నాగార్జున కొండ.; - డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 సుప్రసిద్ధ బౌద్ధ దార్శనికుడు ఆచార్య నాగార్జునుడు పేర వెలసినది నాగార్జున కొండ. ఇది చారిత్రక పట్టణం కాగా ప్రస్తుతం ఒక ద్వీపం. శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునుని కొరకు శ్రీపర్వతంపై మహాచైత్య విహారాలను నిర్మించాడని ఇతిహాసం తెలియజేస్తుంది. నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో బయల్పడిన, సా.శ.పూ. 2వ శతాబ్దపు బౌద్ధావశేషాలను జలాశయం మధ్య కొండపై నిర్మింపబడిన ప్రదర్శనశాలలో భద్రపరిచారు. ఈ ద్వీపపు ప్రదర్శనశాల ప్రపంచంలోని పురావస్తు ప్రదర్శనశాలలన్నిటిలోనూ అతిపెద్ద ద్వీప ప్రదర్శనశాల. బుద్ధునివిగా చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇందులో చూడదగ్గవి. అమరావతి స్తూపం చారిత్రక స్థలం నుండి ఇది పశ్చిమంగా 160 కి.మీ దూరంలో ఉంది.
మహాయాన బౌద్ధం, హిందూమతం సంబంధించిన ఆలయాల అవశేషాలు ఇక్కడవున్నాయి. ఈ స్థలం బౌద్ధక్షేత్రాలలో అత్యంత విలువైనది. ఇక్కడి బౌద్ధ విశ్వవిద్యాలయాలు, ఆరామాలలో చదువుకొనటచానికి చైనా, గాంధార, బెంగాలు, శ్రీలంక నుండి విద్యార్థులు వచ్చేవారు.
 ఇది గుంటూరు నుండి సుమారు 147 కి.మీ. దూరంలోను, హైదరాబాదు నుండి సుమారు 166 కి.మీ. దూరంలోను ఉంది. దగ్గరలోని రైల్వే స్టేషన్ మాచర్ల, సుమారు 22 కి.మీ.దూరంలో ఉంది.
నాగులు, యక్షులు మొదలైన ప్రాచీనాంధ్ర జాతులు ఈ ప్రాంతంలో నివసించేవారు. ప్రాచీన శాసనాలలో ఈ ప్రాంతం పేరు శ్రీపర్వతం. ఈ లోయ శాతవాహన రాజ్యంలో ఉండేది. దీనికి దగ్గరలో సెఠగిరి ఉండేది. నాగార్జునకొండలో లభించిన వసుసేనుని శాసనం ప్రకారం అభీరసేనుని సేనాని శివసేపుడు సెఠగిరిపై అష్టభుజ స్వామి ఆలయాన్ని నిర్మించాడు. సెఠగిరి జనాదరణ పొందిన హిందూ క్షేత్రం. ఇది శాతవాహన రాజుల ఉపరాజధాని. వీరిలో చివరివాడైన యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునాచార్యుని కొరకు శ్రీపర్వతం పైన మహాచైత్య విహారాలను నిర్మించాడు.
ఇక్ష్వాకులు ఇక్కడ శాతవాహనుల సామంతులుగా ఉండేవారు. వీరిలో వాసిష్ఠీపుత్ర శ్రీఛాంతమూలుడు నాలుగో పులోమావిపై విజయాన్ని సాధించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ఈ ప్రాంతంలో "విజయపురి" అనే పేరుతో నగరాన్ని నిర్మించి, తమ రాజధానిగా చేసుకున్నారు. నలుగురు ప్రముఖ ఇక్ష్వాకులలో శ్రీఛాంతమూలుడు అశ్వమేధ యాగం చేశాడు. ఇక్ష్వాకుల కాలంలో శ్రీపర్వతం - విజయపురి సా.శ. 200 నుండి 300 వరకు మహోజ్వలంగా విలసిల్లింది.
ఇక్ష్వాకుల తర్వాత ఈ ప్రాంతాన్ని పల్లవులు ఏలినారు. ప్రాచీన పల్లవులలో ఆద్యుడైన సింహవర్మ, తన ప్రత్యర్థులైన కదంబులకు సాయం చేశారనే నెపంతో ఇక్ష్వాకు వంశాన్ని తుదముట్టించి, బౌద్ధక్షేత్రాలను విజయపురిని ధ్వంసంచేశాడు. కర్ణాటకలోని కదంబ వంశ స్థాపకుడైన మయూరశర్మ శ్రీపర్వతాన్ని ఆక్రమించి, స్థావరం చేసికొని, బృహద్బాణులను జయించి, పల్లవులతో యుద్ధం చేశాడు. తర్వాత పల్లవులతో సంధిచేసికొని శ్రీపర్వతం వదలివెళ్ళాడు.
