గుర్తుకొస్తున్నాయి-- మా మర్ఫీ రేడియో;- సత్యవాణి కుంటముక్కుల 8639660566
  ఏమిటో ఆరోజుల్లో  అ మా మర్పీరేడియోలోవచ్చే ఆకాశవాణి కార్యక్రమాలలో కొన్నింటిని గురించి తలుచుకొంటే ,ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది .
      ఉదయం వందేమాతరంతో మొదలెట్టిన రేడియో కార్యక్రమాలు ,రాత్రి జనగణమనతో ముగిసేకానే రేడియోని కట్టడమంటూజరిగేదికాదు.విజయవాడ,హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రాలను మార్చి మార్చి వినేవారం.
     రోజుమొత్తంలో ఎన్నెన్ని కార్యక్రమాలు!అన్నివయసులవారికి,వారివారి అభిరుచులు తెలిసినట్లు ఎంతచక్కగానో కార్యక్రమాలు ప్రసారంచేసేవారు. 
     ప్రతీ శనివారం భక్తిరంజనిలో ఆరుగంటలకు వేంకటేశ్వర సుప్రభాతం  ఠంచనుగా వేయడమేకాక,మిగిలినరోజులలో                     భక్తిరంజనిని ఆ ఆవారాలని బట్టి వచ్చే భక్తిపాటలు వచ్చేవి.ఆదివారం బాలాంత్రపు రజనీకాంతరావుగారుపాడే 'శ్రీసూర్యనారాయణా!మేలుకో హరిసూర్యనారాయణా!పాట ప్రతీవారంవిన్నా విసుపొచ్చెేదికాదు.అన్నట్లుబాలాత్రపు రజనీకాంతారావుగారూ,ఆయన తమ్ముడు నళినీకాంతారావుగారూ ,ఈయన ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఎడిటర్ గా అనుకొంటా పనిచేసేవారు.వీరిద్దరూ మా అమ్మకు అంటే ,పూళ్ళభానుమతికి  మేనత్తకొడుకులౌతారు.వారిగురించి చెపుతున్నప్పుడు చెప్పొద్దూ,మా అమ్మకంటే నాకే కొంచంగర్వంగానే అనిపిస్తుంది.
     అలాగే గాన సమ్మోహనుడు బాలమీరళీకృష్ణగారి 'ఏమిచేతురా లింగా'అనే తత్వంకూడా ఏన్ని సోమవారాలు విన్నా విసుపువచ్చేదేకాదు.అలాగే రామదాసుకీర్తనలు,తూము నరసింహదాసుకీర్తనలూ ,అవీ ఇవీ అనికాదు,'తింటే గారేలే తినాలి,వింటే భక్తిరంజనే వినాలి'అన్నవిధంగా ప్రతీరోజూవిసుగనిపించకుండా, అధ్బుతంగా,వీనులవిందుగా,నాస్తికులుకూడా ఆస్తికులైపోయేవిధంగా మధురాతి మధురమైన కంఠస్వరాలతోసాగిపోయేది భక్తిరంజని.
      అదేమిటోగానీ వ్యవసాయకార్యక్రమం దూరదర్శన్ లో వచ్చినప్పుడు 'దూడా-పేడా'అంటూ అందరూ జోకులేసుకొనేవారంకానీ ,రేడియోలో వచ్చినప్పుడు వారి కఠంమాధుర్యానికి కాబోలు ఆసక్తిగా ఆలకించేవారం ..
      ఆతర్వాతవచ్చే,"వార్తాం ,సూయంతాం,బలదేవానందసాగరహా'అంటూవచ్చే సంస్కృతవార్తలు కూడా అర్థంగాకపోయినా,ఆ కఠంలోని గంభీరత కదలకుండా కట్టిపడేసేది.
       ఇక ప్రాంతీయవార్తల సంగతికి వచ్చేసరికి,ఎవరు చదివినా,ఢిల్లీనుండివచ్చేవార్తలు కూడా ఎవరుచదివినా ఎంతో ఆసక్తిగా,ఈరోజు  ఎవరుచదువుతారా? అనుకొంటూఆసక్తిగా ఎదురుచూసేవాళ్ళం.ఢిల్లీ వార్తలు జగ్గయ్యచదివినా,పణ్యాలరంగనాధరావుగారుచదివినా, మంగమ్మగారు చదివినా మహత్తరంగా చదివేవారు.
