అదనపు కలెక్టర్ చేతుల మీదుగా ఈర్ల సమ్మయ్యకు ఘన సన్మానం


 75వ స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలలో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మంగళవారం పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొని ప్రతిభ కనపరిచిన ఉపాధ్యాయుడు, కవి, సామాజిక వేత్త ఈర్ల సమ్మయ్యను పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీనారాయణ, డీఈఓ మాధవి, జిల్లా ఉన్నతాధికారులు ఘనంగా సన్మానించారు. ఈర్ల సమ్మయ్య కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పాఠశాల అభివృద్ధికి ఆయన అహర్నిశలు పాటు పడుతున్నారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా, వారి సర్వతోముఖాభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నారు. అలాగే సాహిత్య, సామాజిక రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన ఈ కవి సమ్మేళనంలో 'అమరుల ఆశయాలు నెరవేరుద్దాం' అనే శీర్షికతో దేశభక్తిని పెంపొందించే కవితను రాసి, వినిపించారు. ఇందుకు గాను జిల్లా అదనపు కలెక్టర్, డీఈఓ, ఇతర జిల్లా ఉన్నతాధికారులు ఈర్ల సమ్మయ్య ను అభినందిస్తూ శాలువా కప్పి, ప్రశంసా పత్రాన్ని అందజేసి, ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎస్.ఎం.సి కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యులు, విద్యార్థినీ, విద్యార్థులు, యువతీ, యువకులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, పలువురు ఈర్ల సమ్మయ్యను అభినందించారు.
కామెంట్‌లు