సహనానికి మారుపేరు వెదురు చెట్లు;-- యామిజాల జగదీశ్
 ఔను, సహనానికి ప్రతీక వెదురు చెట్లు. 
వెదురుని నాటి నీరు పోస్తారు. రోజులు గడుస్తుంటాయి. కానీ  అది ఎదగనే ఎదగదు. ఒక్క అంగుళమైనా ఎదగక మంకుపట్టు పట్టి ఎలా నాటామో అలాగే ఉంటుంది. దాదాపు ఓ నాలుగేళ్ళపాటు అట్టాగే ఉంటుంది. అయితే అది ఎదిగేవరకూ నీరుపోసే మనిషి ఓపిక పట్టక తప్పదు. అప్పటివరకూ అతను దాని గురించి ఆనందించడానికో శ్లాఘించడానికో ఏమీ ఉండదు. 
కానీ ఆ తర్వాత అందరూ ఆశ్చర్యపోయేలా అది ఎదగడం మొదలవుతుంది. అదెట్టా? నిన్న రాత్రి వరకూ కూడా ఎదిగే జాడే లేదనుకున్న మనిషి ఏమాత్రం ఊహించనంతగా చకచకమని ఎదగడం మొదలుపెడుతుంది. ఒక్క ఏడాదిలోనే దాని ఎదుగుదల ఎంత ఉంటుందో తెలుసా? రమారమి ఎనబై అడుగులు. 
నాలుగేళ్ళ పాటు మౌనంగా ఉండిన ఈ చెట్టు అయిదో ఏడాదిలో ఎట్టా విశ్వరూపం ఎత్తుతుంది?
పరిశోధించి చూడగా ఆశ్చర్యపరిచే ఓ రహస్యం ఇందులో ఉండటాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రకృతి అద్భుతమూ భగవంతుడి సృష్టి మహత్వమది.
తొలి నాలుగేళ్ళూ ఆ వెదురు వేళ్ళు భూమిలోకి చక్కగా వ్యాపించి బలంగా పట్టుకుంటుంది. అయిదో ఏడాది ఎనబై అడుగుల ఎత్తు ఎదగబోతున్నాను కనుక నన్ను బలంగా పట్టుకునే శక్తి నా వేళ్ళకు అవసరం అని వెదురు భూమి లోపల తనను అన్ని విధాలా తయారుచేసు కుంటుంది 
అందుకే అయిదో ఏడాది ఊహాతీత ఎదుగుదల సమయంలో అది తడబడదు. డీలా పడదు. పట్టు తప్పదు. 
సహనమే ఉన్నతికి కావలసిన విజయాలను కల్పించుకుంటుంది. అంతేతప్ప తొందరపడి చకచకమని ఎదిగి పడిపోకుండా మన పునాది గట్టిగా ఉండేటట్లు చూసుకోవాలి. అందుకు కావలసింది సహనం.
ఊపిరి ఉన్నంత వరకూ ప్రయత్నిద్దాం. ప్రయత్నిస్తే అసాధ్యమంటూ ఏదీ ఉండదు.
మొదట్లో మౌనంగా ఉండిన వెదురు ఆ తర్వాత ఎదిగి పురాతన సంగీత వాయిద్యాలలో ఒకటైన వేణువవుతుంది.
ఈ దశలోనూ దానికున్న సహనం విశేషం. 
ఐరోపా, ఆసియా దేశాలలో పదివేల సంవత్సరాల క్రితమే "వెదురుతో చేసిన వేణువులు" ఉన్నట్టు చరిత్ర పుటల మాట. 
ఈ వెదురు వేణువులు చైనా, భారతదేశం నుంచి పట్టు రహదారి వెంబడి,  మహాసముద్రాల మీదుగా ఆగ్నేయాసియా, ఆఫ్రికా ఖండం వరకు వ్యాపించాయి. అమెరికన్లు సైతం వెదురు వేణువులను తయారు చేసినట్టు చరిత్రకారులు కనుగొన్నారు. చైనీస్ భాషలో Zhudi అనే మాట ఉంది. దీని అర్థం "వెదురు వేణంవు"
మన భారతీయ వేణువులలో రెండు ప్రధాన రకాలున్నాయి. అవి, బాన్సురి. ఇందులో ఆరు రంధ్రాలుంటాయి. హిందుస్థానీ సంగీతంలో ఉపయోగిస్తారు. మరొకటి ఎనిమిది రంధ్రాలతో కూడిన వేణువు. ఒకానొకప్పుడు ఏడు రంధ్రాలుండేవి. దక్షిణ భారతదేశంలో నాగర్కోయిల్ (తమిళనాడు)లో శ్రేష్టమైన వెదురు లభిస్తుంది. ఈ వెదురు నుంచి వేణువులెక్కువగా తయారు చేస్తారు.

కామెంట్‌లు