      అలాగే ప్రాంతీయవార్తలుకూడా  ,చదువేది,కొప్పులసుబ్బారావుగారుకానీ,ఓంకార్ గారు కానీ, మరెవరుచదివినా,వార్తలలో సారాంశం కన్నా ,వారికంఠాల్లో గంభీరత కట్టిపడేసేది.వార్తలు వచ్చినంతసేపూ, ఇంట్లో ఇంటెడుమంది పిల్లామేకా వున్నా, అస్సంబ్లీలోలా అరుపులూ-కేకలూ వేయకుండా,ఇంటిల్లుపాదీ వార్తలు పూర్తైయ్యేవరకూ మౌనం పాటించి,నాన్నా,చిన్నాన్నా,అన్నయ్యా వార్తలు వినడానికి సహకరించేవారం.
     ఎందుకంటే ఇప్పటి టీ.వీల్లోలా నిమిషనిమిషానికీ వార్తలు వచ్చేవికాదు అప్పట్లో.ఢిల్లీనుండివార్తలు ఉదయం ఏడుగంటలకొస్తే,మళ్ళీ రాత్రి ఏడుగంటలకే వచ్చేవి.ప్రాంతీయవార్తలుమటుకు మధ్యాహ్నంకూడావచ్చేవి.
     వార్తలతరువాత గాంధీ మార్గమనో,లఘునాటికో ఏదోఒక మంచి కార్యక్రమం,మధ్యలో ఏదోఒక మంచి సినీమానుంచి ,ఒకటి ,రెండుమంచిపాటకూడావేసేవారనిగుర్తు.తరువాత సంగీతకార్యక్రమమో ఏదోవేసి,తరువాత శ్రోతలుకోరినపాటలు కూడావచ్చేవి.పాటలకన్నా,ఆపాటను కోరిన శ్రోతలపేర్లు చదవడానికిఎక్కువసమయం పట్టినా,ఆపేర్లలో ఎవరైనా ఒక్కరిపేరైనా తెలిసినవారిదిీ,చుట్టాలదీ రాకపోతుందాఅని ఆసక్తిగా వినేవారం.అలా ఏన్నడూ జరగలేదుకానీ,ఆపేర్లన్నీ చదవడానికి ఎక్కువసమయం పట్టినా విసుగనేది వచ్చేదేకాదు సరిగదా ,వాళ్ళపేర్లుకూడా కంఠస్థమైయ్యేవి.
    ఇక రెండవప్రసారంలో కార్మికులకార్యక్రమంలో '"రామయ్యా!ఏమిటి ఆలోచిస్తున్నావ్ ?అని  ఒకడు అడిగితే,ఇంటిపైకప్పుకు ఏమివెయ్యాలా అని ఆలోచిస్తున్నా'"అంటాడు రామయ్య."ఓస్! దానికంత ఆలోచన ఎందుకూ? చార్ మీనార్ వారి సిమ్మెంటురేకులుండగా!"అంటాడు మొదటివాడు.ఆనాడు రేడియోలో వచ్చిన ఈ అడ్వటైజ్ మెంటు ఈనాటికీ ప్రజల నాలికమీద ఆడుతోందంటే అతిశయోక్తి ఎంతమాత్రంకాదు.
    ఇక కార్మికుల కార్యక్రమంలో అడపాతడపా వేసే సినీమా పాటకోసం, ఆ కార్యక్రమాన్ని  ఇష్టంగా చూసేవారం.కార్మికులకార్యక్రమంలో వచ్చే కర్మాగారల పనితనంగురించీ,కార్మికులకు సంబంధించిన చిన్నచిన్న సమస్యలగురించీ  నాటకాలుగా వచ్చి బలేగావుండేవి.
    తర్వాతకార్యక్రమం అత్యంత ఇష్టమైన స్త్రీలకార్యక్రమం.వనితావాణి. అకార్యక్రమంలో వినిపించే శారదా శ్రీనివాసన్ ,శారదా అశోకవర్థన్ ,వింజమూరిలక్ష్మి, సీతారత్నం.నండూరి విఠల్ మొదలైనవారి కంఠాలతో ప్రసారమైయ్యే ఏకార్యక్రమమైనాసరే, చెవులలో తెేనే పోస్తే,నాలుకతో తీపిని ఆస్వాదించేవారం.
     అటుతర్వాత వచ్చే 'ఈమాసపు పాట'అంటూ మావయ్య తిలక్ మావయ్య నెల్లాళ్ళు గా ఒకపాటనేర్పినా, వినడానికి విసుగొచ్చేదేకాదు.ఆ ఈమాసపుపాట రాసుకోడానికి పెన్నూ,పుస్తకంతో రడీగావుండి,పాటరాసుకొంటూ,రేడియో  మావయ్యతో గొంతుకలిపి అచ్చంగా ఆయనలాగే పాడడం గొప్పేకదామరి.ప్రతీ కార్యక్రమంలోనూ మధ్యమధ్య,ఊరిస్తున్నట్లు ఒకటో రెండో సినీమాపాటలు వేసేవారు.నిజంచెప్పాలంటే,కార్యక్రమం ఏది ఎలావున్నా ఆ సినీమాపాట వింటే మనసుకు హుషారువచ్చేది.
    
     ఇక సాయంత్రం ప్రసారాలలో ఐదుగంటలకు 'రేడియోలో "సిలోన్ స్టేషన్ నుంచి 'మీనాక్షీపొన్నుదొరై'వేసె ఒకే ఒక్క తెలుగుపాట వినడంకోసం అంత వెర్రెక్కిపోవాలా?ఆ ఎనౌన్సర్ ముద్దు ముద్దుగా ,వచ్చీరానిమాటలతో తెలుగులో 'మీ మీనాక్షీపొన్నుదొరై' అన్న ఆఒక్క,ఆఒక్క  మాటకోసమే ఆమెను ఆరాధ్యదేవతలా ఆరాధించడం వెర్రేకదామరి.
     ఇక అలాగే   ప్రతీ ఆదివారం   నేషనల్ పిల్మ్ అని వారానికి ఒకభాషచొప్పున, అన్నిభాషలలో ప్రసారమయ్యే సినీమాలతోపాటుగావేసే, 
తెలుగు  సినీమాకోసం,కన్నులు కాయలుకాసేలా ఎదురు చూడడం ,!
     'ఎ 'అంటే అస్సామీ అని, 'బి' అంటే బెంగాలీ అనీ, అలా ఆల్బా బెటికల్ గా ఢిల్లీనుంచి ప్రసారమయ్యే శబ్దచిత్రాలలో,'టి'అంటే ఈసారి తప్పక తెలుగు సినీమానే అని, ఆ ఆదివారంనాడు తిరునాళ్ళలో మూకలా ఊళ్ళోఉన్న ఆడంగులు,పిల్లకాయల్తో సహా,  మా మర్ఫీ రేడియో ముందు బైఠాయించాకా,తీరా ఆ ఢిల్లీవాడు దగాచేసి , తెలుగుసినీమాకాకుండా తమిళం సీనీమా వేస్తే,తెలుగుసినీమా విందామని కూడిన ఆ మందంతా, అదేదో ఆ తప్పుపని,  ఆనేరం నేను చేసినట్టు, ఆ తెలుగుసినీమా రాకుండా నేనేదో దగా చేసినట్టూ, నాకేసి చురచురా చూస్తూ,ఛంగుమంటూలేచి, చంగులు జాడించుకొంటూ,విసవిసా ఇళ్ళకి వెళ్ళిపోతుంటే, నిజంగానే నేనే ఆ తప్పుచేసినట్టు, సిగ్గుపడుతూ, అవమానంగాభావించడం నాకు వెర్రికాక మరేమిటి!
    మూడు నాలుగు నెలలు ఎదురుచూడగా చూడగా,  తమిళం సినీమా తరువాత ఆదివారం తప్పకుండా  'టి ' అంటే 'టిస్పామీ 'అనే వేరే భాషఏదీ  లేనికారణంగా,తెలుగు  సినీమాయే వేసినా,అది ఏ అవార్డు సినీమాయో అయి ,అర్థం పర్థంకాక పోయినా,అర్థమైనట్టు నటిస్తూ, అమితంగా ఆనందించడం అన్నది వెర్రికాకపోతే మరేమిటి?
        శని ఆదివారాలలో వచ్చే,బాలానందం ,బాలవినోదం కార్యక్రమాలు వింటూ ,నిజమైన ఆనందాన్ని అనుభవించడం,అందులో నేర్పేపాటలను నేర్చుకొంటూ,అక్కయ్యా,అన్నయ్యల మాటలలోని మజాని జుర్రుకోవడం కూడా ఒక వెర్రితనమేఅంటారేమో ఈనాటి పిల్లలు.
    ఇక రాత్రిప్రసారాలలో,పేరు సరాగ్గా గుర్తులేదుకానీ,పొలాలనుండి నాన్నా,చిన్నాన్నా,అన్నయ్యా ఇంటికి వచ్చేసమయానికి,పాడిపంటలో,పసిడిపంటలో ఏదో ఒక వ్యవసాయకార్యక్రమం వచ్చేది.తరువాత ఉదయం వచ్చినట్టే,ప్రాంతీయ వార్తలు,ఆతర్వాత ఢిల్లీనుండి వార్తలూ వస్తుంటే,గడగడా పాఠాలుపైకిగట్టిగా చదువుతూ,మిగతా చదువుకొనే పిల్లలకు తోచకుండా,తొణక్కుండా చదివే పిల్లగాళ్ళుకూడా,వార్తలు పూర్తి అయ్యేవరకూ, గునగునమని నోట్లో నోట్లో గొణుక్కుంటూ చదవవలసిందే.
