*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0148)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*ప్రయాగ - దక్షుడు పాల్గొనడం - శివునికి శాపం - నందీశ్వర శాపం - శివుడు నందిని శాంతింప చేయుట*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
*పూర్వం ఒకనాడు మహర్షులు అందరూ ప్రయాగ చేరి, ఒక గొప్ప యజ్ఞము నిర్వహించారు. ఆ యజ్ఞానికి దేవగణాలు, సిద్ధులు, దేవ రుషులు, ప్రజాపతులు, దేవతలు వచ్చారు. నేను కూడా తేజోవంతులైన నా మానస పుత్రులతో కలసి ఆ యజ్ఞము నకు వెళ్ళాను. చక్కని వేద సభలు జరుగుతున్నాయి. పరమేశ్వర తత్వం గురించి తర్కము జరుగుతోంది. శాస్త్ర సంబంధ విషయాలను గూర్చి చర్చ, వాదోపవాదాలు జరుగుతుండగా, ఉమా సహితంగా, పరివార పార్షదులు, నంది, భృంగి తోడు రాగా, పరాత్పరుడు, త్రిలోకహితకారి, సృష్టి కర్త, అందరికీ తండ్రి అయిన రుద్రుడు ఆ యజ్ఞ భూమికి వచ్చారు. దేవగణములు, మహర్షులు, నేను ఆ సర్వస్వతంత్రుడికి ఉచితాసనము, అర్ఘ్య పాద్యాదులు ఇచ్చి, పూజించాము.*
*మహాదేవుడే తాము చేసే యజ్ఞ స్థలంలో వున్నాడు అని యజ్ఞకర్తలు ఎంతో సంతోషం గా వున్నారు. తమ అదృష్టానికి మురిసి పోతూ, మరల శాస్త్ర చర్చలు కొనసాగించారు. ప్రజాపతులు అందరికీ అధిపతి అయిన దక్ష ప్రజాపతి, సమస్త జగత్తుకూ అధిపతి. అందరి మన్ననలు, పూజలు పొందుతున్నాడు. నేను గొప్ప వాడను అయ్యాను అని గర్వపడటం మొదలు పెట్టాడు. ఇటువంటి స్థితిలో, జగత్తు అంతా విహారం చేస్తూ యజ్ఞ స్థలి అయిన ప్రయాగకు తన పరివారంతో కలసి వచ్చాడు. యజ్ణ స్థలిలో వున్న అందరూ లేచి నిలబడి నమస్కారాలు చేస్తూ, గొంతెత్తి కీర్తిస్తూ దక్షునికి స్వాగతం పలికి, ఉచితాసనము ఇచ్చి, కూర్చుండబెట్టారు.*
*దక్షునకు అందరూ వసత్కారము చేసారు కానీ, అందరి దేవుడు, జగత్కర్త, జగత్భర్త, సకలములను నియంత్రణలో వుంచగలవాడు అయిన అంబికా నాధుడు మాత్రం తాను కూర్చున్న స్థానంలో స్థిరంగా కూర్చునే వున్నారు. దక్షునికి స్వాగతం చెప్పలేదు, ఆదరించలేదు. అంతమంది మధ్య పరమశివుడు తనను ఆదరించక పోవడం అవమానంగా భావించాడు, నా పుత్రుడు దక్షుడు. ఎంతగానో నొచ్చుకున్నాడు. యాగశాలలో జరుగుతున్న యజ్ఞ పురుషుని పూజ మీద గానీ, వేద శాస్త్రాల చర్చలలో గానీ, దక్షుని మనసు లగ్నం కావటల్లేదు. నేను గొప్ప అనే అహంకారం తో వున్న దక్షునికి, తనను ఆదరించని రుద్రుని పట్ల క్రోధం పెరిగి పెరిగి, అంత మంది లో పరమేష్టిని తక్కువగా చూపాలి అనే కోరిక బలపడ సాగింది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు