చెప్పడానికే ఆదర్శాలు;-ఏ.బి ఆనంద్, ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322

  జీవితంలో అక్షరాభ్యాసం చేసి  ఎలా ప్రవర్తించాలో నేర్పి  పిల్లలను, స్త్రీలను ఎలా గౌరవించాలో తెలియజేసి జ్ఞానసముపార్జన పద్ధతులను మనకు చెప్పి మంచి గుణవంతులుగా తీర్చిదిద్దేది  ఉపాధ్యాయులు. నూతన వధూవరుల వివాహ సందర్భంగా పురోహితుడు వారికి చెప్పే శ్లోకం. ధర్మ మార్గంలో అర్థాన్ని సంపాదించు, ధర్మ మార్గంలో కామమును అంటే స్త్రీ సంబంధమైన విషయాలు అని కాదు కామము అంటే కోరిక మన కోరికలు తీర్చుకోవడానికి ధర్మ మార్గాన్ని అనుసరించాలి అని ఆ రోజు పురోహితులు చెబుతారు. చివరిగా మోక్షాన్ని కూడా ధర్మమార్గంలోనే సంపాదించాలి అని వరునితో మూడుముళ్లు వేయిస్తాడు కూడా. జీవితం సక్రమంగా సాగుతుంది. ఇన్ని సద్గుణాలు చెప్పిన ఉపాధ్యాయునికి కానీ, ధర్మసూత్రాలు అన్నీ చెప్పిన  పురోహితునికి కానీ డబ్బు సంపాదించాలన్న ఆశ ఉండదా? సక్రమ మార్గంలో నైనా, వక్రమార్గంలో నైనా డబ్బు రావడం ముఖ్యం అనుకోరా? అలాగే ఓ అందమైన స్త్రీ కనిపించినప్పుడు వారి మనసు వారి అధీనంలో ఉంటుందా? చక్కటి మిఠాయి అంగడిలో మంచి వాసనతో కనిపించే తినుబండారాలు కనిపించినప్పుడు వాటిని తినాలన్న అభిప్రాయం రాదా? నీతి అనేది చెప్పడానికి తప్ప  చేయడానికి కాదు అని చాలా మంది రుజువు చేశారు. చెప్పిన దానిని ఆచరించే వాడిని ఉత్తముడు అంటారు  అలాంటి ఉత్తములు ఎంత మంది ఉంటారు వేళ్లపైన లెక్కించగలం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు వేమన.
కామెంట్‌లు