ఎందుకంటారు...?;-డా. నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ప్రతిరోజు పూల మొక్కలకు నీరు పోసి కొద్దిసేపు ఇక్కడే కాలక్షేపం చేసే అతడు 
ఈ రోజు అసలు ఇటు వైపు రానేలేదు
ఎందుకంటారు...?
బహుశా ఆ పూలే పలకరించడానికి అతని దగ్గరకు వెళ్ళాయేమో
కాబోలు...
పొద్దుపొద్దున్నే ఊళ్ళో జనమంతా ఆయన ఇంటి ముందు 
ఊరేగింపుగా వచ్చి నిల్చొని వున్నారు
ఎందుకంటారు...?
బహుశా అందరిని కలవడానికి తన వద్దకు రమ్మని తానే కబురంపినాడు కాబోలు...
ఎప్పుడు ఎవరినో వెతుకుతూ తిరిగే అతని కళ్ళు ఇప్పుడు తదేకంగా చూస్తూ వున్నాయి
ఎందుకంటారు...?
బహుశా అతడి ఇన్నాళ్ళ నిరీక్షణ ఈ రోజే తీరినదేమో కాబోలు...
ఎప్పుడు ప్రవాహఝరిలా సాగే ఆయన మాటలు
ఈనాడు మౌనమన్న ఆనకట్టను దాటి బయటకు రానంటున్నాయి
ఎందుకంటారు...?
బహుశా అతడికి కావాల్సింది అందివ్వలేదని అందరిపైన అలిగాడేమో కాబోలు...
ఏ మాత్రం ఆలోచించకుండ ఆకలన్న వారికి అన్నం పెట్టే అతడి 
కంచంలోనే మెతుకులు కనిపించడం లేదు
ఎందుకంటారు...?
బహుశా నేడే ఆ నూకలు కూడా అయిపోయాయేమో కాబోలు...
అతడి చీకటి గదిలో వెలుగుని నింపాలని దీపాన్ని మాటిమాటికి 
వెలిగిస్తూనే వున్నా అది ఆరిపోతూనే వుంది
ఎందుకంటారు...?
బహుశా కట్టుకున్న దాని కన్నీటి చుక్కల తడి తగిలి కాబోలు...
కొడవలి కాటుకు కుండ నుండి చుక్క నీరైనా నేలకు జరడం లేదు
ఎందుకంటారు...?
బహుశా కన్నుముశాడని తెలిసిన కన్న కొడుకు కనీసం 
కన్నీరైనా పెట్టలేదని కాబోలు...
కావ్ కావ్ అంటూ ముందే వున్న కాకి సైతం పిండాన్ని ముట్టనంటుంది
ఎందుకంటారు...?
బహుశా అస్తికలు విదేశానికి ఇంకా పార్సిల్ చేయలేదని కాబోలు...!


కామెంట్‌లు