అమ్మ బంగారు మనసు;-డా. నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 అమ్మ అన్న శబ్దాన్ని ఉచ్చరించని మనిషి ఈ భూ ప్రపంచంలో ఎవరూ ఉండరు అని నా ఉద్దేశ్యం. బిడ్డను నవమాసాలు మోసి ప్రసవ సమయంలో నరకాన్ని అనుభవించి  జీవన్మరణ సమస్యతో  కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో ప్రసవ వైరాగ్యం కలిగి ఇంక జీవితంలో  గర్భం దాల్చ కూడదు అని కఠిన నిర్ణయం తీసుకుంటుంది కానీ అది ఎంత కాలం ఆ బిడ్డ భూమిమీద పడేంతవరకే  ఆ పసిగుడ్డును చూసిన మరుక్షణన  ఆడబిడ్డ అయితే మరొక మగ బిడ్డ మగ బిడ్డ అయితే మరొక ఆడబిడ్డ కావాలన్న  కోరిక  తప్పకుండా కలుగుతుంది ఒక బిడ్డ బిడ్డా కాదు ఒక కన్ను కన్నూ కాదు అని పెద్దలు చెప్పిన నానుడి.  ఆ మమకారం ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది. అమ్మలో మాతృత్వం ఎప్పుడు ఉప్పొంగుతుంది అనేది మీరు ఎవరైనా పరిశీలనగా ఆలోచించారా నా ఆలోచన చెప్తాను బిడ్డను కన్న మరుక్షణం. నా ఆలోచన సరైనదో కాదో మాతృమూర్తులు చెప్పాలి.
ఒడిలో ఆ బిడ్డను  కూర్చోబెట్టుకొని  వెండి పాత్రలో  నేతితో  కలిపి గోరుముద్దలు పెడుతూ ఉంటే  ఆ తల్లి ఎంత ఆనందంలో మునిగి ఉంటుంది. మనం ఊహించగలమా?  ఆ బాబు కొంచెం పెరిగి తనకు తినిపిస్తున్న సమయంలో తాను కూడా ఓ ముద్ద తీసుకుని అమ్మకు తినిపించే ప్రయత్నం చేసినప్పుడు  ఆ దృశ్యం చూసే వారికి కూడా కన్నుల పండుగగా ఉంటుంది. అమ్మ తల అటు ఇటు తిప్పినా  పట్టువదలకుండా ఆమెకు తినిపించేంత వరకు  ప్రయత్నించి అమ్మ నోటికి అందించిన తర్వాత వాడి బోసినవ్వులతో  తప్పట్లు కొట్టుకుంటూ ఆనందిస్తున్న సుఖాన్ని ఏ తల్లి వదులు కుంటుంది. 20 సంవత్సరాల పాటు ఆ బిడ్డ కోసం తపస్సు చేసి  శ్రీకృష్ణ లీలలు అనుభవించిన యశోదాదేవి  దగ్గరకు పొరుగున ఉన్న తల్లులు వచ్చి ఈ కుర్రవాడి మీద ఫిర్యాదు చేస్తే  మన ఇంట వెన్న మీగడలకు కొదవా  అని ఆమె దండించేలా నటించే వ్యక్తి  వేదికపైన గొప్ప  పేరు ప్రఖ్యాతులు సంపాదించిన  నటీమణులు అయినా  ఆ అనుభూతిని  అందించగలరా?చిన్నతనంలోనే మా బుజ్జి తల్లి  పనికి శుభ్రతను నేర్పిన అమ్మ అలవాట్లబాటలో నడిచి చేత చీపురు పట్టి  పాచి పని చేస్తుంటే ఆ తల్లి ఛీ పనిమనిషిలా అదేమిటి అలా చేస్తున్నావ్ అని ఈసడించుకోకపోగా బంగారు కొండలా ఎంత చక్కగా పనిచేస్తుంది నా కూతురు అని మురిసిపోదా?  ఆ వయసు పిల్లలతో ఆడుకుంటూ  వారందరిలో ఘన విజయాన్ని సాధించినప్పుడు  ఆ ఆనందం ఆ బిడ్డదా ఆ అమ్మదా. కనుక నేను మొదటి నుంచి మీకు చెప్పే విషయం  మనం పిల్లలను  క్రమశిక్షణతో  ఆత్మాభిమానాన్ని పెంచుతూ  పని చేయడంలో  కూడా తన ప్రతిభను చూపాలని వారికి అర్థమయ్యేలా చెపితే  మనలను మించిన  పనిమంతులు అవుతారు లేదూ బద్దకస్తులై మనకు  మానసిక క్షోభను మిగులు స్తారు. వారిని ఎలా చేయాలో మీరే నిర్ణయించుకోండి. ఇది నా సలహా మాత్రమే  ఎందుకు చెబుతున్నానంటే వారు పెరిగి పెద్దవారై  ఇతరుల చేత నీ తల్లి పెంపకం ఇలాంటిదా అని వేలెత్తి చూపించకూడదు అని.



కామెంట్‌లు