*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0153)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*మహత్తరమైన దక్ష యజ్ఞము - సతీదేవి, రుద్రుని రమ్మనెం - సతీదేవి శివగణములతో వెళ్ళడం*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
*దక్షుడు చేస్తున్న యజ్ఞము లో పాలుపంచుకోవాలని వెళుతున్న దేవర్షులు, మునులు, దేవగణములను చూసిన, దక్ష కన్య అయిన సతీదేవి గంధమాదన పర్వతము మీద దన పరివారముతో వ్యాహ్యాళిలో వుంది. చంద్రుడు కూడా తన ధర్మపత్నితో, పరివారం తో కలసి సంబరంగా బయలుదేరాడు. ఇది చూసిన సతీదేవి తన ఇష్టసఖి విజయను పిలిచి వారందరూ ఏ కార్యక్రమాని కోసం అంత ఉత్సాహంతో వెళుతున్నరో తెలుసుకునివరమ్మని చెప్పింది. చంద్రదేవుని వద్దకు వెళ్ళిన విజయ నమస్కారాలు చేసి మీరు అందరూ ఏ పని మీద ఇంత సంరంభంగా వెళుతున్నారు అని తన స్వామి సతీదేవి అడగమనట్లుగా చెపుతుంది.*
"బ్రహ్మ మానస పుత్రుడైన దక్ష ప్రజాపతి ఒక మహా యజ్ఞాన్ని చేయ తలపెట్టాడు. ఆ యజ్ఞములో భాగము ఇమ్మని మా అందరి దేవతలకు, మహర్షులకు, ముని పుంగవులకు, అష్టదిక్పాలురకు ఆహ్వానం పంపాడు. మేమందరమూ అక్కడకే వెళుతున్నాము" అని చంద్రదేవుడు, సతీదేవి సఖి విజయతో చెప్పాడు.  తన సఖి చెప్పిన విషయం విన్న సతీదేవి, తన తండ్రి అయిన దక్షుడు తన భర్తకు ఆహ్వానం ఎందు వల్ల పంపలేదు, కన్న కూతురిని అయిన నన్నెందుకు పిలువ లేదు అని ఆలోచిస్తూ శివ భగవానుని చేరి, ఆయనను స్థుతి చేసి, "స్వామీ! మీరు ఈశ్వరులు. సర్వమునకు అధిపతులు. నా తండ్రి యజ్ఞము తలపెట్టాడట. ఆ యజ్ఞము లో మీరు పాల్గొంటే నా తండ్రికి మేలు, సకల శుభములు కలుగుతాయి. కానీ, ఆ యజ్ఞమునకు మననకేల ఆహ్వానం లభించలేదు. ఇందుకు గల కారణము మీకు తప్పక తెలుస్తుంది. నాకు చెప్పండి, దయచేసి. నేను ఆ యజ్ఞము నకు వెళ్ళి, మిమ్మల్ని పిలవకపోడానికి సాహసించిన నా తండ్రి, ఆతనికి వంత పాడి అక్కడ వున్న దేవ సమూహము యొక్క అభిప్రాయాలను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. కరుణతో నాకు ఆజ్ఞ ఇవ్వండి" అని ప్రార్ధించింది, ఉమ అయిన కాళిక.*
*"అంబా, నీ తండ్రి ఈ యజ్ఞము సందర్భంగా అనేక మార్లు నన్ను తూలనాడాడు. నా అస్తిత్వాన్ని ప్రశ్నించాడు. తానే గొప్ప అనే గర్వంతో విర్రవీగుతున్నాడు. మనకు యజ్ఞమునకు రమ్మని ఆహ్వానము లేదు. అందువల్ల మనము అక్కడికి వెళ్ళడం మర్యాద కాదు. నీవూ ఒంటరిగా అసలు వెళ్ళవద్దు" అని రుద్రుడు, సతీదేవి కి వివరించారు. కానీ, స్త్రీ సహజమేన ఉత్సుకతతో తన తండ్రి చేస్తున్న యజ్ఞము చూడాలని, అలాగే తన భర్తకు ఆహ్వానం పంపక పోవడానికి కారణం తెలుసుకోవాలని ఉమ అక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకుంది, అని శివభగవానుడు గ్రహించాడు. "ఉమా! మహారాణికి ఉచితమైన అన్ని మర్యాదలను వెంట బెట్టుకుని, సలక్షణంగా అలంకరించబడిన వృష అంబారీ మీద, పార్షదులను వెంట బెట్టుకుని, వెళ్ళిరా కళ్యాణీ" అని అనుజ్ఞ ఇచ్చారు.*
*పతి అనుజ్ఞ పొందిన సతీదేవి, సకలాలంకార భూషితగా శివపార్షదులు చేసే సంరంభాల మధ్య, మహోతస్వంగా సాగుతున్న పరివారముతో కలసి కన్న తండ్రి ఇంటికి బయలుదేరింది, సర్వజ్ఞ.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు