ధనవంతుడికి పేదోడి పాఠం!;-- యామిజాల జగదీశ్
 డబ్బుంటే మాత్రం సరిపోతుందా? తృప్తికరమైన జీవితం కావాలా? మరో పూట అన్నానికి దారేది అనే స్థితిలోనూ ఓ పేదోడు తృప్తిగా జీవిస్తున్నాడు...
చాలు అనే మనసుతో ఉన్నవారు మాత్రమే ఈ ప్రపంచంలో తృప్తిగా బతుకుతున్నారు. ఉన్నవారికి ఇచ్చే మనసు రాదు. లేనివారికి సాయం చేయాలనే ఆలోచన అధికంగా ఉంది.
అనగనగా ఓ ఊరు. ఆ ఊళ్ళో ఓళధనవంతుడు. అతనింటికి దగ్గర్లో ఓ పూరిపాక. ఆ పాకలో వెంకయ్య దంపతులు నివసిస్తున్నారు. వీరికో బిడ్డ.
ఓరోజు వెంకయ్య ఓ బిందెతో ధనవంతుడు ఇంటికొచ్చి నీటికోసం వెళ్ళాడు.
అయితే ఆ ధనవంతుడు ఎవరితోనోళఫోన్లో మాట్లాడుతున్నాడు.
వెంకయ్య "అయ్యా" అని పిలిచాడు.
కాస్సేపటికి ధనవంతుడు "ఏం కావాలి?" అడిగాడు.
"అయ్యా, ఓ బిందెడు నీరు కావాలయ్యా" అన్నాడు వెంకయ్య.
"నువ్వెవరు? నీ ఇల్లెక్కడుంది?" అడిగాడు ధనవంతుడు.
"అయ్యా! అదిగోనండీ కనిపిస్తున్న ఆ పాకలోనే ఉంటున్నానండి" అని వెంకయ్య తన ఇల్లు చూపించాడు.
"ఏంటీ నీ ఇల్లు ఓ పాకా? అది ఇల్లేనా? ఇల్లంటున్నావా? నీ పాక ముందు నా భవనం ఎలా ఉందిళచూసేవా? ఇక్కడికొచ్చి నీరడగొచ్చా? పోపో...నీరూ లేదు...గీరూ లేదు" అని నిర్లక్ష్యంగా చెప్పాడు ధనవంతుడు.
వెంకయ్య మరో మాట మాటాడక అక్కడ్నుంచి ఇంటికొచ్చేసాడు.
కొన్ని రోజులు గడిచాయి.
ఆ దారిలో వెంకయ్య పోతుంటే ధనవంతుడు ఎవరితోనో ఫోన్లో పదిమందికి వినిటించేలా అరుస్తూ మాట్లాడుతున్నాడు.
అతని కొడుకు ఓ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి ఆపరేషన్ చేయడానికి రక్తం కావాల్సి వచ్చింది. 
కానీ అతని మిత్రులెవరూ రక్తమివ్వడానికి ముందుకు రావడంలేదు. దాంతో అతను ఎవరితోనో కోపంతో అరుస్తున్నాడు.
అతను మాట్లాడినదంతా విన్న వెంకయ్య ధనవంతుడి వాకిట్లోకెళ్ళి నిలబడ్డాడు.
"అయ్యా!" అని పిలిచాడు వెంకయ్య.
ఏంటీ, నీకు నీళ్ళేగా కావాలి. తీసుకుపో లోపలికొచ్చి" అని కోపంగా చెప్పాడు ధనవంతుడు.
వెంకయ్య మళ్ళీ "అయ్యా" అన్నాడు.
కానీ ధనవంతుడు వినిపించుకోకుండా ఫోన్లో మాట్లాడుతున్నాడు.
వెంకయ్య మళ్ళీ "అయ్యా" అన్నాడు.
"నీక్కావాల్సింది నీళ.ళేగా... అదిగో ఆ చెట్టుపక్కనే ఉన్న తొట్లించి తీసుకుపో నీళ్ళు" అని ధనవంతుడు మళ్ళీ ఫోన్లో మాట్లాడసాగాడు.
"అయ్యా, మీరెవరినో రక్తం అడుగుతున్నారు. నా రక్తం ఇస్తానయ్యా" అన్నాడు వెంకయ్య నెమ్మదిగా.
ఆ మాట చెవిన పడ్డాక ధనవంతుడు అతని వంక చూసాడు.
అనంతరం ధనవంతుడు శాంతంగా మాట్లాడాడు "మన్నించు. మీరు నీటి కోసం వచ్చారనుకున్నాను. రండి. ఆస్పత్రికి వెళ్దాం" అంటూళధనవంతుడు అప్పటికప్పుడు వెంకయ్యతో కలిసి ఆస్పత్రికి వెళ్ళాడు. వెంకయ్య రక్తం ఇచ్చాక ధనవంతుడి కొడుక్కి ఆపరేషన్ చేశారు. ధనవంతుడి కొడుకు కోలుకున్నాడు.
అట్పుడు వెంకయ్యతో ధనవంతుడు "నన్ను క్షమించు" అని నమస్కరించాడు.
"మిమ్మల్ని నేను మానసికంగా గాయపరిచాను నా నిర్లక్ష్య ధోరణితో" అన్నాడు ధనవంతుడు.
అనంతరం వెంకయ్య "అయ్యా. మీరలా అనొచ్చా. మేం పేదవాళ్ళం. కానీ ఆత్మాభిమానం లేనివాళ్ళం కాము. మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు. కానీ ఇతరులకు సాయం చేసే మనసుందండి" అని నెమ్మదిగా అన్నాడు మ.
 
లక్షలు ఖర్చుపెట్టి సొగసైన కారు కొనొచ్చు.   కానీ దాన్ని వాకిట్లో నిలపాల్సిందే కానీ హాల్లో పెట్టుకోరుగా.                   
వేల రూపాయలకు చెప్పులు కొనొచ్చు. వాటిని వేసుకుని నడవాల్సిందే తప్ప తల మీద పెట్టుకోరుగా.
ఓ గది నిండా డబ్బులు ఉండొచ్చు. కానీ రక్తం కావాల్సినప్పుడు డబ్బులను పిండి ఎక్కించలేరుగా.
అందుకే ఏ మనిషికి ఎవరితో ఎలాంటి అవసరం వస్తుందో ఎవరూ ఊహించలేరు. వీలైనంతవరకూ నలుగురితోనూ స్నేహభావంతో మెలగడం అవసరం.

కామెంట్‌లు