తొంబై రెండేళ్ళ క్రితం నాటిది!;-- యామిజాల జగదీశ్
 కొన్ని రోజుల క్రితం సామాజిక మాధ్యమాలలో ఒకరిద్దరు ఒకటో క్లాసు, రెండో క్లాసు తెలుగు పుస్తకాలు పోస్ట్ చేయడం చూసాను. అవి చూస్తుంటే ముచ్చటేసింది. అవి పోస్ట్ చేసిన వాళ్ళు పెద్దవాళ్ళే. మా తమ్ముడి కూతురు పవిత్ర తన చిన్నప్పటి క్లాస్ పుస్తకొలు వంటివి ఇప్పటికీ ఎంతో పదిలంగా దాచుకోవడం ఎరుగుదును. నా మిత్రుడు జొన్నలగడ్డ లక్ష్మీనరసింహారావుగారింట మూడో క్లాసు పుస్తకం చూసినట్టు గుర్తు. అది ఆయన మేనకోడలు దాచుకున్న పుస్తకమన్నారు.  అలా ఇంకొందరు కూడా దాచుకుని ఉండొచ్చు.
కానీ నేనలా దాచుకున్న సంఘటనలే లేవు. ఓ క్లాసు నుంచి పైతరగతికి వెళ్తున్నప్పుడు పాత పుస్తకాలను ఎవరికో ఒకరికి ఇచ్చేసేవాడిని. లేకుంటే తూకంలో అమ్మేసి వచ్చిన డబ్బులతో ఓ సినిమా చూసేవాడిని. 
కొన్ని నెలల క్రితం మా పక్క వాటా కుర్రాడు తనీష్ కోసం తెలుగు వర్ణమాలను పరిచయం చేసే ఓ బుల్లి పుస్తకం కొనిచ్చాం. అ - అమ్మ, ఆ - ఆకు ఇలా చిన్న చిన్న మాటలిచ్చి వాటికి బొమ్మలుకూడా వేశారు. ఆ పుస్తకమంతా వర్ణమయమే. అది చూస్తుంటే మళ్ళా ఒకటో క్లాస్ చదవాలన్నంత ఆశ కలిగింది. అప్పట్లో ఎన్నేసి మార్కులు వచ్చాయో తెలీదు కానీ చిన్నప్పుడు డిక్టేషన్ రాయడం మహా ఇష్టం.టీచర్ చెప్పే మాటలను తప్పుల్లేకుండా రాయాలి. అందులో ఎప్పుడూ తప్పులు రాసిన మాటలు - ధృతరాష్ట్రుడు, విష్వక్సేనుడు వంటివి. 
అయితే ఈమధ్య ఓ పుస్తకం తాలూకు జిరాక్స్ ప్రతి నా దృష్టికి వచ్చింది. అది ఇప్పటిది కాదు. తొమ్మిది దశాబ్దాల క్రితం నాటిది. ఆ పుస్తకం పేరు "తెలుగు పాఠములు" - మొదటి వాచకం. ముప్పై రెండు పేజీల పుస్తకం. ఇందులో పద్దెనిమిది బుల్లి కథలు, ఎనిమిది చిన్ని చిన్ని కవితలున్నాయి. దీని ధర మూడు అణాలు. తెనాలిలోని రజత ప్రెస్సులో ముద్రించారు. దీని ప్రచురణ కర్త - వరూధినీ ప్రచురణాలయము : తెనాలి. ఇదంతాసరే కానీ ఈ పుస్తక రచయిత మరెవరో కాదు... తన కథాంశాలతో సొగసైన శైలితో తెలుగు పాఠకుల అభిమానాన్ని పొందిన ప్రముఖ రచయిత గుడిపాటి వేంకటచలంగారు. ఆయన పేరు పక్కన బి.ఎ.ఎల్.టి అని  ప్రచురించారు. ఇలా అచ్చులో చలం అని కాకుండా డిగ్రీలతోనూ పూర్తి పేరుతోనూ ఓ తరగతి పుస్తకం అచ్చులో చూడటం నాకైతే ఇదే తొలిసారి.
ఎందుకంటే నాకు తెలిసి ఆయన నవలల విషయంలోకానీ కథల పుస్తకాల విషయంలో కానీ మ్యూజింగ్స్ పుస్తకంలో కానీ ప్రేమలేఖలు పుస్తకంలో కానీ లేక మరే పుస్తకంలో కానీ ఇలా పూర్తి పేరు డిగ్రీలతో అచ్చయినట్టు నేనెరగను. చలం అనే ఉంటుంది. 
చలంగారు పిల్లలకు ఓ పాఠ్యపుస్తకం కూడా రాసినట్లు ఈ జిరాక్స్ ప్రతి వల్ల తెలిసింది. 
ఆవు దూడ, సీతాకోకచిలుక, సోమరాజు, కొంటె గోపాలుడు, కామాక్షి, మోటారు, చెరువు, లచ్చి, కుక్క, చామంతిపువ్వులు, నా బొమ్మ, నేను అత్తయ్యను, కల, విశ్వనాథము, టోపి, వినాయకచవితి, అమరావతి - 1, అమరావతి - 2 అనే శీర్షికలతో కథలున్నాయి. 
