*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0156)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*యోగాన్ని లో - ప్రాణ త్యాగం - శివపార్షదుల ప్రాణ త్యాగం - దక్షుని మీద దాడి - దేవతల విచారము*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
*దక్ష యజ్ఞములో సభాసదులతో మాట్లాడిన తరువాత సతీదేవి ఉత్తర దిక్కుగా భూమి మీద కూర్చుని, ఆచమనము చేసి, శుభ్రమైన వస్త్రము కప్పుకుని, భర్తను స్మరిస్తూ యోగమార్గమలో ప్రయాణానికి సిద్ధమైంది. ప్రాణాయామము ద్వారా ప్రాణ అపానములను నాభిచక్రములో ఏకం చేసుకుంది, అంబ. తరువాత ఉదానవాయువును బలవంతంగా హృదయమలోకి తీసుకుంది. తరువాత, శంకరుని ప్రాణవల్లభ, అనిందిత అయిన సతీదేవి హృదయం లో వున్న వాయువును కంఠం ద్వారా భృకుటికి చేర్చింది. ఈ విధంగా దక్షుని మీద వున్న కోపంతో, తన శరీరాన్ని వదలి పెట్టాలి అని నిర్ణయించుకుని యోగ మార్గము ద్వారా వాయువును, అగ్నిని ధారణ చేసింది. తన భర్త పాదపద్మాలను స్మరిస్తూ వున్న ఉమ కోరిక మేరకు యోగ ధారణ వల్ల శుచి అయిన ఆమె శరీరము తక్షణమే యోగాగ్నిలో భస్మం అయ్యింది.*
*సభలోని వారందరూ చూస్తుండగానే క్షణాలలో జరిగిన ఈ కార్యక్రమం అందరిని భయభ్రాంతులను, భీతావహులను చేసింది. ఈ విషయం తెలిసిన దక్షుని రాజ్యం లోని ప్రజలు కూడా "పరమ పూజ్యురాలు, పరమేశ్వరుని ధర్మపత్నిని ఆత్మత్యాగానికి పురిగొల్పిన వారు ఎవరైనా ఆనేక దుర్భరమైన బాధలు అనుభవిస్తారు. తండ్రి ఆదరణ లేక సతీదేవి కుపిత అయి ప్రాణ త్యాగం చేసింది. దక్షుడు బ్రాహ్మణ ద్రోహి. అతనికి అఖండమైన అపకీర్తి కలుగుతుంది. ప్రాణ త్యాగ నిర్ణయం నుండి ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. మన రాజు నరకయాతనలను అనుభవిస్తాడు" అని అనుకున్నారు.*
*ద్వారం వద్ద వున్న 60 వేలమంది పార్షదులకు విపరీతంగా బాధ, కోపం, దక్షుని మీద శతృత్వం కలిగాయి. సతీదేవి ప్రాణ త్యాగ బాధను తట్టుకోలేక కొంతమంది పార్షదులు తమని తాము వాడివాయుధాలతో బాధపెట్టుకుని ఆమెతో బాటే ప్రాణ త్యాగం చేసారు. మిగిలిన పార్షదులు తమ తమ ఆయుధాలు ధరించి దక్షుని మీదకు, సభలో వున్న మిగిలిన వారి మీదకు, యజ్ఞానికి భంగం కలిగించాలని యజ్ఞ స్థలంలోకి వెళ్ళారు. ఈ శివపార్షదులు నిశ్చయంగా యజ్ఞము ను భంగం చేస్తారు అని తలచి, భృగు మహర్షి "అపహతా అసురాః రక్షాంసి వేదిషదః" అని మంత్రంతో యోగాగ్నిలో ఆహుతి ఇచ్చాడు. అప్పుడు అనేక వేలమంది బ్రహ్మ తేజస్సంపన్నులు అయిన రుభులు ( యజ్ఞ కుండము నుండి వచ్చిన యజ్ఞ రక్షకులు) పార్షదులతో చేసిన యుద్ధంలో కొంతమంది చనిపోగా మిగిలిన వారిని తరిమి వేస్తారు.*
*ఈ ఘటన, ఘటనాఘటన సమర్ధుడైన లయకారుని కోరికతోనే జరిగింది. ఇంత జరుగుతున్నా, రుషులు, దేవతలు, మరుద్గణములు, విశ్వదేవులు, అశ్వనీదేవతలు నిశ్శబ్దంగా వున్నారు. వారు చేయగలిగినది ఏమీ లేదని వారికి తెలుసు, అందుకే నిష్క్రియాత్మక లక్షణాన్ని ఎంచుకున్నారు. ఈ ఘటన వల్లవరాబోవు కాలములో ఇంకా ఎటువంటి ఉత్పాతాలు వస్తాయో అని విష్ణువు మిగిలిన దేవతలు ఎంతో ఉద్విగ్నతకు లోనవుతున్నారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు