అన్నీ ఉచితాలే ||;-మచ్చరాజమౌళి దుబ్బాక 9059637442
చీకటి తలుపులను తెరుస్తూ, మూస్తూ
గమ్యం తెలియని ప్రయాణంలో ప్రవహిస్తూ
ఉచితానుచిత లేపనాలు పూసుకుంటూ
మానని గాయాలను మోసుకుంటూ,మనిషి 
తను నిలుచున్న కొమ్మను 
తనే నరుక్కుంటున్నాడు

రెక్కలు తగిలించుకున్న కోరికలు
ఎందాకైనా ప్రయాణిస్తాయి
వింత కోరికల మనిషికి అంతులేని ఆశలెన్నో
అవి,అంతు చూసేవైనా సరే

ఎడారి నీటిలో 
ఎంతవరకు తీరేను దాహం
ఆశల పల్లకిని మోస్తూ 
ఎన్ని కాలాలు బ్రతికేను మోహం

సుడిగుండపు చక్రాలకింద 
శిథిలమై చిక్కుకున్నప్పుడు 
జీవితపు చివరి అంచును చూస్తూ 
గొంతెత్తి అరవాలనిపిస్తుంది 

మూగబోయిన గొంతుతో నువ్వు 
రాతిపాదాలకింద నలిగిన పువ్వు 

శ్రద్ధ నశిస్తుంది
బుద్ది మందగిస్తుంది
చలన రహిత దేహంలా తోస్తుంది
నియంత్రించే స్వతంత్రం 
నీ పాదాలను తాకుతుంది

తలలు నరికే నిజాలను 
నమిలేసే రాబందులు 
పీఠం కావాలని, వల వేస్తూ
బలిపీఠానికి ఆహ్వానిస్తుంటాయి
జాగ్రత్త... 

______


కామెంట్‌లు