పెద్దలం మనం మారాలి;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811322.
 నిన్న నేను  డ్యూటీ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఒక చిన్న పిల్లవాడు రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్న దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయాను. పల్లెల్లో పొలం పనులు చేసుకునే పాలేరు కూడా అలా మాట్లాడడు. అంత నీచమైన,  అసహ్యకరమైన అతని వయసుకు మించిన మాటలు వింటుంటే నేను నిలబడ్డ భూమి గిరగిరా తిరుగుతూ ఉన్నదా అనిపించింది.  ఆ కుర్రవాణ్ణి జబ్బ పట్టుకుని లాక్కెళ్లి వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్ళాను. ఆ ఉద్రేకంలో  అక్కడే అమ్మా అని పిలిచి  మీరేనా ఈ కుర్రవాడి తల్లి అని అడిగి అక్కడ విషయం తెలియని ఆమెకు సమగ్రంగా చెప్పి ఇలాగేనా పిల్లల్ని పెంచడం బజార్లో తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలు కూడా మాట్లాడుకోని అలాంటి మాటలు ఎలా నేర్పించారు కుర్రవాడికి. అతని మాటలు మీరు ఎప్పుడైనా విన్నారా అని కొంచెం కఠినంగానే ప్రశ్నించాను. ఆమెకు అర్థం కాక  తెల్లమొహం వేసింది. విషయం పూర్తిగా చెప్పాను ఆవిడ మొహం లో చీకాకు, అసహ్యం కనిపించింది నాకు దానితో ఆ తప్పు ఆమెది కాదని  నిర్ణయించుకున్నాను.
అతనిని నేనే కూర్చోబెట్టి నేను, అతని తల్లి ఆ విషయాన్ని మార్చి వేరే విషయాలు అడుగుతూ, ఎవరితో మాట్లాడుతున్నావ్  నువ్వు రోజు ఎవరితో ఆడుతూ ఉంటావు లాంటి  ప్రశ్నలు అడుగుతూ ఉన్న సమయంలో అతని తండ్రి వచ్చాడు.  నాన్నను చూడగానే ఒణికి పోతున్నాడు కుర్రవాడు  విషయం నాకర్థం కాలేదు  ఆయన వారి గదికి వెళ్ళి పోయారు. నాకు కొంచెం కొంచెం గా అతని పరిస్థితి అర్థం అవుతోంది. నా బ్యాగ్ లో ఉన్న చాక్లెట్ తీసి  ఇచ్చి తినమన్నాను తినేటప్పుడు  నా వంక చాలా స్నేహంగా చూశాడు. దానిని చొరవగా తీసుకుని  నాన్నా నాతో స్నేహం చేస్తావా అంటే అంగీకారంగా తల ఊపాడు  నాకు కాస్త చొరవ పెరిగింది  అక్కడ రోడ్డు మీద మాట్లాడిన మాటలు  ఎక్కడ నేర్చుకున్నావు ఎవరు అంటుంటే నీ చెవిన పడ్డాయి  గుర్తు చేసుకొని చెప్పు నాన్నా అంటే అతను చెప్పింది విన్న తర్వాత  నా మెదడు పని చేయలేదు.
నిజం చెప్తున్నా నక్కా నాన్న గారు గదిలో లేనప్పుడు   నాన్న ఫోన్ తీసి చూస్తూ ఉంటే  కొంతమంది మాటలు విన్నాను  అవి మంచి మాటలు కావని నాకు తెలియదు కదా!  అందుకని అలా మాట్లాడాను  అనగానే నాకు కంటి వెంట  నీరు బొటబొటా కారింది  అంటే ఈ తప్పు ఆ కుర్రవాడిదా? అతని తండ్రిదా? సరిగా ఆలోచించండి. మొదటినుంచి మీకు చెప్తూనే వున్నాను పిల్లలు చాలా శ్రద్ధగా మనలను పరిశీలిస్తూ ఉంటారు అని మనం చేసే ప్రతి పని చాలా మంచి పని అనుకుంటారు  దానిని ఆచరించ డానికి ప్రయత్నిస్తారు  పిల్లల్ని మార్చడం కాదు కావలసింది ముందు మనం మారాలి  మన ప్రవర్తన వల్ల వారిని మార్చాలే కానీ ఆ కుర్రవాడి ప్రవర్తన కాదు అనగానే  నన్ను కౌగిలించుకుని  చిన్న పిల్లవే అయినా చక్కటి నిజాన్ని చెప్పావు తల్లీ నేను మావారిని మారుస్తాను. ఆ ఫోన్ లో ఇలాంటివి మాట్లాడకుండా చేస్తాను. దానిలో ఉన్న వాటిని తొలగిస్తాను నీలాంటి వారి ప్రచారం ఈ సమాజానికి చాలా అవసరం అని నీవు చేసిన పనిని అభినందిస్తున్నాను  అని మా అమ్మలా నుదుట ముద్దు పెట్టి ఆశీర్వదించింది. ఎంత ఆనందించి ఉంటానో మాటలలో చెప్పలేను.


కామెంట్‌లు