలు పంపుతున్న రాయబారాలను
మోస్తూ బరువైన హృదయాలు...
సమ్మతాన్ని తెలుపుతున్నాయి
పయనాల ముగింపు బాటలో...


కామెంట్‌లు