ఈ ప్రాంతంలో తర్వాత విష్ణు కుండినులు స్వతంత్ర రాజ్యం స్థాపించి సా.శ. 370 నుండి 570 వరకు పాలించారు. వీరి కులదైవం శ్రీపర్వతస్వామి అనే బుద్ధదేవుడు. వీరు విష్ణుమూర్తి యొక్క తొమ్మిదవ అవతారంగా బుద్ధదేవుని ఆరాధించారు.
కొంతకాలం తర్వాత ఈ ప్రాంతము కాకతీయుల పాలనలోకి వచ్చింది. కాకతీయులలో ప్రోలరాజు కుమారుడు బేతరాజు అనుమకొండలో శివాలయాన్ని నిర్మించాడు. కాకతీయుల అనంతరం ఈ ప్రాంతం కొద్దికాలం ఢిల్లీ సుల్తానుల పాలనలో ఉంది.
కొండవీడు రాజధానిగా పాలించిన రెడ్డి రాజుల కాలంలో ఈ ప్రాంతంలో నాగార్జునగిరి దుర్గాన్ని నిర్మించి, వారి రాజ్యానికి చెందిన సైనిక స్థావరాలలో దక్షిణ దుర్గంగా ఉంచారు. తర్వాత గజపతులు నాగార్జునకొండను వశపరచుకొని వారి ప్రతినిధిని ఉంచారు. పురుషోత్తమ గజపతి కాలంలో ఈ ప్రాంతం అతని ప్రతినిధి శ్రీనాథ రాజసింగరాయ మహాపాత్రుని ఆధీనంలో ఉంది. వీరు 1413 లో ఇక్కడ నాగేశ్వరలింగ ప్రతిష్ఠ చేశారు.
సా.శ. 1513 నుండి 1519 వరకు శ్రీకృష్ణదేవరాయల కళింగ దండయాత్ర జరిగింది. ఉదయగిరితో మొదలైన ఈ దండయాత్ర కందుకూరు, వినుకొండ, అద్దంకి, కవుతారం, తంగెడ, నాగార్జునకొండ, బెల్లంకొండ ల వరకు సాగింది. రాయలు గజపతుల సైనిక స్థావరాన్ని నిర్మూలించి, వశం చేసుకున్నాడు. నాగార్జునకొండలో అయ్యలయ్య, వీరభద్రయ్య అనే సేనాధిపతులను ఉంచాడు. వీరు నాగార్జునకొండను రాజకీయ పాలనాకేంద్రంగా చేశారు. నాగార్జునకొండ పేరు మొదటిసారిగా వీరి శాసనాలలో కన్పిస్తుంది. 1565 తళ్ళికోట యుద్ధంలో విజయనగర పతనం తర్వాత, ఈ దుర్గం గోల్కొండ నవాబుల ఆధీనమైనది. చివరి కుతుబ్ షాహీ ప్రభువుల శాసనాల ప్రకారం నాగార్జునకొండ దుర్గాన్ని నేటి కడప జిల్లాలోని పుష్పగిరి పీఠానికి అగ్రహారంగా ఇచ్చారు.
పురాతత్వ పరిశోధన.
1926 లో సూరపరాజు వెంకటరామయ్య అనే స్థానిక పాఠశాల ఉపాధ్యాయుడు ఒక పురాతన స్తంభాన్ని చూసి మద్రాసు ప్రసిడెన్సీ ప్రభుత్వానికి తెలియచేశాడు. మద్రాసు పురాతత్వ శాఖలో తెలుగు శాసనాల విభాగంలో పనిచేసే శ్రీ సారస్వతి స్థలాన్ని దర్శించి దీనిని పురాతన స్థలంగా పరిగణించే అవకాశాలు హెచ్చుగా వున్నట్లు గుర్తించాడు.
తొలి పరిశోధన ఫ్రెంచి పురాతత్వ శాస్త్రవేత్త గేబ్రియల్ జోవియో-డుబ్రెయుల్ (Gabriel Jouveau-Dubreuil) ఆధ్వర్యంలో 1926లో జరిగింది. ప్రణాళికాబద్ధంగా త్రవ్వకాలు ఆంగ్ల పురాతత్వవేత్త ఎ.హెచ్ లాంగ్హర్స్ట్ అధ్వర్యంలో 1927-1931లో జరిగాయి. చాలా బౌద్ధ స్తూపాల, చైత్యాల అవశేషాలు, ఇతర స్మారకాలు, శిల్పాలు త్రవ్వితీశారు.
