మరువరాదయా;- సోంపాక సీత భద్రాచలం 8639311050
పరులభాష కొరకు పాకులాటలేల?
ఘనమైన మన తెలుగును గంగపాలు చేయనేల?
కూర్చున్న కొమ్మనే నరుక్కునే మూఢులౌతారయా!
ముత్యాల జల్లు కురిపించు మనతెలుగును మరువరాదయా 

సీమభాష కొరకు సీటీ బజాయించుటేల?
స్వేదగంధాలద్దుకున్న ఆస్తులను అమ్ముటేల?
అమ్మపాలు తాగి రొమ్మునే తన్నేటి మూర్ఖులవుతారయా!
మచ్చలెరుగని అమరభావాల మనతెలుగును మరువరాదయా

రక్షరేకులవంటి తెలుగక్షరాలను విడువనేల?
కక్కిన కూటికి ఆశపడే కుక్క బ్రతుకు నీకేల?
మోచేతినీల్లు తాగించే 'మెకాలే' భాష నీకెందుకయా?
మధురభావాల మాగాణి మనతెలుగని మరువరాదయా

ఔషథి మొక్కవంటి తెలుగును ముక్కలు చేయనేల?
కానిభాషను నేర్పి కాన్వెంటుగదుల్లో కార్చిచ్చురగల్చనేల?
మనసంస్కారాలను దిగజార్చు మసకభాష మనకెందుకయా
 అమృతంపుధార తెలుగేనని మరువరాదయా 

చెదపురుగు వంటి చిక్కిరిబిక్కిరిభాష నీకేల?
ఎంగిలిభాష తోడ నీసంతుకు అన్నప్రాశనలేల?
వేరుపురుగు చేరి వెన్నునే కుడుతోందయా 
"వెన్ను"నిల్పేటి "జున్ను"లాంటి మనతెలుగును మరువరాదయా

           


కామెంట్‌లు