గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి (32) ;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

మా శివ నాగ రెడ్డి గారి దగ్గర కూర్చుంటే ఎలా ఉంటుందంటే  ఆయన చుట్టూ  విద్యాధికులు  ఆ ప్రక్క మాలాంటి శిష్యులు  కూర్చుని ఉంటే ఆ రోజుల్లో విష్ణు శర్మ గారు రాజుగారి పిల్లలకు పంచతంత్ర కథలు చెబుతూ దానిలో అంతరార్ధాలతో సహా రాజకీయ శాస్త్రం మొత్తం వారి  మేధస్సుకు అందించినట్లు  చక్కగా చిరునవ్వుతో హాస్యస్ఫోరకంగా  గొప్ప వేదాంతార్థలతో సహా  నాలాంటి వాడికి కూడా అర్థమయ్యే పద్ధతిలో చెప్తారు. ఆయన అనుభవించకుండా ఎదుటివారిని అనుభవింప చేసే గుణం, బాణీ వారి సొంతం. నిజంగా పగలబడి నవ్వవలసిన సందర్భాలలో కూడా చిరునవ్వే ఆభరణంగా ఉంటుంది. అలాంటి గురువు దొరికితే ఎంత  అదృష్టమో కదా అనుకుంటారు చూసేవాళ్లు  అది ఆయన ప్రత్యేకత. ఒక రోజు జరిగిన ప్రత్యేక విశేషం గురించి మీకు చెప్పాలి. దగ్గర స్నేహితుడు గాని బంధువులు గాని కుటుంబంతో సహా వచ్చినప్పుడు చక్కగా అందరూ కలిసి వేళకాని వేళలో  ఇంటిలో ఏవి వుంటే వాటితో తయారు చేసుకొని  హాయిగా కడుపునిండా కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. అదే ముక్కు మొహం తెలియకుండా ఎటూ గాని సమయంలో వచ్చి  ఆకలితో ఉన్న వ్యక్తి అతిథి  ఏదో ప్రయాణం పెట్టుకుని మధ్యలో భోజన వేళకు ఏ  ఇల్లు కొంచెం పచ్చగా ఉంటే అక్కడికి వస్తాడు. అతిథి అంటేనే తిథి వార నక్షత్రాలు లేకుండా వచ్చేవాడు  ఏ సమయాన వస్తాడో అతనికే తెలియదు  అలాంటి వాడిని చూసి ఆ ఇల్లాలు  ఇంటిలో ఏది మిగిలితే అది  పెట్టి అతని ఆకలి తీరుస్తుంది  సమయం సందర్భం లేకుండా వచ్చి  ఆకలితో అలమటిస్తున్న వారికి  ఆమె ఏది వడ్డించినా అది  పరమాన్నం లాగానే ఉంటుంది. మరో రకం ఉంటారు  భోజనప్రియులు శాస్త్రం తెలిసిన వాడు  పంచభక్ష్యా లతో భోజనం చేయాలి  షడ్రుచులు ఉండాలి అని భావించి  ఎవరు బాగా తయారు చేయగలరో ఆ ఇంటిని ఎన్నుకొని అమ్మా నేను మళ్ళీ వస్తాను  ఫలానా  సమయానికి ఫలానా రోజున వస్తాను అని చెప్పి తనకు ఏ పదార్థాలు చాలా ఇష్టమో   వాటి వివరాలు చెప్పి అమ్మా గుత్తి వంకాయ కూర బాగానే ఉంటుంది కానీ దాని కన్నా స్టఫ్ఫెడ్ బ్రింజాల్ అంటే వంకాయ పొట్టకోసి  దానిలో పదార్థాన్ని పెట్టి ఒక దారం కట్టి  దానిని కొంచెం ఎక్కువ నూనెతో వేయించి తింటూ ఉంటే  నీ చేతి వంట స్వర్గ లోకాన్ని చూపిస్తోంది కదమ్మా అని పొగుడుతూ తాను ముద్దపప్పు నుంచి పెరుగు వరకు ఏది ఎలా ఉండాలో చెప్పి వెళతాడు  ఆయన చెప్పిన సమయానికి వచ్చి  ఆమె చేతి భోజనం చేసి  వంట ఎలా ఉండాలో  అమ్మ  అద్భుతంగా చేశారు తల్లి  నూరేళ్లు  హాయిగా సుఖంగా ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని ఆశీర్వదించి,  వెళ్లడానికి దారి ఖర్చులు కూడా తీసుకొని స్వస్తి పలికి మరీ వెళతాడు. ఈ రోజుల్లో ఇలా జరగడం తక్కువే కాని ఇది వరకు అలా వండి వార్చడం వల్ల ఆమె పొందే ఆనందం ఎంత అంతా అని వర్ణించడానికి వీలు లేదు. అది అతిథి అభ్యాగతికి ఉన్న భేదం అని ముగించాడు రెడ్డి గారు. కరతాళధ్వనులతో ఆనందించడం మా వంతు అయింది. 
కామెంట్‌లు