1938లో టిఎన్ రామచంద్రన్ ఆధ్యర్యంలో ఇంకొకసారి త్రవ్వకాలు జరిగాయి. ఇంకొన్ని స్మారకాలు కనుగొనబడ్డాయి. 1954 లో నాగార్జునసాగర్ ఆనకట్ట ప్రతిపాదించడంతో ఈ ప్రాంతం నీటి మునిగే అవకాశమున్నందున ఆర్ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో పెద్దస్థాయి త్రవ్వకాలు జరిగాయి. ఇవి 1954-60 కాలంలో జరిగాయి. తొలిరాతియుగం నుండి 16వశతాబ్దం వరకు సంబంధించిన చాలా అవశేషాలు కనబడ్డాయి. 14 పెద్ద అవశేషాలను కొండపైకి మార్చారు. ప్రదర్శనశాలను ఏర్పాటుచేశారు. ఇక్కడ దొరికిన శిల్పాలు కొన్ని ఢిల్లీ, చెన్నయ్, కోల్కతా, పారిస్, న్యూయార్క్ నగరాలలోని ప్రదర్శనశాలలో ఉన్నాయి. 
పురాతత్వ శాసనాల వలన ఆంధ్ర ఇక్ష్వాకు రాజులు విరాపురుసదత్త, ఏహువుల వారి కుటుంబసభ్యులు బౌద్ధమతాన్ని ఆదరించారని తెలుస్తున్నది. దేవాలయాలు, విహారాలను ఇక్ష్వాకు రాణులు ప్రత్యేకంగా కాంతిశ్రీ10సంవత్సరాలపాటు భవనాన్ని స్తూపాని కట్టించారనటానికి శాసనాలున్నాయి. రాచరికకుటుంబాలేకాక ఇతర ధనిక సభ్యులు కూడా దానంచేసినట్లు శాసనాలలో ఉంది. ఉత్కృష్ట స్థితిలో 30 విహారాలతో దక్షిణభారతదేశంలో అతిపెద్ద బౌద్ధమత కేంద్రంగా విరాజిల్లింది. బహుశ్రుతీయ, అపరమహావినసెలియ విహారాలు శ్రీలంకలోని మహాసాంఘిక, మహిశశాక విభాగాలకు ఉపపాఠశాలలుగా వున్నట్లు శాసనాలలో ఉంది. నిర్మాణకళ ఆ విభాగాల శైలిని పోలివుంది. పురాతన తమిళ, ఒడిషా కళింగ, గాంధార, బెంగాలు, సిలోన్, చైనా నుండి వచ్చిన బౌద్ధసన్యాసులకు విహారాలున్నాయి. గౌతమ బుద్ధుని విహారాన్ని పోలివుందనిచెప్పబడే మహావిహారవాసిన్ విహార పునాదులు కనబడ్డాయి.
ఇక్కడి పెద్ద స్తూపం ఇటుక గోడల మధ్యకాక, స్తూపంపై ఇటుకల పేర్చటం లాంటిది. స్తూపానికి పెద్ద పూలదండలాంటి అలంకారం ఉంది. మూల స్తూపాన్ని యువరాణి చాంతిసిరి 3 వ శతాబ్దంలో పునర్నిర్మించినపుడు, ఆయక స్తంభాలు చేర్చబడ్డాయి. బాహ్య ప్రాకారం కర్రలతో ఇటుకల మూలమట్టంపై చేయబడింది. స్తూపం 32.3మీ వ్యాసంతో, 18 మీ ఎత్తు కలిగి, 4 మీ వెడల్పుగల ప్రదక్షిణాపథం కలిగివుంది. మేథి 1.5మీ ఎత్తు కలిగివుంది. ఆయక వేదికలు దీర్ఘచతురస్రాకారంలో 6.7X 1.5 మీ కొలతలతోనున్నాయి.
చాలవరకు హిందూఅవశేషాలు శైవానికి చెందినవి.ఒక ఆలయంలోని శాసనం దేవుడిని మహాదేవ పుష్పభద్రస్వామి (శివ) అనే పేరువుంది. కార్తికేయ (స్కంద) శిలావిగ్రహాలు రెండు ఆలయాలలోదొరికాయి. కనీసం ఒక ఆలయంలో సా.శ.278 నాటి శాసనంలో ఎనిమిది చేతుల గల దేవుని విగ్రహం వైష్ణవులకు చెందినదిగా గుర్తించబడింది. శక్తి ఆరాధనను సూచించే శిలావిగ్రహం కూడా కనుగొనబడింది.
