*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 046*
 *చంపకమాల:*
*అగణిత జన్మకర్మదురి | తాంబుధిలో బహుదుఃఖవీచికల్*
*దెగిపడనీఁదలేక జగ | తీధవ ! నీపదభక్తి నావచేఁ*
*దగిలి తరింపఁగోరితిఁబ | దంపడి నాదు భయంబు మాన్పవే*
*తగదని చిత్తమందిడక | దాశరధీ !కరుణాపయోనిధీ !.* 
*తా:*
దయకు సముద్రము వంటివాడవైన రామభద్రా!  వెనుక జన్మలలో నేను చేసిన చెడుపనుల వల్ల అలలు అలలుగా వస్తున్న దుఃఖముల సముద్రమును ఈదలేక, నీ పాదముల యందు భక్తి అనే చుక్కానిని ఆసరాగా చేసుకుని ఆ దుఃఖ సముద్రాన్ని దాటాలి అనుకున్నాను. కనుక, అలా కుదరదు అని నీమనసులో అనుకోకుండా, నాకు సహాయం చేసి ఈ దుఃఖాల భయమును పోగొట్టు, రమారమణా! ...... అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*"తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓ రన్నా!... ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్నములో విడునన్నా, అన్నటికిని కడసారి జన్మమిది నిక్కంబుగ నమ్మికయున్నా!" అని రామదాసు గారు సెలవిచ్చారు. అందుకే ఉదయం కన్ను తెరవగానే "శ్రీరామ రామ రామేతి! రమే రామే మనోరమే! సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!" అనుకో మన్నారు మన పెద్దలు. ఆ నామము మనల్ని అన్ని పాపాల నుండి తరింప జేస్తుంది. అందుకే, "తారక నామం" అయ్యంది. అంతటి అత్యంత శక్తివంతమైన క్షయము కాని, రెండక్షరాల "రామ" శబ్దాన్ని ఎల్లప్పుడూ మన మనసులో, తలపులో వుండేటట్లు అనుగ్రహించమని ఆ సీతమ్మను వేడుకుంటూ .....*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు