*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0150)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*ప్రయాగ - దక్షుడు పాల్గొనడం - శివునికి శాపం - నందీశ్వర శాపం - శివుడు నందిని శాంతింప చేయుట*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
*తన స్వామి పరమశివునికి, శివపార్షదులకు శాపాలు ఇచ్చిన దక్షుని చూచి, నందీశ్వరుడు " దక్షా, నీవు మూర్ఖడవై, దుర్బుద్దితో జగద్రక్షకుడు, ఆదియోగి, నిరంజనుడు, నిర్మోహుడు అయిన సదాశివునికి, వారి పరవారమైన శివపార్షదులకు శాపము ఇచ్చావు. నీవు అహంకారం తో నిండిపోయావు. ఈ యజ్ఞ శాలలో వున్న భృగువు మొదలగు బ్రాహ్మణులు మేము గొప్పవారము అనే ఆభిమానము వల్ల శివ తత్వము తెలుసుకోలేక పోతున్నారు. అందువల్ల నీతో కలసి సదాశివుని హేళన చేస్తున్నారు. భగవంతుడు అగు రుద్రుని దూషించిన నీన్ను, భృగువుతోవున్న మిగిలిన బ్రాహ్మణ సమూహాన్ని రుద్రతేజః ప్రభావముచేత నేను శపిస్తున్నాను. మీరందరూ బ్రాహ్మణులు అయినా కేవలం కర్మఫలాన్ని నమ్ముకుని బ్రతుకుతారు. మోక్షాన్ని కనుగొన లేక, స్వర్గ సుఖాలే శాశ్వతము అనుకుని వాటి చుట్టూ తిరుగుతుంటారు. ఈ బ్రాహ్మణులు, తక్కువ జాతి వారు చేసే యజ్ఞము లలో పాల్గొని వారిచ్చే ధన సంపదలకు ఆశ పడతారు. ఇటువంటి దానములు తీసుకుని ఈ బ్రాహ్మణులు నరకమును కోరుకుంటూ జీవిస్తారు. వీరిలో కొందరు రాక్షసులుగా కూడా పుడతారు. దక్షా, నీవు కూడా కర్మ చేయడంలోనే ఆనందం పొందుతూ, ఆత్మ జ్ఞానమును మరచి పశువులాగా ప్రవర్తిస్తూ గొర్రె ముఖము పొందుతావు." అని ఎంతో బాధతో దక్షుని తో సహా అక్కడ వున్న మిగిలిన బ్రాహ్మణ సమూహాన్ని శపిస్తాడు. బ్రహ్మ నైన నేను కూడా యజ్ఞ శాలలో జరుగుతున్న విషయాల పట్ల చాలా బాధ పడ్డాను. మహాదేవుడు అయిన రుద్రుడు, నందీశ్వరుని మాటలు విని చిరునవ్వుతో ఊరకున్నాడు.*
*కొన్ని క్షణముల తరువాత మహాదేవుడు నందిని ఉద్దేశించి, "నీవు సనకసనందనాదులకు, దేవీ దేవతలకు కూడా తత్వజ్ఞాన ఉపదేశము చేయగల వాడివి. దక్షుడు నన్ను శపించాడని, నీవు బ్రాహ్మణ కులమునకే శాపం ఇచ్చావు. ఇది సరికాదు. ఏ శాపమూ నన్ను ఏమీ చేయలేదు. వేదము మంత్రాక్షర మయము. సూక్త మయము. ప్రత్యేక సూక్తములో సమస్త దేహదారుల ఆత్మ ప్రతిష్ఠమై వుంటుంది. మంత్రముల స్వరూపము తెలుసుకొనిన వారు ఆత్మవేత్త అవుతారు. ఎంత దుర్బుద్దికి అయినా వేదమును శపించడం కుదరదు. నామీద దక్షుని శాప ప్రభావము ఏమాత్రమూ లేదు. యజ్ఞము నేనే. యజ్ఞము లోని భాగాలూ నేనే. యజ్ఞము చేసేవాడిని నేనే. యజ్ఞ ఫలము ఇచ్చేవాడిని, పుచ్చుకునే వాడిని కూడా నేనే. యజ్ఞము లో వుండే వాడిని, బహిష్కృతుడు అయ్యేవాడిని నేనే. ఇటువంటి నన్ను ఏ శాపాలు ఏమీ చేయలేవు. నీవు, తత్వజ్ఞానము తెలుసుకుని, ప్రపంచ రచనకు బాధ్యుడవై, ఆత్మనిష్ఠ జ్ఞానివై, క్రోధము, మదము, మత్సరములనుండి దూరముగా వుండు.*
*శంభుడు నచ్చ చెప్పిన మీదట నందీశ్వరుడు శాంతించాడు. సదాశివుడు తన ప్రమధ గణము లతో కలసి కైలాసానికి వెళ్ళారు. శివుని శపించిన తరువాత కూడా దక్షుని కోపము చల్లారలేదు. అతడు తనకు వున్న శివ ద్వేషం వల్ల, శివపూజలు చేసే వారిని నిందిస్తూ, బాధలకు గురిచేస్తూ వున్నాడు. మూర్ఖత్వం పెరిగి, శివుని యందు శ్రద్ధ తగ్గి పోయింది. శంభునితో తన శత్రుత్వం ఇంకా కొనసాగిస్తున్నాడు, దక్షుడు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు