కళ్ళు తెరపించిన వ్యాసం !;-- యామిజాల జగదీశ్
 ఒక పాఠశాల ఉపాధ్యాయురాలు విద్యార్థులను ఒక వ్యాసం రాయమని అడిగారు.
వ్యాసం శీర్షిక "దేవుడు మీకోసం ఏం చేయాలనుకుంటున్నారు"!
విద్యార్థులు రాసిన వ్యాసాలను పేపర్లను ఇంటికి తీసుకొచ్చి ఆమె దిద్దడం మొదలుపెట్టారు. ఓ వ్యాసాన్ని దిద్దుతున్నప్పుడు ఆమె మనసు బరువెక్కింది. కళ్ళు చెమ్మగిల్లాయి.
అది గమనించిన ఆమె భర్త "ఏమిటీ ఎందుకు ఏడుస్తున్నావు" అని అడిగాడు.
తనను కలవరపరచిన విద్యార్థి వ్యాసాన్ని చూడమని ఆమె భర్తకు ఇచ్చింది.
అతను చదివాడు.
అది ఇలా సాగింది...
“దేవుడా, నన్ను నా ఇంట్లో టీవీలా మార్చేసే. నాకదే ఇష్టం. నేనిలా మనిషిలా కాకుండా టీవీలా ఉండాలనుకుంటున్నాను. మా అమ్మానాన్నా ఎంతసేపూ ఆ టీవీనే చూస్తుంటారు. టీవీమీదున్న శ్రద్ధ నామీద లేదు. టీవీలో మాటల్ని విన్నంత శ్రద్ధగా నా మాటలను వినరు. నేను నా గురించి ఏవేవో చెప్పాలనుకుంటాను. నా ఫ్రెండ్స్ గురించి చెప్పొలనుంటుంది. వారితో కలిసి అన్నం తినాలని ఉంటుంది. కానీ నేను నోరు విప్పడానికే వీలుండదు. అన్నం ఓ కంచెంలో పెట్టి టివిముందుంచి నన్ను తినమని తను టీవీ చూస్తుంటుంది. నాకది నచ్చడం లేదు. కనుక దేవుడా, నువ్వు నా మాటలను విని నా సమస్య తీరుస్తావనే నిన్నొకటి కోరుతున్నాను. మా అమ్మానాన్నా దృష్టి నాపైనే ఉండాలి. టీవీ చూస్తే చూడనివ్వు. కానీ నన్ను పట్టించుకోవాలి. నాన్న నాతో ఆడుకునేలా చెయ్యి. అమ్మానాన్నలతో కలిసి అన్నం తినాలి. ఇవేవీ చెయ్యలేనని నువ్వనుకుంటే నన్ను ఓ టీవీలా మార్చేసే"
అని ఏవేవో రాశాడా విద్యార్థి. 
అది చదివిన భర్త "ఆ కుర్రాడెంత బాగా రాసాడే...వాడి బాధ మాటల్లో చెప్పలేను. అ అబ్బాయి తల్లిదండ్రుల తీరును కళ్ళకు కట్టినట్టు రాశాడే. ఈకాలం పేరంట్స్ మారరే. వాళ్ళకు పిల్లలకన్నా టీవీ చూడటమే గొప్పనుకుంటున్నారు. ఛీ...వాళ్ళసలు తల్లిదండ్రులేనా? తమ బిడ్డను నిర్లక్ష్యం చేసే ఆ తల్లిదండ్రులకెప్పుడు బుద్ధొస్తుందో? ఆ దేవుడు ఆ అబ్బయి మొర ఆలకించి ఎట్టా పరిష్కరిస్తాడో సమస్యని?" ఆన్నాడు.
భర్త చెప్పిన మాటలన్నీ విన్న ఆమె "ఈ వ్యాసం మరెవరో రాయలేదండీ. మన అబ్బాయి రాశాడు" అనడంతోనే అతను నాలిక్కరచుకున్నాడు. తామెంత తప్పు చేస్తున్నామో తెలుసుకున్నాడు.
కనుక తల్లిదండ్రులు బంగారు సమయాన్ని పిల్లలతో గడపడం అలవరచుకోవాలి


కామెంట్‌లు