నీతి కథలు;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
పిల్లలు హాయిగా ప్రకృతి ఒడిలో ఆడుకునే రోజులు పోయాయి. ఏ ఇంట్లో చూసినా పిల్లలు సెల్ ఫోన్లు పట్టుకుని దర్శనమిస్తున్నారు. పిల్లలు అల్లరి చేస్తారు పసితనం కదా
కేరింతలు, పరుగులే వారికి సరదా. అయితే తల్లిదండ్రులు
కాస్తంత సహనం కూడా లేకుండా వ్యవహరిస్తే ఎలా?
పిల్లలు గోల పెడుతుంటే చాలు
వాళ్లని అదుపు చేయడానికి, మొబైల్ ఫోన్ను తీసి చేతిలో పెట్టేస్తున్నారు. ఆ చిన్నారులు బొమ్మలు, గేమ్స్ అంటూ పొద్దస్తమానం అదేపనిగా ఆ మొబైల్ ను చూడడం వల్ల కంటిలోని రెటీనా దెబ్బతిని సైట్ లాంటి కంటి రుగ్మతలకు గురి అవుతున్నారు. చిన్న చిన్న వయసులోనే భూతద్దాల భారాన్ని మోస్తున్నారు. పిల్లలు అన్నం తినకపోతే కథలు చెప్పి తినిపించే తల్లిదండ్రులు వున్నారా ఇప్పుడు? టీవీలో కార్టూన్ బొమ్మలు పెట్టి అన్నాన్ని కలిపి పిల్లల ముందు ఉంచడం. పిల్లలని పక్కన పడుకోబెట్టుకుని మంచి మంచి  నీతి కథలను చెబుతూ వారిని నిద్ర పుచ్చడం వల్ల వారికి అవగాహన పెరుగుతుంది, మంచి చెడుల మధ్య వ్యత్యాసం తెలుస్తుంది. 
చందమామను చూపిస్తూ కమ్మని పాల బువ్వను నోటి కందిస్తూ ఉంటే ఆ చిన్ని కృష్ణులు ఆరగించరా చెప్పండి....! ఫోన్లను, టీవీలను  అన్నిటిని కట్టేసి ఒక్కసారి మాటలను చెపుతూ అన్నాన్ని తినిపించండి. పడుకునే ముందు నీతి, నిజాయితీ, నమ్మకం, ఐకమత్యం, సాయం, సాహసం, స్ఫూర్తి, త్యాగం లాంటి కోణాలను వారికి పరిచయం చేస్తూ మంచి మంచి కథలను వారికి వినిపించండి. అప్పుడే పిల్లలు ఆరోగ్యవంతంగా, విజ్ఞాన వంతులుగా ఎదుగుతారు.



కామెంట్‌లు