మనకీర్తి శిఖరాలు.;-పసల అంజలక్ష్మి; డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 మనకీర్తి శిఖరాలు.;-పసల అంజలక్ష్మి
(1904 - డిసెంబరు 3, 1998) ఆగర్భ శ్రీమంతుల ఇంట పుట్టి, అపర కుబేరుని ఇంట మెట్టి.. భర్తతోపాటు గాంధేయ సిద్ధాంతాలతో జీవితాన్ని మలచుకుని, సమాజ సేవకై ఆస్తినంతా ఆనందంగా సమర్పించిన త్యాగమయి.
1904 లో అత్తిలి సమీపంలోని దాసుళ్ళ కుముదవల్లిలో దాసం వెంకటరామయ్య, వెంకమ్మలకు జన్మించారు. 2వ తరగతి వరకూ మాత్రమే ఆమె చదివారు. 12వ ఏట తాడేపల్లిగూడెం సమీపంలోని వెస్ట్ విప్పర్రుకు చెందిన భూస్వామి పసల కృష్ణమూర్తితో వివాహమైంది. 1921 మా ర్చిలో గాంధీజీ విజయవాడ వచ్చినప్పుడు అంజలక్ష్మి భర్త కృష్ణమూర్తితో వెళ్లి కాంగ్రెస్ సభ్యత్వాన్ని స్వీకరించారు. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని, తాడేపల్లిగూడెం తాలూకా అంతటా గాంధీజీ ఆశయాలను ప్రచారం చేశారు. అంజలక్ష్మి ఎప్పుడూ స్వయంగా నేసిన ఖద్దరు వస్ర్తాలనే ధరించారు.
సహాయ నిరాకరణ ఉద్యమంలో మద్యం షాపుల వద్ద, విదేశీ వస్త్ర దుకాణాల వద్ద పికెటింగ్ చేశారు. ఖద్దరు వస్ర్తాలను గ్రామ వీధుల్లో అమ్ముతూ ఇంటింటా రాట్నం తిరిగేలా ప్రచారం చేశారు. 1929లో గాంధీజీ చాగల్లులోని ఆనందనికేతన్ ఆశ్రమానికి వచ్చినప్పుడు అంజలక్ష్మి దంపతులు ఆయనను కలుసుకున్నారు. అంజలక్ష్మి బంగారంపై మోజు వీడి తన వంటిపై ఉన్న ఆభరణాలన్నింటినీ ‘ఖద్దరు నిధి’కి సమర్పించి గాంధీజీ అశీస్సులు పొందారు. ఆమె ఐదేళ్ల కుమార్తె సత్యవతి బంగారు మురుగులు, గొలుసు గాంధీజీకి సమర్పించారు. గాంధీజీ కోర్కె మేరకు ఇకపై బంగారు నగలు ధరించబోమని ప్రమాణం చేసి జీవితాంతం మాట నిలుపుకున్న మహిళా శిరోమణి అంజలక్ష్మి. నాటి నుంచి అన్నదానాలు చేస్తూ.. వితంతు వివాహా ల్ని పోత్సహిస్తూ, అస్పృశ్యతా నివారణ ప్రచారమే కాకుండా ఇద్దరు దళిత బాలికలను చేరదీసి విద్యాబుద్దులు చెప్పించారు.
1930లో ఉప్పు సత్యాగ్రహంలో భీమవరం లో విదేశీ వస్త్ర దుకాణాల వద్ద పికెటింగు చేస్తున్న అంజలక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. 1931 జనవరి 20న ఆరు నెలల కారాగార శిక్ష విధించి మదరాసు, వెల్లూరు
 జైళ్ళకు తరలించారు. గాంధీ-ఇర్విన్ ఒప్పందం వల్ల శిక్షాకాలం ముగియకుండానే 1931 మార్చి 7న విడుదలయ్యారు. 1932 జూన్ 27న ప్రభుత్వశాసనాల్ని ఉల్లంఘిస్తూ భీమవరం తాలూకా కాంగ్రెస్ సమావేశాన్ని పసల కృష్ణమూర్తి అధ్యక్షతన జరపాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఈ సమావేశం జరగకుండా భీమవరంతోపాటు, మార్గాలలో కూడా పోలీసు బలగాల్ని మోహరిం చింది. కాంగ్రెస్ సత్యాగ్రహులు, అంజలక్ష్మి తది తరులు చేల గట్ల వెంట రహస్యంగా సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం భర్త కృష్ణమూర్తితో కలిసి తాలూకా ఆఫీసు భవనం పెకైక్కి కాంగ్రెస్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశా రు. ఆరు నెలల గర్భిణిగా ఉన్న అంజలక్ష్మి ఈ సాహసోపేత కార్యక్రమంలో పాల్గొనటం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల్ని సంబ్రమాశ్చర్యంలో ముం చెత్తింది. ఆంగ్ల పతాకాన్ని తొలగించి కాంగ్రెస్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఘనత ఆంధ్రదేశంలో ప్రప్రథమంగా అంజలక్ష్మి దంపతులకే దక్కింది. ఇంతలో పోలీసులు లాఠీచార్జి జరిపి, వారిని అరెస్టు చేసి భీమవరం స్పెషల్ మెజిస్ట్ట్రేటు కోర్టులో హాజరుపర్చారు. 1931 జూన్ 27 నుంచి పది నెలల కారాగార శిక్ష విధించారు. ఐదేళ్ల కుమారుడు ఆదినారాయణతోపాటు ఆరు నెలల గర్భిణిగా ఉన్న అంజలక్ష్మి వెల్లూరు, కన్ననూరు కారాగారాల్లో శిక్ష అనుభవించారు.