చాలా అవశేషాలు గ్రీకు -రోము ప్రభావాన్ని సూచిస్తున్నాయి. రోమన్ నాణాలు ప్రత్యేకంగా రోమన్ ఆరై, టిబెరియస్ రాజులలోనివాడు కాలం (16-37సా.శ.) నాటివి ఫాస్టీనా ది ఎల్డర్ (141సా.శ.), ఆంటోనియస్ పయస్ కాలం నాటి ఒక నాణెం దొరికాయి. వీటివలన గ్రీకు రోమ్ వాణిజ్య సంబంధాలుండేవని తెలుస్తుంది. నాగార్జునకొండ రాజభవన స్థలంలో తేలికపాటి గడ్డం, అర్ధనగ్నంగా వుండి, ప్రక్కనే ద్రాక్షరసపీపాతో తాగుటకు వాడే కొమ్ము వాడుతున్న డయోనియస్ చిత్రం దొరికింది. 
నాగార్జునకొండ శాసనాలు ఆంధ్ర ఇక్ష్వాకు పాలన (సా.శ.210-325), బౌద్ధ నిర్మాణాలు వృద్ధిచెందడం తెలుపుతాయి.
శాసనాలు మహానగర స్థాయిలోని బౌధ్ద కార్యకలాపాల ప్రామఖ్యాన్ని తెలుపుతాయి. చాలా దేశాల సన్యాసులు ఇక్కడ వున్నట్లు తెలుస్తుంది. ఒక విహారంలోని (క్రమ సంఖ్య 38) ఒక శాసనం, కాశ్మీర్, గాంధార, యవన, ఉత్తర కనరా, శ్రీలంక ప్రజలను ఆనందింపచేసిన విభజ్యవాడ వర్గానికి చెందిన ఆచార్య, తేర వారు నివాసమున్నట్లు తెలుపుతుంది శాసనాలు, చాలాదేశాల ప్రజలు బౌద్ధమతంతో సంబంధం కలిగివున్నారని తెలుపుతున్నాయి.
ప్రాకృత, సంస్కృత భాషలు బ్రాహ్మీ లిపి వాడిన శాసనాలు కనబడ్డాయి ఈ శాసనాలు, దక్షిణ భారతదేశ సంస్కృత శాసనాలలో అతిపురాతన కాలానికి అనగా క్రీ.పూ 3 శతాబ్ది నుండి సా.శ. 4 వశతాబ్ది వరకు చెందినవి. ఇవి బౌద్ధానికి, శైవమత సంప్రదాయానికి చెందినవి, ప్రామాణిక సంస్కృత, మిశ్రితమైన సంస్కృత భాషలో ఉన్నాయి.
పశ్చిమ దేశ రాజుల ప్రభావంవలన సంస్కృత శాసనాలు వ్యాప్తి చందాయి పశ్చిమ క్షత్రపరాజులకు ఆంధ్ర ఇక్ష్వాకు రాజల మధ్య వివాహ సంబంధాలున్నాయని రుద్రపురుషదత్త కాలం నాటి శాసనం తెలుపుతుంది ఇంకొక శాసనం ప్రకారం ఇక్ష్వాకు రాజు వీరపురుషదత్త (250-275 CE) కు బహుభార్యలున్నట్లు,  వారిలో ఒకరు రుద్రధారభట్టారిక ఉజ్జయిని రాజకుమారి అని తెలుపుతుంది. 
నాగార్జునకొండలో సుమారు 400 వరకు శాసనాలు లభించాయి. వీనిలో చాలావరకు దానధర్మాలకు సంబంధించినవి. ఇవి ప్రాకృత, సంస్కృత, తెలుగు భాషలలో ఉన్నాయి. ఈ శాసనాలను అధ్యయనం కోసం ఏడు విధాలుగా విభజించారు.
ఆయక స్తంభ శాసనాలు
చైత్యగృహాలలో లభించిన శాసనాలు
పగిలిన శాసనాలు
శిల్ప ఫలకాలపైనున్న శాసనాలు
ఛాయా స్తంభ శాసనాలు
బ్రాహ్మణమత ఆలయ సంబంధ శాసనాలు
ఇతర శాసనాలు.


కామెంట్‌లు