*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0140)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*సతీదేవి ప్రశ్న - శివ భగవానుని విజ్ఞానము, నవవిధ భక్తి వివరణ*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
*వైదిక కర్మలతో కలిగేది - వైదిక భక్తి. ప్రకృతి సహజంగా ప్రతీ హృదయంలో కలిగేది - స్వాభావిక భక్తి. ఇలా స్వాభావికంగా మానవుని మనసులో ఉదయించే భక్తి, ఉత్తమమైనది. పంచభూత సంబంధమైన కోరికలను ముందు వుంచుకుని చేసే భక్తి తక్కువ స్థాయిలో విలువ కలిగి వుంటుంది. ఇలా భక్తి మార్గంలో అనేక భేదములతో వేరు వేరు పద్ధతులు వున్నాయి. అంబా! దేవ రుషులు, మునులు, విద్వాంసులు, సగుణ, నిర్గుణ భక్తి మార్గాలలో తొమ్మిది విధాలను ఒప్పుకున్నారు. అవే నవవిధ భక్తి మార్గాలు.*
*నవవిధ భక్తి మార్గాలు - 1. శ్రవణము, 2.కీర్తనము, 3.స్మరణము, 4.సేవనము, 5.దాస్యము, 6.అర్చనము, 7.ఎల్లప్పుడూ పరమేశ్వరునికి వందనము చేయుట, 8.సఖ్యభావము, 9.ఆత్మ సమర్పణము అనేవి నవవిధ భక్తి మార్గాలు.*
*శ్లోకం:- శ్రవణం కీర్తనం చైవ స్మరణం సేవనం తథా | దాస్యం తథార్చనం దేవి వందనం మమ సర్వదా || సఖ్యమాత్పార్పణం చేతి నవాంగాని విదిర్బుధాః ||*
                        (శి.పు.రు.సం.స.ఖం.23 / 22)
*౧.శ్రవణము - ఒక చోట స్థిరముగా కూర్చుని, శరీరము, మనస్సు, నాపైన వుంచి, తన చెవులతో అమృతానందము కలిగించు నా కథలను శ్రద్ధగా వినాలి. ఇది శ్రవణ భక్తి. ౨. కీర్తనము - మనసులో ఎంతో గొప్పవైన నా జన్మ వృత్తాంతమును, నాచే చేయబడిన పనులను తెలిపే కథలను పాటలుగా చేసుకుని గొంతెత్తి పాడుతూ నన్ను కీర్తించడం. ఇది కీర్తన భక్తి. ౩. స్మరణము - పరమేశ్వరుడు ఒక్కడే ఈ జగత్తు మొత్తంలో వ్యాపించి వున్నాడు అని గ్రహించి, మనసులో ఆ పరమేశ్వరుని నిలుపుకుని ఎల్లప్పుడూ ధ్యానం చేస్తూ వుండడమే స్మరణ భక్తి. ౪. సేవనము - ఉదయము నిద్ర లేచినది మొదలు, ఏ పరమేశ్వరుని అయితే సేవించాలో వాని సేవలో ఆత్మ సాక్షిగా రోజంతా వుండటమే సేవన భక్తి. ౫. దాస్యము - ప్రతీ మానవుడు తనను తాను ఆ సదాశివుని సేవకునిగా గుర్తు పట్టి, మనసులో పరమేశ్వరుని వుంచుకొని, ఆ స్వామికి ఇష్టమైన పనులు చేయడమే దాస్య భక్తి. ౬. అర్చన - కలిగినంతలో, భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ప్రతీ మానవుడూ ఆది గురువుకు షోడశోపచార పూజ చేయడమే అర్చన. ౭. వందనము -  మనకు ఇష్టమైన భగవంతుని మనసులో వుంచుకుని, ఆయన నామము నోటితో గట్టిగా చెపుతూ, సాష్టాంగ నమస్కారం చేయడమే వందన భక్తి. ౮. సఖ్యభావము - మనకు, మన కుటుంబానికి జరిగే ప్రతీ శుభము, అశుభము రెండూ కూడా పరమేశ్వరుడు నా మంచికే చేస్తున్నాడు అని భావించి, ఆ కరుణామయుని యందు అచంచల నమ్మకం కలిగి వుండటమే సఖ్యభావ భక్తి. ౯. ఆత్మ సమర్పణము - నేను, నాది అనే భావం వదలి పెట్టాలి. నాకు ఏది కావాలో అది పరమాత్ముడు ఇస్తాడు. ఈ భూమి మీద నాది అనేది ఏదీ లేదు. నన్ను పోషించేది కూడా ఆ జగదీశ్వరుడే అని నమ్మి వుండడమే ఆత్మ సమర్పణ భక్తి.*
*ఈ తొమ్మిది విధముల భక్తి పద్ధతులు నాకు ఎంతో ఇష్టమైనవి. ఇవి భోగ మోక్షములు, జ్ఞానమును ఇస్తాయి. బిల్వార్చన కూడా ఇంతే ఫలమును ఇస్తుంది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు