సెల్ఫీతో సమీక్ష;-- జగదీశ్ యామిజాల
 ఇటీవల ఓ మిత్రుడు అర్జంటుగా 
ఓ ఫోటో పంపండంటే
పాత ఫోటోలుంటాయేమోనని
వెతికానొక సంచీలో...
కానీ మరీ చిన్నప్పటివున్నాయి
లాభం లేదనుకున్నా
ఏం చేయాలని ఆలోచించగా 
సెల్ఫీ ఉండనే ఉందనుకుని
నాకు నేను ఓ ఫోటో తీసుకుని 
పంపాను ....
కాస్సేపటికే
ఫోటో అడిగిన మిత్రుడి నుంచి
స్పందన
"మీలో మరీ ఇంత మార్పు వచ్చిందేమిటీ" అని
ఆయన మాటతో 
తీసుకున్న సెల్ఫీ ఫోటోలోకి 
చూసాను
ఒకటికి రెండుసార్లు
ఔను
మిత్రుడన్నది కరెక్టే
నా ఫోటోలోని నా మోమే
నాకు కొత్తగా అన్పించినా
మార్పు సహజమేగా
మరో ఏడాదిన్నరలో 
ఏడు పదులలోకి అడుగుపెట్టబోయే
నా రూపంలో మార్పులు సహజమే
ముడతలు పడిన శరీరం
లోతుకుపోయిన కళ్ళు
మరీ లావోడ్నీ కాను
అలాగని సన్నోడ్నీ కాను
మధ్యస్తుడిని
తలమీద భూతద్దం పెట్టి చూసినా 
ఒక్క నల్ల వెంట్రుకైనా కన్పించదు
నవ్వితే పళ్ళు ఒకటీ అరా కన్పిస్తాయి
ఆకారంలో మార్పులు సరే
కానీ 
మారని గుణాలున్నాయి
పుట్టుకతో వచ్చిన గుణాలు
పాడెక్కే వరకూ వదలవన్నవి 
నిజమన్నట్టు
బెరుకుతనమూ
వేగంగా మాటలనేయడమూ
తెలిసిన పనైనా చేయగలనా అనే భయమూ
మాటివ్వడానికి జంకూ
చదువుకోలేదన్న తలంపూ
అనుకున్నట్టు జరగకుంటే సణుగుడూ
దగ్గరవడమూ
దూరమవడమూ
సహనలేమి
అలాగని అందితే జుత్తూ
అందకుంటే కాళ్ళూ అనే బాపతు కాకున్నా
ధైర్యం లేదు కానీ
భయాలకేం బోలుడంత ఉంది
ఆస్తిపాస్తులల్లా ముక్కుమీద కోపం
అల్లంతలోనే అణగారడం
ఎన్నని చెప్పనిట్టా
అక్షరాలన్నీ అయిపోవాల్సిందే తప్ప
నన్ను వీడని తీరుతెన్నులనేకం...
అవును
మారిందాకారమూ
మారనిది గుణమూ


కామెంట్‌లు