*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 060*
 *ఉత్పలమాల:*
*అంచితమైన నీదు కరు | ణామృత సారము నాదుపైనిఁ బ్రో*
*క్షించినఁజాలు దాన నిర | సించెద నాదురితంబులెల్లఁ దూ*
*లించెద వైరివర్గ మెడ | లించెదఁ గోర్కెలనీదు బంటనై*
*దంచెద గాలకింకరుల | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: కరుణా సముద్రా! దశరధరామా!  ఎంతో పుణ్యమును ఇచ్చే నీ కరణ, దయ అనే అమృతమును నామీద జల్లినా చాలు, నేను చేసిన పాపములు అన్నీ తొలగిపోతాయి. నా లోపలి, బయటి శతృవులను, కోరికలను కూడా నేను జయించగలను. చివరి కాలంలో వచ్చే యమ కింకరులను కూడా నా దగ్గరకు రాకుండా నలబెట్ట గలను... అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*ఆహా! ఇది కదా రామనామ మహిమ. మన మానవ జీవితాలు వైతరణి దాటడానికి ఎంత తేలి అయిన దారి చూపించాడో కదా, పరబ్రహ్మ పరమేశ్వర పరాత్పరుడు అయిన రుద్రుడు. ఇంతకంటే మనలను తరింపజేసే సులభ మార్గం వేరేదైనా వుంటుందని నాకైతే తోచడంలేదు. "కలౌ నామస్మరణ" అన్నారు కదా పెద్దలు. "రామా", కృష్ణా", "గోవింద", " శివా", "శివ" అమ్మా" ఏమని అయినా పిలవండి పలికేది పరమేశ్వర తత్వమే కదా! ఇవి ఏవీ స్ఫురణకు రాకపోతే, కేవలం "ఓం" అనో, "శ్రీ" అనో అనుకున్నా మనల్ని మోక్ష ద్వారం వైపు నడిపిస్తారు, శ్రీరమారమణగోవిందుడు అయిన రుద్రుడు. ఈ అంతటికీ మూలం, మనల్ని నడిపించే శక్తి ఒకటి వుంది అని నమ్మి, పట్టు కొమ్మ లాగా ఆ నమ్మకాన్ని వదలకుండా పట్టుకుని వుండడం. ఆ విధంగా మనం వుండేలా తన కరుణ మనపై చూపమని నిటలాక్షుని వేడుకుంటూ........*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు