*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0147)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*గోలోకము - విష్ణువునకు గణేశ్వర పదవి - శ్రీరాముడు సతీదేవి సందేహం తీర్చడం - శివుడు సతీదేవిని మానసికముగ పరిత్యజించుట*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
*రాముని ద్వారా తన సందేహ నివృత్తి చేసుకున్న సతీదేవి తాను పరమశివుని మాటలు నమ్మనందుకు తనను తానే నిందించుకుంటూ, ఇప్పుడు సర్వ రక్షకుడు అయిన నా స్వామి దగ్గరకు ఎలా వెళ్ళేది, అని చింతిస్తూ... మనసులో జగద్వ్యాపకుడు అయిన ఆ స్వామికి వేలవేల నమస్కారాలు చేస్తూ, అనేక విధాలుగా కీర్తిస్తూ రుద్రుడు నిలచివున్న వట వృక్షం దగ్గరకు చేరుకుంటుంది. ముఖమంతా దుఃఖ ఛాయలతో తన సన్నిధికి వచ్చిన సతీదేవిని చూచిన శివుడు, దేవీ! శ్రీరాముని ఏవిధంగా పరీక్షించావు అని అడిగారు. ఉమావల్లభుని పలుకరింపు సతీదేవి దుఃఖాన్ని ఇంకా పెంచింది. మాటాడకుండా నిలబడ్డ ఉమను చూచిన శివుడు తన మనో దృష్టితో అంతా తెలుసుకుంటాడు. తన మాటకు, పద్ధతికి, ఆచారానికి భగ్నం జరిగినప్పుడు సతీదేవి ని పరిత్యజిస్తాను అని ఇదివరకు, బ్రహ్మ, విష్ణువు లకు ఇచ్చిన మాట ప్రకారము, ఇప్పుడు సతీదేవిని రుద్రుడు మానసికముగా పరిత్యజిస్తాడు. కైలసమునకు వెళ్ళి పోయారు.*
*సతీదేవి ని మానసికముగా పరిత్యజించి కైలాసమునకు పయనమైన శివా శివులను చూచి అశరీరవాణి " దేవ దేవా! నీవు ధన్యడవు. వివాహ సమయంలో విష్ణుమూర్తి కి ఇచ్చిన మాట ప్రకారం సతీదేవిని పరిత్యజించావు. నీ వంటి మహాయోగి, మహాప్రభవు వేరెవ్వరూ ఉండరు. లేరు." అని వినిపించింది. ఇప్పుడు తనను తన స్వామి విడిచిపెట్టారు అని తెలుసుకుని పరిపరి విధాల చింతుస్తున్న ఉమను చూచి శివుడు అనే కథలు చెప్పి ఆమెను ఏమార్చే ప్రయత్నం చేసాడు కానీ, పరిత్యజించిన విషయం చెప్పలేదు. కానీ, ఉమ అయిన సతీదేవి శివుని ధ్యాన్నించి విషయం అవగతమైన తరువాత కైలసమున తన మందిరమునకు వెళ్ళి ముభావంగా వుంటూ వుంది.*
*కైలాసమునకు చేరిన శివుడు కూడా ధ్యాన ముద్రలో వుండి, తపస్సు లోకి వెళ్ళాడు. అలా కొంతకాలం గడచిన తరువాత సదాశివుడు ధ్యానము విడిచి పెట్టాడు. అప్పుడు తన వద్దకు వచ్చిన సతీదేవి బాధను చూచి, రకరకాల లీలు చేస్తూ ఆమెను సంతోషంగా వుంచే ప్రయత్నం చేస్తాడు. కానీ, పరిత్యజించడం అనే తన ప్రతిజ్ఞ విడువడు. పరమేశ్వరుడు అయిన శివుడు చెప్పినవి, చేసినవి, చేసేవి అన్ని కూడా నిజమే అవుతాయి. అయినా కూడా, శివాశివులు ప్రకృతీ పురుషులు. మాట, అర్ధము లాగా ఎల్లప్పుడూ కలసి వుంటారు. వారు విడపడటము అనేది ఒక లీల మాత్రమే.*
*శ్లోకం :- వాగర్ధావివ సంపృక్తౌ సదా ఖలి సతీ శివౌ | తయోర్వియోగో సంభావ్యః సంభవేదిచ్ఛయా తయోః |*
                          (శి.పు.రు.సం.స.ఖం. 25 / 69)
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు