కొమ్మల్లో కోకిల-బాల గేయాల ;- ప్రమోద్ ఆవంచ-- 7013272452

 తల్లి ముఖం పిల్లకు మొదటి ఆట బొమ్మ.తల్లి ఒడి మొదటి ఉయ్యాల.తల్లి కావిలింత మొదటి వెల్కమ్.తల్లి చిరునవ్వు పిల్ల ఆత్మకి మొదటి వెలుగు.నిద్రలోనుంచి తనలోకి మేల్కొనమనే సృష్టి ఆహ్వానాన్ని తల్లి మొదటి పిలుపులో నుంచే అందుకుంటుంది,పిల్ల... అన్నారు చలం ఒక పుస్తకానికి రాసిన పీఠికలో, అవును నిజమే కదా,మనందరి జీవితంలో శైశవం, ఒక అద్భుతమైన దశ.ముఖ్యంగా ఈ భూమి మీదకు వచ్చాకా,ఏ శిశువు అయిన అమ్మ ముఖమే చూస్తుంది.
ఆకలైతే,గుక్క పట్టి ఏడుస్తుంది,పాలు తాగాకా,నిద్ర పోతుంది.కడుపు నిండాకా,నిద్ర పోయేకంటే ముందు శిశువు కళ్ళల్లో మెరుపు, కడుపు నిండిందన్న ఆనందం 
తన బోసి నోటితో వ్యక్త పరుస్తుంది.ఆ నవ్వు వెనక ఉన్న తృప్తి ని, చూసాకా తల్లి మనసుకు అర్థం అవుతుంది బిడ్డ ఆకలి తీరిందని.తల్లీ బిడ్డల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థ పాత మూకీ సినిమాలను తలపిస్తుంది.బిడ్డ అవసరాలు,బాధ, సంతోషం, అనారోగ్యం, అన్నీ తల్లికి తెలిసిపోతుంది.ఇద్దరి మధ్య వున్న పేగు బంధం,ప్రతి ఒక్కరి గుండెలోని,కండక్షన్ సిస్టం లాంటిది అన్నమాట,అంటే,అది ఉత్పత్తి చేసే ఇంపల్సల్స్,ట్రకీకార్డియా,బ్రడీ కార్డియా లనీ, మనం అంటుంటాం.అలా గుండె కొట్టుకోవడంలో  హెచ్చుతగ్గులను ప్రతిక్షణం తల్లి అనుభవిస్తుంది.
                     అన్నీ తెలిసినా తల్లి ఒక్కొక్క క్షణంలో, బిడ్డ బాధను అర్థం చేసుకోలేక, కాపాడుకోవడానికి తడ్లాడుతుంటుంది.బిడ్డ పుట్టాక, మొదటి మూడేళ్ళ కాలం, తల్లికి పరిక్షా కాలం.బిడ్డ బోర్లా పడకుంటే సమస్య, బోర్లా పడి అంబాడకుంటే సమస్య, లేచి నిలబడ్డాకా, కాళ్ళను నేలకానించకపోతే కూడా సమస్యే.కాళ్ళు కొద్దిగా ఒక్కరగా వున్నా భయం....
అలా తల్లి బిడ్డ ను తనలో ఒక బాగం అనుకుంటుంది.చలం గారు అన్నట్లు, శిశువును, ఈ సృష్టికి ఆహ్వానించిన అమ్మే సర్వస్వం, తల్లి ముఖమే మొదటి ఆట బొమ్మ,ఒడి ఉయ్యాల, అంతేకాకుండా మాతృత్వం ప్రతి స్త్రీ కి,ఒక వరం.నవ మాసాలు మోసి,కన్న బిడ్డను చూసిన తల్లి కళ్ళల్లో మెరుపు, చిరునవ్వు, బిడ్డ ఆత్మ కి మొదటి వెలుగు.....
                 ఇలాంటి ఎన్నో అనుభవాలను,చవి చూసిన  గృహిణి, అమ్మ,అత్త, అమ్మమ్మ, 
శ్రీమతి ఎడ్ల లక్ష్మి, రాసిన "కొమ్మల్లో కోకిల" గేయాల సంపుటిని,తన ఇంట్లో అన్నం పెట్టి మరీ ఇచ్చింది.అద్బతమైన భోజనం,తింటుంటే,మా అమ్మ జ్ఞాపకం వచ్చింది.ఎంత సున్నిత మనస్కురాలైతే గానీ, పిల్లల గురించి,అంతా గొప్పగా, రాయగలదు, ఎంతో రీసెర్చ్ చేస్తే కానీ అది సాధ్య పడదు.మళ్ళీ అదే పీఠికలో చలం గారు పిల్లలకి పాటలు రాయడమంటే
సామాన్యమైన పని కాదు.దానికన్నా మహాకవి కావడం చాలా సులభమనీ అన్నారు.నిజమే పిల్లల గీతాలు, కథలు రాయడం అంత సులభం కాదు.
 సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన ఎడ్ల లక్ష్మీ గారిది తల్లి హృదయం, పిల్లల గురించి ఆమె రాసినంతగా ఎవరు రాయగలరు.అందుకే,బాల సాహిత్యంలో, దాదాపు పది పుస్తకాలు రాసి, వాటిని ప్రచురించారు.