1931 అక్టోబరు 29న వెల్లూరు జైల్లో అంజలక్ష్మి కుమార్తెను ప్రసవించింది. ‘కృష్ణుడి వలే జైలులో జన్మించడం వల్ల కృష్ణ అని, భరతమాత దాస్యవిముక్తి పోరాటంలో జన్మించడం వల్ల భారతి అని కలిసేలా కృష్ణభారతిగా నామకరణం చేసిన దేశభక్తురాలు అంజలక్ష్మి. ఆరు నెలల బిడ్డతో 26 ఏప్రిల్ 1933న అంజలక్ష్మి కన్ననూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఆంధ్రదేశంలోని స్ర్తీలోకం అంజలక్ష్మికి నీరాజనాలు పట్టింది. అప్పటి నుంచి అంజలక్ష్మి మాంసాహారాన్ని విసర్జించి, జీవితాంతం శాఖాహారిగానే జీవించారు
ఆదర్శ వివాహాలను, వితంతు వివాహాలను దగ్గరుండి జరిపించి, ఆ జంట మనుగడకై కొంత ధనాన్ని సహాయంగా ఇచ్చారు. ఆస్తినంతా దాన ధర్మాలకు సంఘ సంస్కరణ ఉద్యమాలకు ఆనందంగా ఖర్చు చేశారు.
1929లో వెస్ట్‌విప్పర్రులోని ఒక ధర్మాసుపత్రిని తన ఇంటిలోనే ఏర్పాటు చేసి ఒక డాక్టరును నియమించారు. అందులో అంజలక్ష్మి నర్సుగా, కృష్ణమూర్తి కాంపౌండరుగా పనిచేస్తూ ఎందరో పేదలకు వైద్య సేవలను అందించారు. స్వరాజ్యం లభించినప్పుడు ఈ దంపతుల సంతోషానికి అవధులు లేవు. రాజకీయరంగంలో ప్రవేశించిన అశ్రీతపక్షపాతం, అవినీతి, స్వార్ధచింతన చూసి ఏవగించుకున్న అంజలక్ష్మి రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. స్వాతంత్య్రోద్యమంలో వెనుకవరసలో ఉన్న శక్తులు ముందుకు వచ్చి ఇదంతా తమ త్యాగఫలమే అని ప్రగల్భాలకు పోతుండటంతో విస్మయంతో ఉండిపోయింది.
భారత ప్రభుత్వం అంజలక్ష్మి సేవలను ప్రస్తుతిస్తూ 1972, ఆగష్టు 15 న రజతోత్సవాన్ని పురస్కరించుకుని తామ్రపత్రంతో సత్కరించింది. 1995 అక్టోబరు 2న మహాత్ముని 125 జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఆంధ్ర మహిళా సభ ప్రత్యేకంగా అంజలక్ష్మిని ఘనంగా సత్కరించింది. 1998లో న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో అంజలక్ష్మి దేశసేవను కొనియాడుతూ త్యాగమయిగా కీర్తించారు.
జీవితాంతం ఖద్దరునే ధరిస్తూ.. గాంధీజీనే స్మరిస్తూ సమాజసేవకై పరితపిస్తూ మనుగడ సాగించిన అంజలక్ష్మి 1998, డిసెంబరు 3 న తన 94వ ఏట దైవసాన్నిధ్యం చేరారు.

కామెంట్‌లు