పరీక్ష! అచ్యుతుని రాజ్యశ్రీ
 ఆగురువు తన శిష్యులందరికీ పరీక్ష పెట్టబోతున్నాడు.ఐదో ఏట చేరిన ఆపిల్లలు నేడు  యువకులు గా మారారు. వారిలో ఎంత శాంతి  ధైర్యం  స్థిరచిత్తం ఉందో పరీక్షించాలని ఆ గురువు  నిర్ణయించాడు.వారందరినీ దుర్మార్గులు  దగాకోరులు  క్రూరులున్న ప్రాంతం కి పంపాలి అని  నిర్ణయం తీసుకున్నాడు. దీన్ని బట్టి తన శిష్యులందరికీ తన ఉపదేశాలు ఎంతవరకు  అవగాహన కలిగి ఒంటబట్టించుకున్నారో తేలిపోతుంది అని ఆయన ఉద్దేశం! ఆనలుగురు శిష్యులని పిల్చాడు. "మిమ్మల్ని చాలా భయంకర ప్రాంతానికి పంపుతున్నాను.అక్కడ ఉన్న వారంతా గిల్లి కజ్జాలుపెట్టుకునే గుండెలు  తీసిన  బంట్లు! వారి మధ్య తలలో నాలుకలాగా ఉండాలి. ఎలా బైట పడతారో ?తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ". "ఫర్వాలేదు గురువుగారూ! వీర సైనికుల్లాగా మేము అన్నిటికీ సిద్ధం!"మొదటి శిష్యుడిని అడిగాడు " వారు  నీమాట వినకపోతే ఏంచేస్తావు?" " ఫర్వాలేదు గురువుగారూ!నాకన్నా మంచివారు  అని భావిస్తాను. నన్ను తిట్టలేదుకదా అని  ఆనందిస్తాను." రెండోవాడిని అడిగాడు " వారు నిన్ను అనవసరంగా తిట్టి  బడబడా అభాండాలు వేస్తే?" "ఓహ్! చాలా మంచివారు  అని భావిస్తాను. నన్ను చితకబాదకుండా తిట్లతో వదిలారని సంతృప్తి పడతాను." గురువుగారు మూడోవాడిని ప్రశ్నించారు " వారు నిన్ను అనవసరంగా దెబ్బలతో చావ చితకబాదితే?"" ఫర్వాలేదు అండీ! దెబ్బ లు  త్వరలోనే మానిపోతాయి.నన్ను ప్రాణాలతో వదిలారు కదా అని సంతోషిస్తాను. చావుతప్పి కన్ను లొట్టపోవటం అంటే ఇదేకదా?""భేష్! వారు  నీప్రాణాలు తీస్తేనో?" నాలుగో శిష్యుడి జవాబు ఇది" వారు చాలా ఉత్తములు త్వరగా నాకు ముక్తి ప్రసాదించారని భావిస్తాను. దైవప్రార్థన చేస్తూ ప్రాణం వదులుతాను."ఆనలుగురు శిష్యులజవాబులతో ఆగురువు ఆనందం ఆర్ణవమై పొంగింది.తను చెప్పి న  వేదాంత విషయాలు  జీవన సత్యాలు వారు బాగా  వంట బట్టించుకున్నారని ఆనందించాడు.
అలాగే నేడు శాంతి భద్రతలు కాపాడే పోలీసులు  త్రివిధ దళాల వీరులు తమజీవితాలు ప్రమాదంతో కూడినవి అని తెలిసీ అందులో చేరుతారు. అనుక్షణం వేయికళ్ళతో నిఘా ప్రకృతి వైపరీత్యాలు తట్టుకుంటూ భార్య బిడ్డలను విడిచి "మేరాభారత్ మహాన్ "అంటూ సాగే వారి జీవితాలు పరులకై ప్రాణాలర్పించే అమృత వెలిగిపోయే దివ్యజ్యోతులు!🙏

కామెంట్‌లు