రెండు వందల పర్యాయాలు ముద్రణ అయిన పుస్తకం ;-కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445

  రెవరెండ్ గిల్బర్ట్ తన మిత్రులకు వ్రాసే లేఖలలో 'సెల్ బోర్న్' గ్రామంలో ఉండే ఆసక్తికరమైన పక్షులు,జంతువులను గురించి వ్రాసేవాడు.ఆయన వ్రాసిన లేఖలలోని ఆ విషయాలన్నీ కలిపి ఆయన మిత్రులు ' దినేచురల్ హిస్టరీ ఆఫ్ సెల్ బోర్న్' అనే గ్రంథంగా వెలువరించారు! ఆయన జంతు ప్రపంచాన్ని గురించి 260 ఏళ్ళ కిందటపరిశీలించి వ్రాసినా అది నేటికీ ఆసక్తికరంగానే ఉంది.ఫ్రెంచి, జర్మన్,స్వీడిష్,డానిష్, జపానీస్ భాషల్లోకి ఆ పుస్తకం అనువదించబడింది.
        గిల్బర్ట్ వైట్ బ్రిటన్ కు చెందిన మొట్టమొదటి ప్రకృతి శాస్త్రవేత్త.ఆయన నేరుగా అడవులకు, తోటలకు వెళ్ళి ఆయా జంతువులు పక్షులు, పురుగుల్ని పరీక్షించే వాడు. వాటి అరుపులు,ప్రవర్తనలు,వాటి జీవన సరళిని కళ్ళకు కట్టినట్లు వ్రాసేవాడు. ఆయన ఇంటిలో దొరికిన ఒకేఒక గిల్బర్ట్ ఫోటో ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియంలో ఉంది.
       గిల్బర్ట్ వైట్  10 జూలై 1720 లో  సెల్ బోర్న్ గ్రామంలో ఒక క్రైస్తవ మతాధికారికి జన్మించాడు. ఆయన ఆక్స్ ఫర్డ్ లోని ఓరియ కాలేజ్ లో చదివాడు.సెల్ బోర్న్ లోని ఆయన ఇల్లు 'ది వేక్స్' ఇప్పటికీ ఉంది. దానిని మ్యూజియంగా మార్చారు.
       గిల్బర్ట్ కు వచ్చే ఆదాయం సరిపోనందు వలన ఆయన పెళ్ళి చేసుకోలేదు! గిల్బర్ట్ ఒంటరిగా కూర్చుని పక్షులను,జంతువులను గమనించేవాడు. గిల్బర్ట్ పెద్ద గబ్బిలాలను,చిట్టి ఎలకలను గురించి ఈ విధంగా వ్రాశాడు.
        'ఇవి అతి చిన్న ఎలుకలు,నిటారుగా నిలబడి జొన్నపంట మధ్యలో ఇవి నివశించి,సంసారాన్ని అభివృద్ధి చేసుకుంటాయి.కానీ శిశిర ఋతువులో ఇవి భూమికి బొరియలు చేసి గడ్డిని మెత్తగా వెచ్చగా పరచుకుని హాయిగా నివశిస్తున్నట్టు గమనించి, ఈ ద్వీపంలో నివశించే అతిచిన్నదైన నాలుగు కాళ్ళ క్షీరదం ఇదే అనుకుంటాను' అని వివరించాడు.
        గిల్బర్ట్ రచనలు పలువురు ప్రకృతి శాస్త్ర వేత్తలకు,ప్రకృతి చిత్రకారులకు మార్గ దర్శక మయ్యాయి.
      బారి క్రిస్ కోల్ అనే బ్రిటిష్ దేశపు ప్రసిద్ధ జంతు చిత్రకారుడు 'నేచురల్ హిస్టరీ ఆఫ్ సెల్బోర్న్' ఆధారంగా అనేక చిత్రాలు గీశాడు.ఈ బొమ్మలతో కూడిన పుస్తకాన్ని 1971 లో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ వారు ప్రచురించారు. అందుకే ఇన్ని సంవత్సరాలైనా ఈపుస్తకం ప్రకృతిని ప్రేమించే వారి హృదయాలను దోచుకుంటూ ప్రపంచంలోని అనేక భాషలలోకి అనువదింప బడుతోంది.
      జంతు లోకానికి ఇంత సేవ చేసిన గిల్బర్ట్ 26 జూన్ 1793 లో చనిపోయాడు.
             *******        *******
తెలుసుకోండి: పండ్లు పచ్చికూరలు తినే వారిలో గుండెపోటు 54 శాతం తగ్గినట్టు అమెరికన్ హార్ట్ అసోషియేషన్ పరిశోధనల్లో తేలింది.
         *****         *********

కామెంట్‌లు