               ఇంకా కొమ్మల్లో కోకిల బాల గేయాల సంపుటి విషయానికి వస్తే,ఎడ్ల లక్ష్మి గారు ఉత్తర తెలంగాణ
పలుకుబడిలో,చక్కగా,పొట్టి గేయాలు రాశారు.కొన్ని పదాలను పరిశీలిస్తే, గరుకపోస అంటే గడ్డి,గురిగి అంటే అప్పట్లో కుమ్మరులు మట్టితో చేసిన చిన్నపాటి కుండ అనవచ్చు
అది వాళ్ళ కుల వృత్తి.ఎంతో నైపుణ్యంతో రకరకాల కుండలను తయారు చేసేవారు.
ఆ గురిగిలో,పెరుగు తోడు వేసేవారు,తోడుకున్న పెరుగు ఎంతో తియ్యటి రుచి వుండేది.గట్టి పెరుగు ప్లేటులో,వేస్తే కదిలేది కాదు.అప్పట్లో కొందరు గురిగిలో 
డబ్బులు కూడా దాచుకునేవారు.గురిగిలో,పాలను తోడు పెట్టి సూరుకి ఉట్టి కట్టి,ఆ ఉట్టిలో గురిగిని పెట్టేవారు.మరొక పదం ముక్కాళపీట అంటే మూడు కాళ్ళ పీట అని అర్థం,ఆ పీట మీద రాత్రిళ్ళు కందిలి వెలిగించి పెట్టేవారు.ఇక దంపుడు బియ్యం అంటే వడ్లను 
రోట్లో వేసి దంచితే వచ్చే బియ్యాన్ని ఎసట్లో వేసి వండేదే
అన్నం,ఆ అన్నంలో  పొంటి తొక్కు వేసుకుని తింటే
పుల్ల పుల్లగా అద్భుతంగా ఉంటుంది.అలాగే పొట్టి మొలక బియ్యంతో అన్నం కూడా రుచిగా ఉండేది. లక్ష్మి
గారు మరొక పదం వాడారు,అదే బొమ్మల వొయ్యి...వొయ్యి అంటే పుస్తకం ఇప్పటి తరానికి తెలుసో,తెలియదో,నాకు తెలువదు, కానీ వారికి తెలియాలని చెపుతున్నాను.
                కాకులు తో పొదిగింపజేసి, పిల్లలను కన్న కోకిల,తన పిల్లలకు మేత పెట్టి కాపాడుకునేది.కానీ పిల్ల కోకిల గొంతు విని కాకుల తల్లి,పొడిచి తరిమేసేది.... "కొమ్మల్లో కోకిల" గీతం హృదయాన్ని కలిచివేస్తుంది.
తాతయ్య ఇంటికి వస్తే మనవలు, మనవరాళ్లు ఎంత ఆనందపడుతారో, మాటల్లో చెప్పలేనిది, వస్తూ,తాను తెచ్చిన లడ్డు, మిఠాయిలు,అరటి పండ్లు.లడ్డు, మిఠాయిలు పిల్లలు తినేవారు,అరటి పండ్లు అమ్మ, నాన్నలకు ఇచ్చేవారు, తరువాత రాత్రి కి తాతయ్య కథలు చెపుతుంటే పిల్లలు నిద్ర పోయేవారు...ఇదీ "రైలు బండి"గీతం.అలాగే పచ్చదనాన్ని పెంచాలనీ, ప్రకృతిని కాపాడాలని "కప్ప చదివిన పత్రం"గీతం అద్బుతం."దీపావళి టపాసులు"గీతంలో, బాంబులు,తోక పటాకులు పేల్చకండీ,కాకర పుల్లలు,పాము బిళ్ళలు మాత్రమే కాల్చండి అని, పిల్లలకు జాగ్రత్తలు చెప్పారు లక్ష్మి గారు.అంగ వైకల్యంతో బాధపడేవారిని చులకనగా చూడకండి, వీలైతే వారికి సహాయం చేయమని చెప్పే చక్కని గీతం "చక్కని భావాలు".
                       ఆకలి మీద ఉన్న‌‌‌ ఎలుగుబంటి చెరువులో చేపను పట్టి తినేందుకు సిద్దమైంది.చాప నన్ను తినవందని ఎక్కి ఎక్కి ఏడ్చింది.దాంతో, ఎలుగుబంటికి జాలి కలిగి వదిలేసింది.అప్పటి నుంచి ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు.ఇదీ "ఎలుగుబంటి చేప చెలిమి"గీతం, ప్రతి ఒక్కరిలో,జాలి,దయ గుణాలు ఉండాలని చెప్పే ప్రయత్నం.
                ఇలా చిన్న పిల్లలను ఆకర్షించే అద్బుత,వీర,కరుణ,శాంత,హాస్య, గీతాలు అనేకం ఈ పుస్తకంలో వున్నాయి.వీలైతే కొమ్మల్లో కోకిల పుస్తకాన్ని కొని మీ పిల్లలకు బహుమతిగా ఇవ్వండి.
                                     
కామెంట్‌లు