*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0151)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*మహత్తరమైన దక్ష యజ్ఞము - దేవతలు అందరూ రావడం - దధీచి శివుని ఆహ్వానించమని చెప్పడం - శివభక్తలు వెళ్ళి పోవడం*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
*ఒకనాడు, "కనకల" అనే పేరు గల తీర్ధ స్థలములో దక్షుడు ఒక మహా యజ్ఞము చేయాలి అని సంకల్పించాడు. ముప్పది ముక్కోటి దేవతలను, విష్ణుమూర్తిని, బ్రహ్మనైన నన్ను, అగస్త్యుడు, కశ్యపుడు, భృగువు, దధీచి మొదలైన ముని గణములు అందరినీ ఆహ్వానించాడు. పురోగతిని కోరుకునే మానవ రాజులు కూడా వచ్చారు. ఉపదేవతలు వారి సకల సైన్యాలతో వచ్చి యజ్ఞస్థలి వద్ద వున్నారు. విశ్వకర్మ నిర్మించిన దివ్య భవంతులలో వచ్చిన వారందరూ వారి వారి అర్హతకు అనుగుణమైన స్థానంలో సేద తీరు తున్నారు. భృగువు మొదలైన తపోధనులను రుత్విక్కులుగా నియమింప బడ్డారు. నన్ను వేదత్రయ విధిని చూపించుటకు నియమించాడు. దిక్పాలకులు అందరూ ఆ యజ్ఞ స్థలికి అన్ని దిక్కులా రక్షకులుగా వున్నారు. యజ్ఞస్థలి ఎంతో శోభాయమానంగా వుంది. శివ ద్రోహి, దుర్బుద్ధి వున్న దక్షుడు, వచ్చిన వారందరికీ తగిన రీతిలో సత్కారాలను చేసాడు. వారు కూడా పరమానంద భరితులు అయ్యారు.*
*వేద వేదాంగాలను చదివిన మహర్షులు ధారణ చేయగా, అగ్ని దేవుడు తన వేయి చేతులు చాచి హవిస్సును స్వీకరించడానికి సిద్ధంగా వున్నాడు. నారదుడవైన నీవు మిగిలిన గంధర్వులు, సప్తర్షులు, వేరు వేరుగా కథలను గానం చేస్తున్నారు. యజమానియైన దక్షుడు తన ధర్మ పత్నితో కలసి ఎంతో శోభాయమానంగా వెలిగిపోతూ, యజ్ఞమును ప్రారంభించడానికి ముందుకు వచ్చాడు. ఎంతో ఘనంగా జరుగబోతున్న ఈ మహా యజ్ఞములో భాగము అవుదాము అని వచ్చిన దధీచి మొదలైన శివ భక్తులకు, తమ స్వామి అయిన సదాశివుడు పిలువబడలేదు, రాలేదు అని వేదనను అనుభవిస్తున్నారు.*
*యజ్ఞ ప్రారంభానికి తయారు అవుతున్న దక్షుని చూచి, మహా శివభక్తుడు అయిన దధీచి "సభాసదులారా! విజ్ఞులారా! సకల దేవ దేవతలు, రుషులు, గంధర్వులు, మానవ రాజులు, దిక్పాలురు వున్న ఈ యజ్ఞ స్థలంలో యజ్ణ కర్త, భర్త, హోత, కారకుడు, ఫలమును ఇచ్చేవాడు అయిన శివ భగవంతుడు లేకపోవడం వలన ఈ యజ్ఞము సంపూర్ణము అవదు. ఇది ఇలా జరగడం శాస్త్ర సమ్మతము కాదు. దక్షా! ఇక్కడ వున్న వారలో కొందరిని రుషభధ్వజుడు వున్న చోటికి పంపి ఆయనను తోడ్కొని రమ్మని ఆజ్ఞ ఇవ్వు. ఆ స్వామి పాదం పెట్టగానే అన్ని అమంగళాలు తొలగిపోయి, నీవు కోరుకునే కార్యం సుసంపన్నం అవుతుంది. లేదా, విష్ణుమూర్తి, బ్రహ్మ దేవా! మీరైనా శివభగవానుడు వున్న కైలాసానికి వెళ్ళి అంబా సహితంగా వారిని ఇక్కడకు తీసుకుని రండి. జగదంబతో పరమాత్ముడు ఇక్కడకు రావడం వలన సమస్తము మంగళప్రదము అవుతుంది. జగన్మాతాపితరలు రాని, లేని ఈ యజ్ఞము ఎప్పటికీ సంపూరణము కాదు. ఇది సత్యము." అని చెప్పాడు, దధీచి.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు