*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 055*
 *ఉత్పలమాల:*
*దీక్షవహించి నాకొలఁది | దీనుల నెందరిఁగాచితో జగ*
*ద్రక్షక తొల్లి యాద్రుపద | రాజతనూజ తలంచినంతనే*
*యక్షయమైన వల్వలిడి | తక్కట నా మొరఁజిత్తగించి*
*ప్రత్యక్షము గావ వేమిటికి | దాశరధీ ! కరుణాపయోనిధీ !.* 
తా: దశరధుని పుత్రుడా! దయకు సముద్రము వంటి వాడా! జగత్తును రక్షించే వాడివైన నీవు నావంటి ఎందరో దీనులను రక్షిస్తాను అనే దీక్ష పూని రక్షించావు. ద్రుపద రాజు కూతురు ద్రౌపది, కురు సభలో నిలబడి నన్ను కాపాడమని గొంతెత్తి అడుగగానే లెక్కపెట్ట లేనన్ని చీరలు ఇచ్చి కాపాడావు, రుక్మిణీ పతీ! నేను ఎంతగా ప్రార్ధించినా, నన్ను కనికరించమని అడిగినా నా మొర ఆలకించి నాకు ప్రత్యక్షంగా దర్శనం ఇవ్వకుండా వున్నావు, ఎందుకని, సీతోద్ధారా!.... అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*అష్టావక్ర అయిన కుబ్జకు సుందర రూపము, అడుగకుండానే ఇచ్చావు, కంసారి. ప్రాణాపాయం లో వున్న గజరాజు పిలువగానే ఒక్క ఉదుటున బయలుదేరి వచ్చి కాపాడావు. గుహుడు అడుగకుండానే నీ పాదసేవ చేసుకునే అవకాశం ఇచ్చావు. ప్రహ్లాదుని ఎన్నో రకాల కష్టాల నుండి కాపాడి, రాజ్యం కూడా ఇచ్చావు. ఆంజనేయ వరదుడు గా, ప్రహ్లాద వరదుడు గా పేరు పొందావు. ఇంతటి దయతో వుండే పరమేశ్వరా, మానవ మాత్రుడిని, కష్టాలలో వున్న వాడిని, నిన్ను ఎలా పూజించాలో, ఏ పేరుతో పిలిస్తే పలుకుతావో తెలియని వాడిని, నా మీద కరుణ రాదా తండ్రీ. నేను కూడా నీ దాసులలో ఒకడినే కదా, రామభద్రా! దయ చూపి కరుణించు తండ్రీ. నీవు లేక ఇంక ఎవరు కాపాడుతారు నన్ను. పాహి! పాహి! పాహి రామప్రభో! పాహి!.......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు