*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0161)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*తనను రక్షించమని దక్షుడు విష్ణుమూర్తి ని అడగటం - విష్ణుమూర్తి తన అసహాయతను చెప్పడం - వీరభద్రుని సైన్యం రాక*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
 *ఆకాశవాణి మాటలు విని దక్షుడు, తన భార్యను వెంట బెట్టుకుని విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి, "దేవదేవా! దీనబంధూ! కృపానిధీ! నన్ను నా పరివారాన్ని కాపాడు. మీరే యజ్ఞ కర్త, భర్త, భోక్త కూడా కదా! నా ఈ యజ్ఞం నాశనము కాకుండా మీరే కాపాడాలి." అని అనేక విధాల‌ ప్రాధేయ పడతాడు. దక్షుని మాటలు విన్న విష్ణుమూర్తి, సర్వ రక్షకుడు అయిన శివదేవుని స్మరించి, జరిగిన విషయం గ్రహించి, " దక్ష ప్రజాపతి! నువ్వు పరమేశ్వరుని ద్వేషించావు. నీ అహంకారం తో జగత్పితను అనకూడని మాటలు అని, నిందా వాక్యాలు పలికావు. నీ పాపానికి నిష్కృతి లేదు. పూజకు అర్హత లేని వారిని పూజించడం వలన, పూజ్యులు అయిన వానరిని పూజింజించి నట్టు కాదు. నీవు, నిన్ను రక్షించ గలిగిన వృషభధ్వజుని పూజించాలి. వేరెవ్వరూ నిన్ను రక్షించ లేరు. నీతో కలసి వుండటం వలన మాకు కూడా కష్టాలు వచ్చాయి. తప్పక దేవదేవుడు అయిన శివదేవుని పూజించు." అని చెప్పారు విష్ణుమూర్తి.
*ఇంతలో, వీరభద్రుడు తన సైన్యముతో యజ్ఞ స్థలముకు వచ్చి నిలుచున్నాడు. వీరభద్రుని సైన్యమైన వారే ఎవరిచేతా ఓడింపబడనంత శక్తి సామర్ధ్యాలు కలవారు. వారికి అరివీర భయంకరుడైన వీరభద్రుడు అధిపతి. వారిని ఆప గలవారు ఎవరు వున్నారు. వీరందరినీ చూచిన దక్షుడు మరలా విష్ణు భగవానుని తో "మిమ్మల్ని చూసుకునే, మీ రక్షణ దొరుకుతుంది అనే ధైర్యం తోనే నేను ఈ యజ్ఞాన్ని తలపెట్టాను. మీరు కర్మలకు సాక్షులు. మీరే ధర్మానికి, యజ్ఞానికి, బ్రహ్మకూ కూడా రక్షకులు. ఇప్పుడు మమ్మల్ని మీరే కాపాడ గలరు. మీరు మమ్మల్ని కాపాడండి. మాకు వేరే దిక్కు లేదు." అని వేడుకుంటాడు.
*ఇంతలా భయపడుతున్న దక్షునితో విష్ణుమూర్తి, "నేను దర్మ పరిపాలన, రక్ణ చేస్తాను అనేది నిత్య సత్యం. నేను యజ్ఞాన్ని రక్షిస్తాను అనేది కూడా సత్యవాక్కు. కానీ, నీ దుర్బుద్ధి వలన నీవు భగవంతుడు అగు వృషభధ్వజునకు చేసిన అవమానము నుండి నిన్ను రక్షించుటకు ఇక్కడ వున్న ఏ దేవీ దేవతల వలన కూడా కాదు. ఎందుకంటే, నీవు చేసింది, పరమేశ్వర పరాత్పర నింద. జగత్ప్రభువునే నిందించిన వానిని ఎవడు కాపాడగలుగుతాడు. మా ఎవ్వరి వల్ల కాదు. నీ అహంకారముబల్ల నీకు ఇప్పుడు ఏది మంచి, ఏది చెడు తెలియటం లేదు. మనము చేసే పనుల వల్ల ఫలితము ఇవ్వగలిగిన వాడు సదాశివుడు ఒక్కడే అని ఇప్పటికైనా తెలుసుకో. నీవు ఆ ముక్కంటి పాదలును పట్టకుంటే గాని నీ భయము తొలగి పోదు. నీ కారణంగా శంభునికి కలిగిన కోపం వలన అతి భయంకరమై, కొన్ని కోట్ల సైన్యాన్ని కూడా మట్టు పెట్టగల సామర్థ్యం వున్న వీరభద్రుడు ఇక్కడకు వచ్చాడు. అతనిని నిర్జించడం మా ఎవరి వల్ల కాదు. ఇక్కడ వున్నందుకు, నీతో పాటు మేము కూడా ఈ కష్టాలు భరించ వలసిందే." అని చెప్పాడు విష్ణుమూర్తి.
 *ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు