అవలక్షణం;-: సి.హెచ్.ప్రతాప్
 తప్పులెన్ను వారు తండోపతండంబు
ఉర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పు లెన్ను వారు తమ తప్పులెరుగరు
విశ్వదాభి రామ వినురవేమ

ఈ ప్రపంచంలో ఇతరుల తప్పులను ఎత్తి చూపేవారు కోకొల్లలు. జనులందరిలో ఏదో ఒక తప్పు ఉండనే ఉంటుంది. ఇత‌రుల్లో త‌ప్పులు ఎంచే ఈ మనుషులు తమ తప్పులను తెలుసుకొనలేరు. తప్పులను చేయడం మానవ సహజం . నేటి సమాజంలో తమను తాము పొగుడుకుంటూ (స్వోత్కర్ష) ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం సర్వ సాధారణమైపోయింది.  ఇటువంటి వారు ఇతరులను తక్కువ చేసేందుకు వారిలోని దోషాలను, వారు చేసే పనులలో తప్పులు ఎంచడం అనే సాధనాన్ని ఎంచుకుంటారు. ఇతరులలోని తప్పులే వీరికి కనబడుతుంటాయి. ఇందువలన మనలోని అహంకారం పెరిగి చివరకు మన పతనానికే దారి తీస్తుంది. ఇటువంటి విపరీత మనస్థత్వాన్ని తొలగించుకోవాల్సిన అవసరాన్ని పై పద్యం తెలియజేస్తోంది. 

తప్పులు చేయడం మానవ సహజం. నిజానికి తప్పులు చేయని వారు ఎవరూ వుండరు.నిత్య జీవితంలో మనం స్వయంగా ఎన్నో తప్పులు చేస్తుంటే ఇక ఇతరుల పనులలో తప్పులు వెదికే అర్హత మనకు ఎక్కడ వుంది ? కాబట్టి ఈ దోషాన్ని తక్షణం సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఇతరుల తప్పులను సహించడం, వీలైతే వాటిని క్షమించగలగడం మంచి లక్షణాలు. అందుకే క్రీస్తు ఇతరుల కంటిలో నలుసును తొలగించే ముందు నీ కంటిలో దూలాన్ని తొలగించుకో అని అన్నాడు.
కామెంట్‌లు