అందరూ తనలాగే వుంటారు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి విజయవాడ కేంద్రం,9492811322.
 మనుషులలో రెండు రకాలు ఉంటారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను నిలబెట్టడం కోసం "సత్యం వద ధర్మం చర" అంటూ సత్యాన్ని చెప్పాలి, ధర్మాన్ని చేయాలి అన్న సూత్రాన్ని  పాటిస్తూ జీవితాన్ని సాగించే వాడికి  ఎలాంటి కష్ట నష్టాలు జీవితంలో బరువులు, బాధ్యతలు ఉండవు. అదే మనసులో కుళ్ళు పెట్టుకొని  తను తప్ప మరొకరు లేరు అనుకున్న  వ్యక్తులు  ఇతరులపై కాస్తంత ద్వేషాన్ని పెంచుకుని వారి జీవితాలను  అధమస్థితికి చేర్చడానికి ప్రయత్నం చేస్తారు. వీరికి పాపమన్నా, పుణ్యమన్నా  లక్ష్యమే ఉండదు. ఒక సందర్భంలో ధర్మరాజు,  దుర్యోధనుడు ప్రజల మనస్తత్వం ఎలా ఉందో తెలుసుకోవడానికి  అనేక ప్రదేశాలు తిరిగి వచ్చారు.  కృష్ణుడు, ధర్మరాజు నడిగితే  నాకెవరూ చెడ్డవారు కనిపించలేదు బావ అందరూ ధర్మాన్ని అనుసరిస్తూనే జీవిస్తున్నారు అని సమాధానం చెప్పాడు. అదే ప్రశ్న దుర్యోధనుణ్ణి కృష్ణుడు అడిగితే నాకు అందరూ చెడ్డవాళ్ళు కనిపించారు మంచివాడు ఒక్కరూ కనిపించలేదు అన్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్పిన నిజం తన మనసులో ఏది ఉంటుందో అదే ఎదుటి వారిలోనూ కనిపిస్తోంది అని  ధర్మానికి కట్టుబడ్డ ధర్మ రాజుకు అందరూ మంచిగా కనిపించారు. దుర్బుద్ధితో  జీవించే దుర్యోధనునికి అందరూ చెడ్డవాళ్ళుగా కనిపించారు. నీ మనసులో ఉన్నప్పుడు నువ్వు కుతంత్రాలను దాస్తావు. అది తీసి వేస్తే  అందరూ కూడా  గొప్పవారిగా, మంచివారుగా కనిపిస్తారు. ముందు నీవు మారాలి అన్న సత్యాన్ని అద్భుతంగా వేమన కందపద్యంలో వ్రాశాడు.  చాలామంది అడుగుతూ ఉంటారు ఈయన కందపద్యము కూడా రాశాడా అని కందము రాసి కవియోవ్ అన్నట్లుగా కంద పద్యాలను కూడా రాసి మంచి కవిగా గుర్తింపు పొందిన వేమన కంద పద్యంలో మనకందించిన విషయం.

"మన మది కపటము గలిగిన
తనవలెనే కపటముండు టగజీవులకున్
మన మది కపటము విడిచిన
తనకెవ్వరు కపటిలేరు ధరలో వేమా..."


కామెంట్‌లు