కుందేళ్ళ సంగతి;-- యామిజాల జగదీశ్
 చిన్నప్పుడు మనమందరం కుందేలు - సింహం కథను చదివే ఉంటాం. కుందేలు తన తెలివితేటలతో  సింహాన్ని బావిలో దూకించి చనిపోయేలా చేసిన కథను
శారీరక బలం కంటే బుద్ధి బలం గొప్పదని చెప్పడానికి ఉదహరిస్తుంటారు. అటువంటి కుందేలు గురించి కొన్ని సంగతులు ...
కుందేళ్లలో చాలా రకాలు ఉన్నాయి. అవి అడవి కుందేళ్ళు. పెంపుడు కుందేళ్ళు. ఇవి
బరువును బట్టి మూడు రకాలు. ఒకటి, అధిక బరువున్న జాతులు.  వీటి బరువు 4 నుండి 6 కిలోల వరకూ ఉంటుంది. ఇక రెండవది, మధ్యరకపు బరువున్న జాతులు. వీటి బరువు 3 నుండి 4 కిలోలవరకూ ఉంటుంది. మూడవ రకం బరువు 2 నుండి 3 కిలోల వరకూ ఉంటుంది.
సాధారణంగా మన కంటికి కనిపించేవి కొన్ని రకాల కుందేళ్ళే.  ఓ అయిదేళ్ళ క్రితం, ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలలో కనీసం 305 జాతుల దేశీయ కుందేళ్ళను గుర్తించారు. ఉన్నాయి. కొన్నింటికి చెవులు ముడుచుకున్నాయట!
కుందేళ్ళను విధేయతగల జంతువుగా పరిగణిస్తారు. ఇవి సాధారణంగా ప్రకృతికి అనుగుణంగా జీవించేవి. అడవి కుందేళ్ళు మనుషులను చూడగానే పారిపోతాయి. కానీ పెంపుడు కుందేళ్ళు అట్లా పారిపోవు. మనుషులతో సులభంగా కలసిపోతాయి. 
కుందేళ్ళు మొక్కలను మాత్రమే తింటాయి. అయితే, తల్లి కుందేళ్ళు భయంతో తమ పిల్లలను తినేస్తాయి. మాంసాహారుల నుండి రక్షించే క్రమంలో అవి ఈ పని చేస్తాయి. అయితే, అన్ని కుందేళ్ళూ ఇలా చేయవు. కొన్ని మాత్రమే ఇలా విచిత్రంగా వ్యవహరిస్తాయి.
కుందేళ్ళు పూర్తిగా శాకాహారులు. కుందేళ్ళు క్యారెట్లను ఇష్టపడితింటాయని ఎక్కువ మంది చెప్పే మాట. కానీ నిజానికి, అడవి కుందేళ్ళు క్యారెట్లను తినవు. అవి భూగర్భంలో పెరిగే కూరగాయలకు దూరంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా గడ్డి, ఆకులు తింటాయి. క్యారెట్లను పెంపుడు కుందేళ్ళకు తినిపిస్తారు, కాబట్టి అవి వేరే ఎంపిక లేకుండా వాటిని తింటాయి.
కుందేళ్ళు లెపోరిడే కుటుంబానికి చెందినవి.  దక్షిణాసియాలో కొన్ని కుందేళ్ళ  చెవులు, వెనక కాళ్ళూ పెద్దవి. వాటిని అడవి కుందేలు అని కూడా అంటారు. ఇంట్లో వీటిని పెంచకూడదని నిషేధించారు.
కుందేళ్ళ దంతాలు పెరుగుతూనే ఉంటాయి. గడ్డి, అడవి పువ్వులు మొదలైన వాటిని తినడంవల్ల వీటి దంతాలు పాడవుతాయి.
కుందేళ్ళు మొదటగా యూరప్, ఆఫ్రికాకు చెందినవే. అనంతరం అవి ప్రపంచ మంతటా వ్యాపించాయి!
కుందేళ్ళ జీవితకాలం 9 నుండి 12 ఏళ్ళు. అయితే  కొన్ని జాతుల అడవి కుందేళ్ళు కేవలం రెండేళ్ళు మాత్రమే జీవిస్తాయి.
కుందేళ్ళు శుభ్రతకు మారు పేరు. వీటికి
స్నానం చేయవలసిన అవసరం లేదు. ఇవి తన నోటి నుండి వచ్చే లాలాజలంతో శరీరాన్ని శుభ్రపరచుకుంటాయి.
ఆరోగ్యకరమైన కుందేళ్ళ బొచ్చు మెరుస్తుంటుంది. ఇవి చాలా చలాకీగా ఉంటాయి. ఇవి క్రమంగా బరువు పెరుగుతాయి.
అయితే అనారోగ్య కుందేలు నిస్తేజంగా, నీరసించి ఉంటుంది. శారీరక బరువు కృశించిపోతుంటుంది. బొచ్చు ఊడిపోతుం టుంది. అస్సలు చలాకీగా ఉండదు. ఎక్కువసేపు ఒకేచోట ఉంటుంది. దీని శారీరక ఉష్ణోగ్రత, శ్వాస నిలకడగా ఉండదు.
ఫ్లెమిష్ జెయింట్ జాతి కుందేళ్ళు ప్రపంచంలోనే అతి పెద్దవి. ఇవి 2.5 అడుగుల పొడవు, 22 పౌండ్ల వరకు బరువూ ఉంటాయి. కానీ ఇవి సున్నితమైనవి. అందుకే ఈ జాతికుందేళ్ళను  ఇళ్ళల్లో పెంచుకుంటారు. 
కుందేళ్ళు వాంతులు చేసుకోలేవు. ఇవి బాగా దూకుతాయి. ముందరకాళ్ళనే దూకడానికి ఉపయోగిస్తాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం,  3.26 అడుగుల మేరకు దూకుతాయి. కొన్నయితే దాదాపు పది అడుగుల వరకూ దూకుతాయి. వీటి చెవులు చల్లగా ఉండటానికి దోహదపడతాయి. 
కుందేళ్ళ వినికిడి శక్తి ఎక్కువే. ఇవి తమ చెవులను 270 డిగ్రీలవరకూ అటూఇటూ తిప్పగలవు, ఇందువల్ల ఇవి 2 మైళ్ల దూరందాకా శబ్దాలను వినగలవు.
కుందేళ్ళను చెవులపిల్లి అని కూడా అంటారు.





కామెంట్‌లు