భాషా దినోత్సవ సందర్భంగా శివ నాగ రెడ్డి గారి ఆఫీసులో కార్యక్రమానికి వెళితే ఆయన తన సహజ సిద్ధమైన నవ్వుతో వున్నారు.నన్ను చూడగానే రండి ఆనంద్ గారు మీతో ప్రస్తావించాలి ఇవాళ జనానికి దినం తప్ప మరొకటి లేదు. దానికి అర్థం తెలిసి చేస్తున్నారో లేక తెలియక చేస్తున్నారో మనకు అర్థం కాదు. చనిపోయిన వారికి చేసే దిన వార కర్మలను దీనితో పోల్చుతూ చెప్పడం కొంచెం చికాకుగా ఉంటుంది. అమ్మకు దినం ఏమిటండి ఆమె బ్రతికున్నా భౌతికంగా మనకు దూరమైనా మన గుండెల్లో శాశ్వతంగా ఉంటుంది కదా. ఏ రోజైనా తల్లిని మర్చిపోయే దురదృష్టవంతులు ఉంటారా అలాగే మిగిలినవి కూడా. అసలు మన భాష గురించి తెలిసిన వారేనా ఈ పేరు పెట్టిందని నాకు అనుమానం వచ్చి అడుగుతున్నాను. మనం మాట్లాడే భాష పేరు ఏమిటి. ఆంధ్ర భాష అన్న వారు ఎంతమంది ఉన్నారు. తెనుగు త్రి నగ శబ్దం మూడు కొండల మధ్య ఉన్నది కనుక అది భూమి పార్వతీదేవితో సమానం దానికి 36 అక్షరాలున్నాయి. ఈ త్రి నగ ముల పైన శివ లింగము వున్నది. దీనికి తెలుగు అని పేరు ఆ శివలింగాన్ని చూడడానికి కొండ ఎక్కడానికి 18 మెట్లు ఉన్నాయి. ఒక్కొక్క మెట్టుకు సంస్కృతం నుంచి ఒక్కొక్క అక్షరాన్ని అప్పు తీసుకొని పైకి వెళితే 36 అక్షరాలకు 19 కలిపితే 55 అక్షరాలు తెలుగు భాష. ఈ ప్రపంచానికి తండ్రి. పార్వతీ దేవికి శివుడికి పుట్టిన మహానుభావుడు వినాయకుడు. ఆయన పేరుతోనే నాయకత్వానికి సంబంధించిన అర్థం నిగూఢంగా ఉంది. నాయకులను మించిన నాయకుడు వినాయకుడు నాలుగు మూలల నాలుగు దిక్కులకు ఉన్న అష్టదిక్పాలకులకు మూలకర్త అటు భూమి తన తల్లి పార్వతి దేవి, పైన తన తండ్రి శివుడు ఆకాశం. ఆ భూమిని ఆకాశాన్ని కలుపుతూ ప్రాకృతం నుంచి మరొక అక్షరాన్ని తీసుకువచ్చి 56 అక్షరాలతో పరిణతి చెందిన పరిపూర్ణ భాషను మన ముందుకు తీసుకు వచ్చారు. ప్రపంచంలో ఇంత గొప్ప భాష మరొకచోట ఉండదు అని అనేక మంది పెద్దలు దేశ విదేశాల నుంచి కూడా పొగడ్తలతో నింపారు. అలాంటి తల్లి భాషకు దినం పెడతారా ఎంత ఆశ్చర్యం అని నవ్వుతూ చెపితే నా కనిపించింది నిజానికి ఇలాంటివి తలచుకున్నప్పుడు చికాకు వస్తుంది, కోపం వస్తుంది కానీ వీరికి నవ్వు ఎలా వచ్చింది. ఈ పద్ధతిని ప్రవేశపెట్టిన వాడి మీద జాలా? దీనిని అనుసరిస్తున్న వారి మీద దయా? అరిషడ్ వర్గాలను జయించిన వారికి తప్ప ఆ స్థితి రాదు. నానార్ధాలు ఉన్న భాష, అవధానాలు ఉన్న ఆంధ్ర భాష, శాస్త్రీయంగా 72 వేల నాడీ మండలాలకు వ్యాయామాన్ని ఇచ్చే భాష ఉచ్చరణలో కానీ, అర్థంలో కానీ, వ్రాతలో కానీ స్పష్టత కలిగిన భాష ప్రపంచంలో ఎక్కడా లేదు అని అనేక భాషలను అధ్యయనం చేసిన గొప్పవారు చెబుతూ ఉంటే వీరు ఆ భాషను మర్చిపోమని చెబుతున్నారా లేక మర్చిపోయామని భావిస్తున్నారా? అర్థం కాని విషయం అంటూ తన అసంతృప్తిని వెల్లడించడం నిజంగా నాకు ఎంతో ఆనందం కలిగించింది. అందుకే వారు మాకు మరీ దగ్గరవడం.
గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి (12);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి