స్వేచ్చ;-: సి.హెచ్.ప్రతాప్
 ఒక రోజు ఉదయం రాజకుమారుడైన  సిద్ధార్థ మరియు అతని బంధువు దేవదత్త అడవుల్లో విహరిస్తున్నారు. ఆకాశంలో ఎగురుతున్న తెల్లగా, ఎంతో అందంగా వున్న హంసను దేవదత్తునికి చూపించాడు సిద్ధార్థ. సిద్ధార్థుడు అతడిని ఆపకముందే, దేవదత్తుడు దానిపై బాణం విసిరాడు.
బాణం తగిలి పక్షి కింద పడిపోయి బాధతో విలవిలలాడి పోసాగింది.. దానిని చూసి వాళ్ళిద్దరూ  అటువైపు పరుగెత్తారు. సంఘటనా స్థలానికి మొదట చేరుకున్నాడు సిద్ధార్థ. అతను పక్షిని ఎత్తుకుని, బాణాన్ని మెల్లగా తీసేసి, దాని గాయాన్ని నయం చేశాడు. అంతలోనే దేవదత్తుడు అక్కడికి చేరుకున్నాడు. "పక్షిని ఇవ్వు, అది నాది" అన్నాడు దేవదత్తుడు. పక్షిని అతనికి ఇవ్వడానికి  సిద్ధార్ధుడు   నిరాకరించాడు. ఇద్దరి మధ్య తగువు పెరిగి చివరకు దేవదత్తుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
“నేను బాణం వేసి ఆ పక్షిని కొట్టాను . అది నాకే చెందుతుంది” అన్నాడు దేవదత్తుడు.
"నేను దాని గాయాన్ని నయం చేసాను కాబట్టి అది నాకే చెందుతుంది " అన్నాడు సిద్ధార్థ.
న్యాయమూర్తి సిద్ధార్థ పట్టుకున్న పక్షిని చూశాడు.
"మీ బాణంతో పక్షి చంపబడి ఉంటే, మీరు దానిని  స్వంతం చేసుకోవచ్చు" అని న్యాయమూర్తి అన్నారు. “కానీ సిద్ధార్థ కాపాడాడు. పక్షి దానిని రక్షించిన వారికే చెందుతుంది, చంపడానికి ప్రయత్నించిన వారికి కాదు” అన్నాడు తెలివైన న్యాయమూర్తి.
అప్పటికి గాయం మానింది, పక్షి పూర్తిగా కోలుకుంది. సిద్ధార్థ ఆ హంసను గాలిలోకి విసిరేసి “ దానిని స్వేచ్చా ప్రపంచంలోనికి వెళ్ళనివ్వండి.పక్షికి స్వేచ్ఛ ఉంది. అది ఎవరికీ చెందదు. మనం ఖైదులో బంధింపబడితే ఎంత బాధపడతామో, స్వాతంత్రం కోసం ఎంతగా అర్రులు చాస్తామో, పక్షులు, జంతువులు కూడా అంతే. వాటికీ స్వేచ్చగా ఎగరాలని వుంటుంది. వాటి స్వేచ్చను అడ్డుకోవడం మహాపాపం. ఈ సృష్టిలో పక్షైనా, పురుగైన, క్రిమి కీటకాదులైనా, మనుష్యులైనా  అందరికీ ఒకే న్యాయం వర్తిస్తుంది"” అన్నాడు సిద్ధార్థుడు గాలిలో ఎగురుతూ హంసను చూస్తూ.
ఆ మాటలలోని అంతరార్ధాన్ని గ్రహించిన దేవదత్తుడు  సిగ్గుతో తలవంచుకున్నాడు.


కామెంట్‌లు