|| బరువెక్కిన గుండె ||;-మచ్చరాజమౌళి దుబ్బాక 9059637442
ఇంకిపోయిన కన్నీళ్ళను మోస్తూ
చెప్పలేని నిజాలను రెప్పలకింద దాస్తూ
విప్పుకోని సంకెళ్లను నడిపిస్తూ

అడుగుపడని నడకలతో 
అగుపించని చూపులతో
ఒడిదుడుకుల పెనుగులాటల సంద్రంలో ఈదలేక 
కఠిన పాషాణమైన గుండె బరువెక్కింది

క్షణాలన్నీ భయపెడుతున్నాయి
టకటకమని నీటిచుక్క శబ్ధం చేస్తున్నట్టు

వెలుతురును తరుముతూ చీకటీ
చీకటిని చీల్చాలని వెలుతురూ
తెగ ఉత్సాహం చూపిస్తున్నాయి 

గుండె పొరలను 
ఎన్ని ఘటనలు చిధ్రం చేశాయో
రక్త నాళాలు 
ఎంతటి రంపపుకోతకు గురి అయ్యాయో

చిదిమేసిన చమట చుక్క
మది నుదుటిరాతను మలిపేసిందేమో
ప్రతి చిన్న శబ్ధం 
ప్రళయం సృష్టించేదిలా అనిపిస్తుంది
తోడుగ సాగే నీడగూడా
ముందూ వెనుకా చూడక భయపెడుతోంది

చుట్టూ అందరూ ఉంటారు
తనే చిక్కని చీకట్లో ఉన్నట్లు భావన
గొంతు దాటని మాట
గంభీర స్వరంలా వినిపిస్తుంది

అడుగులు వేస్తున్నా , కాని 
దారికడ్డంగా పూలను తుంచేస్తూ ముళ్ళు 
మసకబారుతున్న చూపును నడిపించుకుంటూ
నా మనసు నన్నెటో తీసుకెలుతోంది.... 

_____


కామెంట్‌లు