శీర్షికలు లేకుండా ఎనిమిది బుల్లి బుల్లి కవితలూ ఉన్నాయి.
నా దగ్గరున్నది జిరాక్స్ ప్రతి అయినప్పటికీ ఒరిజినల్ పుస్తకం చూసినంత ఆనందమేసింది. అంతేకాదు కథలు చదువుతుంటే చలంగారు ఎదుటుండి కథలు చదివి వినిపిస్తున్నట్లు ఫీలయ్యాను. చిన్న చిన్న మాటలూ.... పొట్టి వాక్యాలూ...చదువుతుంటే బలేగా అన్పించాయి. 
మచ్చుకి ఓ కథ...
శీర్షిక - కల
-------------
అన్నయ్యా, నాకు రాత్రి ముచి కల వచ్చినది. విను. నీవుకూడ ఉన్నావు నా కలలో. నేనును, నీవును మనమిద్దరమే రైలు ఎక్కి వెళ్ళుచున్నాము. ఎక్కడికో, మన ప్రక్క ఒక చక్కని ఆమె కూర్చుని ఉన్నది. నన్ను చూచి ముద్దు వచ్చి నాకు నాలుగు జామిపండ్లును కోవా మిఠాయి ఇచ్చినది అది చూచి నీవు ఆమెను అడిగినావు. కాని నీకు ఇయ్యను పొమ్మన్నది. అప్పుడు నీవు నన్ను బతిమాలినావు. ఎప్పుడును నన్ను కొట్టకపోయిన ఇచ్చెదనంటిని. నీవు అందుకు ఒప్పుకొని ఒక జామిపండును కొంచెము మిఠాయియు తిన్నావు. ఇంతలో నా ప్రక్క కూర్చున్న ఆమె మన అత్తగా మారినది. ఎంత బాగుగా ఉన్నదను కొన్నావు! ఆమె బుగ్గలు నున్నగా గులాబి రేకులవలె ఉన్నవి. ఆమె జుట్టు నున్నగా పెద్దగా చీకటివలె ఉన్నది. ఆమె చీరె సూర్యుడి మీద కమ్మిన నల్లని మబ్బులాగు ఉన్నది.ఈ అత్త అంత బాగుగా ఉన్నదా? ఎప్పుడు కోపమే! ఈమె చెంపలు నారింజపండ్ల లాగున ఉన్నవి. ఆమె నన్ను తన ఒడిలో కూర్చుండ పెట్టుకొని నా తలను వాసన చూచినది. రైలు ఎక్కడో ఒక ఊరి వద్ద ఆగినది. 
ఒక భయంకరమైన నల్లని మనుష్యుడు వచ్చి అత్తను రమ్మని అడిగినాడు. అత్త రానని ఏడ్చినది. రావా అని అత్తను జుట్టు పట్టుకుని లాగినాడు. పాపము అత్త ఏమి చేయును?
నా వంక జాలిగా చూచినది. నాకు ఎంతో ఏడుపు వచ్చినది. చప్పున నా చేతిలో కత్తి తీసి వాని మీదికి దూకినాను. వాడు నా మెడ పట్టుకుని విసిరి రైలు క్రింద పడవేసినాడు. 
నాకు మెళుకువ వచ్చినది.  వణికి అమ్మను కౌగలించుకొన్నాను.
-------------
ఓ కవిత
-------------
గోరింట పువ్వు వంటి కొడుకు నెత్తుకొని
బాలింత వచ్చింది బావి నీళ్ళక్కు
ఏదేది బాలింత యెంత చక్కందొ
మా చిన్న పట్టు చీరె మణవలకు పసుపు
కళ్ళకీ కాటుక పళ్ళదీ యెరుపు
మావాడ బాలింత అబ్బాయి తల్లి.
----------------
నిజానికి నా దగ్గర కొన్ని సంవత్సరాల క్రితమే ఈ జిరాక్స్ ప్రతి ఉండేది. అది ఎవరికి ఇచ్చానో తెలీలేదు. దాంతో మా అన్నయ్య ఆనందుని అడిగాను మరో ప్రతి దొరుకుతుందాని. అలాగే ఆన్న అన్నయ్య ఈ నెల రెండో తేదీన ఈ జిరాక్స్ పేజీలు ఇస్తే కుట్టుకుని అట్ట వేసుకుని దాచుకున్నాను. 
చలంగారు ఇది కాకుండా మరేవైనా పాఠ్యపుస్తకాలు రాసారాని కనుక్కోవడానికి చిత్రగారి అమ్మాయి కిట్టూకి ఫోన్ చేసాను. తనకు తెలీదంది. కిట్టూనడగడానికి కారణం తను చిన్నప్పుడు అరుణాచలంలోని చలంగారింటే (రమణస్థాన్) పెరిగింది. 
ఏదైతేనేం చలంగారు రాసిన మొదటి వాచకము పుస్తకం తాలూకు నకలు ప్రతైనా నా దగ్గరున్నందుకు ఆనందంగా ఉంది. 

కామెంట్‌లు