కాణిపాక క్షేత్ర గాధ; - సి.హెచ్.ప్రతాప్
 ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా, ఐరాల మండలం, కాణిపాకంలో వెలసిన గణపతి క్షేత్రం దేశంలోని ఇతర గణపతి క్షేత్రాలలో కెల్లా భిన్నమైనది. ఇక్కడి దేవుడిని సత్య ర్ప్రమాణాల దేవుడు గా కీర్తిస్తారు. ఈ క్షేత్రం బాహుదా నదీతీరంలో ఉంది. ఈ క్షేత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికర గాథ ప్రచారంలో వుంది.
బాహుదా నది పరివాహక ప్రాంతంలో విహార పురం గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు వుండేవారు. పెద్దవాడు అంధుడు, మధ్యముడు మూగవాడు కాగా చిన్నవాడు బధిరుడు.వారికి తల్లిదండ్రుల నుండి ఒక కాణీ భూమి సంక్రమించగా, ముగ్గురూ కలిసికట్టుగా వ్యవసాయం చేసుకునే వారు. ఒక ఏడాది వర్షాలు పడక వారి వ్యవసాయ క్షేత్రంలోని బావి ఎండిపోయింది.బావి లోతు తీస్తే నీరు వుండవచ్చునని ముగ్గురూ సామాగ్రితో బావి లోకి దిగారు. తవ్వుతుంటే ఒక రాయి అడ్డం వచ్చింది. ఒకడు పారతో ఆ బండపై  వేసిన పోటు వలన రక్తం జివ్వున చిమ్మింది. ఆ రక్తపు స్పర్శతో ముగ్గురి వైకల్యాలు పోయి  మామూలు మనుష్యులయ్యారు అమితాశ్చర్యంతో బండపై ఇసుక తొలగించి చూస్తే గణపతి ఆ రాయి గణపతి విగ్రహం అని తెలుసుకున్నారు.  

అలా ఆ బావిలో స్వయంభువుగా వెలసిన గణపతి మహిమలు అతి త్వరగా ఊరూ వాడా పాకి హక్తులు తండోప తండాలుగా రాసాగారు.వారు కొట్టిన కొబ్బరికాయల నీరుతో ఆ అన్నదమ్ముల కాణి పొలం అంతా తడిసిపోయిందని, క్షణాలలో అక్కడ అద్భుతమైన పంట మొలచిందని భక్తులు చెబుతారు. కాణీ విస్తీర్ణంలో ఉన్న పొలంలో కొబ్బరి నీరు పారినందున ఈ క్షేత్రానికి కాణిపారకం ( పారకం అంటే ప్రవహించడం) అనే పేరు వచ్చిందని ఒక గాధ  ప్రచారం లో వుంది.ఈ ఆలయానికి దాదాపు వెయ్యేళ్ళ చరిత్ర వుందని శాసనాలు చెబుతున్నాయి. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే వుంటుంది. అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడా వున్నది దానిలో స్వామి వారి వాహనము ఎలుక ఉంది. అక్కడ స్వామివారికి, మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి.

కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.
సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా? అంటూ సవాల్ విసురుతారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు


కామెంట్‌లు