మనకీర్తి శిఖరాలు బోయినపల్లి వెంకట రామారావు . .;--డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 బోయినపల్లి వెంకట రామారావు .కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత.
ఇతను సెప్టెంబరు 2, 1920 న పూర్వపు కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలం (ప్రస్తుతం సిద్దిపేట జిల్లా) తోటపల్లి గ్రామంలో రంగమ్మ, కొండాల్‌రావు దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్య తోటపల్లిలో ప్రారంభమైంది. అనంతరం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చేరాడు. కొద్ది రోజుల్లో కాశ్మీరగడ్డలోని ప్రభుత్వ పాఠశాలలోకి మారారు. సామజిక, రాజకీయ కార్యకలాపాలతో చదువుకు ప్రాధాన్యమివ్వలేదు. 1939లో ఆంధ్ర సారస్వత పరిషత్‌ ద్వారా మెట్రిక్యులేషన్‌ పరీక్ష రాశారు. ఉత్తీర్ణత అనంతరం చదువు నిలిపివేశాడు. అయినా ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు.
చిన్న వయస్సులోనే సమరయోధుడిగా పేరుపొందారు. ఆర్యసమాజ్ ప్రభావంతో మతఛాందసవాదులతో పోరాడాడు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నాడు. 1947-48లో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడాడు. 12 మాసాల కారాగారశిక్ష పొంది హైదరాబాదు విమోచన అనంతరం విడుదలైనాడు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌గా పనిచేశాడు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేతులమీదుగా సమరయోధులకు ప్రధానం చేసే తామ్రపత్రాన్ని అందుకున్నాడు. తోటపల్లి గాంధీగా, కరీంనగర్ గాంధీగా మన్ననలందుకున్న వెంకటరామారావు అక్టోబరు 27, 2014న మరణించారు.
జిల్లాలో జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో బోవెరా పాత్ర కీలకం. ఆ సమయంలో జాతీయవాదులను 40 మందిని సమీకరించారు. ప్రభుత్వ కార్యాలయాలు కూల్చేసి గిడ్డంగుల్లోని బియ్యాన్ని ప్రజలకు సరఫరా చేశారు. ప్రతి గ్రామంలోనూ జాతీయ జెండా ఎగురవేశారు. నైజాం ప్రభుత్వానికి సమాంతరంగా గ్రామాల్లో ప్రభుత్వాన్ని నడిపారు. అతను 65 సం.ల. క్రితం దేవులపల్లి రామానుజరావు సాహితీ స్ఫూర్తితో కరీంనగర్‌లో సారస్వతజ్యోతి మిత్రమండలిని స్థాపించి రికార్డు స్థాయిలో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాడు. వినోబాబావే, జయప్రకాశ్‌ నారాయణ, వావిలాల గోపాలకృష్ణయ్య, మల్లాది సుబ్బమ్మ వంటి ప్రముఖులతో పనిచేశాడు. 1952లో ఎలగందుల నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా, 1957లో ఇందుర్తి నియోజకవర్గం నుంచి ప్రజా సోషలిస్టు పార్టీ ఆప్‌ ఇండియా అభ్యర్థిగా పోటీచేశాడు. దివంగత నేత కొండాలక్ష్మణ్ బాపూజీతో కలిసి తెలంగాణ కోసం ఢిల్లీలో నిరాహారదీక్ష చేశారు.. 2006లో కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌నిచ్చి సత్కరించింది.

కామెంట్‌లు