నిజం చెప్తే ఒక చాక్లెట్;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 పిల్లల అల్లరిని ఆనందించడమే కాదు వారి ప్రవర్తన కూడా గమనిస్తూ ఉండాలి. లేకపోతే  వారు పరిసరాల ప్రభావాలకు గురై చెడు మార్గాలలో పయనించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లల మనసులు చాలా సున్నితమైనవి అందుకే వారిని ఏ మాత్రం నొప్పించకుండ మంచి అలవాట్లను వంట బట్టించాలి. అబ్బాయిలకి ఇంట్లో అయితే ఏవో కొన్ని... కారు, గన్, ఫోన్ లాంటివి, అదే అమ్మాయిలైతే వంట సామాగ్రి లాంటిది, బార్బీ బొమ్మలు, రంగురంగుల ఆట వస్తువులను ఇచ్చి వాటితో వారు ఆడుతుంటే అది చూసి తెగ సంబర పడిపోతూ ఉంటాము. ఎంతసేపని ఇంట్లోనే వారిని బంధిస్తామంటూ అలా పార్కుకో, బయటకో తీసుకుని వెళ్లి నలుగురు పిల్లలతో కలిసి ఆడుకోమని వారిని మచ్చిక చేసి పంపిస్తాం. అయితే కొద్దిసేపు బాగానే ఆడుకుంటారు కానీ, పిల్లలు కదా చిరుకోపాలు, చాడీలు, కొట్టుకోవడం లాంటివి సహజం. ఉదాహరణకు ఒక పిల్లవాడు అమ్మా అమ్మా వాడు నన్ను కొట్టాడు అంటూ పరిగెత్తుకు వచ్చి  చెప్పాడనుకోండి అవునా సరే అసలు ఎందుకు కొట్టాడు? అసలు నువ్వు ఏం చేశావు అని అడగాలి. నేను ఏం చేయలేదు అని చెప్పాడంటే
సరే పద నేనూ వస్తాను తప్పు నువ్వు చేస్తే దెబ్బ పడుతుంది అని చెప్పారనుకోండి సహజంగా తప్పు తనదై వుంటే ఆ పిల్లవాడిలో భయం మొదలవ్వాలి. అప్పుడు నిజాన్ని ఒప్పుకుంటే తప్పు చేసినందుకు దండించాలి. దానితోపాటు నిజం చెప్పినందుకు ఒక చాక్లెట్ బహుమతిగా ఇవ్వాలి. దాంతో పిల్లవాడు నిజం చెప్పడానికి అలవాటు పడతాడు, అబద్ధాలు ఆడడు. కొంతమంది పిల్లలు ఉంటారు తప్పుచేసినా సరే వాదిస్తారు. అలాంటి వారిని మొదట్లోనే మందలించాలి లేదంటే మొండిగా తయారవ్వడమే కాకుండా ఊరికే తగవులలో చిక్కుకుంటూ 
ఉంటారు. అందరూ మొక్కై వంగనిది మానై వంగునాఅన్న సామెత వినే ఉంటారు కదా పసిపిల్లలు మొదట్లో ఎలా మెలుగుతారో అదే విధంగా వారి వ్యక్తిత్వాన్ని కూడా మలచుకుంటారు అందుకే అబద్ధాలు ఆడడాన్ని అస్సలు ప్రోత్సహించకూడదు, మొదట్లోనే ఖండించాలి లేకపోతే చాలా ప్రమాదకరం. కామెంట్‌లు