      అన్ని రేడియో క్రమాలమాట అలావుంచితే,సరిగా జ్ఞాపకం రావటంలేదుకానీ,వారంలో ఒకరోజు రాత్రి ఎనిమిది గంటలనుండి తొమ్మిదిగంటలకువరకూ అనిగుర్తు, ఢిల్లీనుండి ఇంగ్లీషువార్తలు వచ్చేవరకూ మంచిమంచి సినీమాపాటలు వచ్చేవి. 
 చెప్పానుకదా,మారేడియో 
మెట్లగదిలోవుండేది.అతిశయోక్తిగా చెప్పాలంటే, మా వంటిల్లు ,భోజనాలవసారా ఫర్లాంగుదూరానికి కొంచం దగ్గరగావుండేది. మాపిన్ని సుందరమ్మ ఊళ్ళోలేకపోతే, భోజనాలైపోయాకా,భోజనాలు చేసినపీటలు కడగడం,వంటపొయ్యి అలికి వంటిల్లు ,భోజనాలవసారా కడగడం ,తులసికోట కడగడం,కడిగిన అన్నిచోట్లా ముగ్గుకర్రలేయడం డ్యూటీ నాకుపడేది.
      ఉత్తిరోజుల్లో అయితే,'ఆడుతుపాడుతు పనిచేస్తుంటే అలుపూసొలుపేమున్నదీ ,
చీపురుతో వంటిల్లుకడిగితే,
చెడుపేమున్నదీ'అనిపాడుకొంటూపనిచేసేదాన్ని కానీ,
సినీమా పాటలువచ్చే ఆ  బుధవారంమటుకు,అదేపాటను ఏడుస్తూ,ఇంట్లోవాళ్ళని తిట్టుకొంటూ,ముఖ్యంగా మా అన్నయ్యని చెడా మడా తిట్టుకొంటూ ఆపనులు చేసేదాన్ని.అన్నయ్యను తిట్టడం ఎందుకంటే, బోజనాలవసారాలో రేడియో కార్యక్రమాలు వినపించేలా మైకు బిగిస్తానని ప్రతీసారీ మాట ఇవ్వడమేకానీ,'రాజకీయనాయకుడిలా మాటమీదనిలబడింది ఏనాడూలేదు.రేడియోలు మరుగునపడి టీ.విలు వచ్చిపడ్డాయికానీ,మా అన్నయ్య మా వంటింట్లో మైకుమాత్రంబిగించనేలేదు.
    ఆరోజుల్లోజరిగిన మాట ఒకటి,  మీకుమాత్రమే చెపుతాను.ఒకసారి లాంగ్ లీవ్ పెట్టి మాపిన్ని పుట్టింటికెళ్ళిన సందర్భంలో, ముందులో చెప్పినట్లు, వంటిల్లు కడగడం మొదలగు పనులు నామీద వచ్చిపడ్డాయి. ఆరోజు రేడియోలో పాటలు వచ్చేరోజు.ఓపక్క రేడియో నాకిష్టమైన సినీమాపాటలు మా మర్ఫీ రేడియో పాడేస్తోంది, పాటలైనాకా కడుగుతానంటే మా అమ్మ ఒప్పుకోలేదు.."ఎంగిళ్ళతో వంటిల్లు అలావుంటే దరిద్రమని"తరువాతకడగడానికి "ససేమీరా" అంది .అంతే ,కాళ్ళుబాదుకొంటూ వంటింట్లోకెళ్ళాను.మా పైడమ్మ తోడిపెట్టిన గణేష్ బ్రాండ్ వారి ఇనప నీళ్ళబకెట్టు వటింట్లోకితెచ్చిన నేను అమితమైన నాకోపం అంతా ఆనీళ్ళబకెట్టుపైచూపించి,నాబలమంతా చూపించి బకెట్టును నేలమీదకుదేస్తే,ఆ నీళ్ళతోవున్న ఇనపబకెట్టు, అప్పడంలా అడుగు మట్టువరకూ అణిగిపోయిందంటే నమ్మాలిమీరు.అంతకోపం ఇప్పటివరకూ మరెప్పుడూ రాలేదన్నది నిజంగా నిజం.
     సరే !ప్రతీదాన్నీ ఆరాతీసే,ఆరాగాచూసే మా అమ్మకుమాత్రం, రాత్రికి రాత్రి  ఆ బకెట్ అంతలా ఎందుకైపోయిందో ,అంతలా ఎలా మణిగిపోయిందో  ఆమె చివరి శ్వాసవరకూ కనుక్కోలేకపోయిందన్నదిమాత్రంనిజం.
     నేనుమాత్రం ఆనాటి నాకోపం,ఉక్రోషం తలుచుకొంటూంటే,ఆనేనా ఈ నేను అని తికమకపడుతుంటాను.ఒకింత సిగ్గు పడుతుంటానుకూడా.
        
     

కామెంట్‌లు