*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 057*
 *చంపకమాల:*
*వలదు పరాకు, భక్తజన | వత్సల ! నీ చరితంబు వమ్ము గా*
*వలదు పరాకు, నీ బిరుదు | వజ్రమువంటిది, కానకూరకే*
*వలదు పరాకు, నా దురిత | వార్ధికిఁదెప్పవుగా మనంబులో*
*దలఁతుమె కా నిరంతరము | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: దయ చూపటంలో సముద్రము వంటి వాడా! దాశరధీ! నీ భక్తులను కాపాడుతావు అనే నీ చరిత్ర తప్పు కాకూడదు, జాగ్రత్త రామా! మమ్మల్ని కాపాడకుండా వుంటే, ఆర్తజన రక్షకుడవు అనే నీ బిరుదు పొరపాటుగా వచ్చినది అని లోకులు అనుకుంటారు, జాగ్రత్త, రామభద్రా! ప్రతీ రోజూ నీ నామమే మనసులో నిలుపుకుని పాపాల సముద్రమును దాటించే తెప్పగా నిన్ను నమ్మి కొలుస్తున్నాను కోదండరామా! వచ్చి కాపాడు తండ్రీ! పరాకులో మరచిపోకు, లక్ష్మణాగ్రజా!.... అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*"పరిదానమిచ్చితే పాలింతువేమో! రొక్కమిచ్చుటకు నే ముక్కంటి చెలికాను! చక్కని సతిని నొసగ జనక రాజును కాను!" అని త్యాగరాజు గారు నిన్ను కొలిచారు. "పరిపాలయ పరిపాలయ పరిపాలయమాం రఘునాధా!" అని నీ ఉత్సవ సంప్రదాయ కీర్తనలలో నిన్ను కొలిచారు. ఇదీ నాకు తెలిసిన నీ ఘనమైన చరిత, నడత. దీనికి భంగం కలుగుతుందేమో అనే విధంగా నన్ను కాపాడకుండా వుండడం నీకు తగునా కోదండరామా! నీవు తక్క ఇతః పరంబెరుగని వాడిని. అలుకపూని ఆలస్యం చేయక వడివడిగా వచ్చి కావుము, కారుణ్యసింధో! .......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు