అదృష్టం కలిస్తే;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,949281132
 జీవితంలో ధనవంతులను చూసి ఎదుటి వారు బాధపడుతుంటారు వారిని  చూసి వీరు ఈర్ష్య పడుతూ ఉంటారు. కారణాలు అనేకం  తనకు ఉన్నది కదా వున్నదాని ద్వారానే చేసుకోవచ్చు అన్న అభిప్రాయంతో వారు ఆలోచించరు. ధనం అన్నిటికీ  మూలం అయినా ఆప్యాయతలను, అనురాగాలను ప్రియ మిత్రులను ఆ డబ్బుతో కొనలేం అని ధనికులు అనుకుంటారు. ఇది సహజంగా వచ్చే ఆలోచన కానీ అనుకోకుండా కలిసి వచ్చి విపరీతంగా ధనికుడు అయినప్పుడు  అతని తత్త్వం సహజత్వానికి విరుద్ధంగా ఉంటుంది  తార్కికంగా ఆలోచించే ఆలోచన  అతని మనస్సు నుంచి దూరం అయిపోతుంది. అప్పుడు అతని పూర్తి మనస్తత్వం  బయటకు వస్తోంది. ఇది పక్క వాడికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇతనిలో ఇంత మార్పు వచ్చిందా  అని అబ్బుర పడతారు.
సంపద వచ్చేసరికి  ప్రపంచంలో ఎన్ని దుర్గుణాలు ఉన్నాయో  అవన్నీ వచ్చి చేరతాయి  అనేకమంది  చుట్టూ చేరి భజనలు చేస్తూ ఉంటారు వారు ఎందుకు చేస్తున్నారో కూడా గ్రహించలేని స్థితిలో ఉంటారు. దానినే ముఖ స్తుతి అంటున్నారు. ఈ వచ్చిన వారిలో మంచి చెప్పేవారు ఉంటారు, చెడు చెప్పేవారు ఉంటారు వారి మాటలు విన్నా వాటిని పట్టించుకోకుండా దానికి వ్యతిరేకంగా మాట్లాడి వారితో అవును అని అనిపించుకుంటారు.  ఉదాహరణకు  నిజాన్నే చెప్పుము అని ఒక వాక్యం చెబితే నిజం చెప్తే ఏం వస్తుందయ్యా  దానికి మసి పూసి మారేడు కాయ  చేసి  కథ అల్లి చెబితే దానికి ప్రయోజనం ఉంటుంది తప్ప  ఉన్నది ఉన్నట్లు చెబితే ఎవరైనా అంగీకరిస్తారా నీ పిచ్చి గాని  అని వారిని చివాట్లు పెడతాడు.
అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని  తన కంటితో చూసిన విషయాలు కూడా తాను  నమ్మలేడు  దానిలో ఏదో మర్మం ఉండి వుంటుంది అని అనుకుంటాడు  ఎవరు ఏ మంచి మాట చెప్పినా  అది వినపడదు దానికి వ్యతిరేకమైన అర్థాన్నే స్వీకరిస్తూ ఉంటాడు. భగవంతుడిచ్చిన నోరు ఉంది  స్వచ్ఛమైన విషయాలను ఉన్న వాటిని ఉన్నట్టుగా  చెప్పడం కోసం కాదు ప్రకృతి మనకు ప్రసాదించినా వీరు ఎప్పుడు వారి నోరు విప్పి చెప్పడం కానీ, జరిగిన దాన్ని అంగీకరించడం కానీ  జరగదు  దీనికి ముఖ్య కారణం ఏమిటి అని వేమన ఉదాహరణ పూర్వకంగా చెప్పాడంటే కలిమి ఎవరికి కలుగుతుందో  వారందరూ కూడా ఇలాంటి స్థితికి లోనవుతారు. ఆ వలయం నుంచి ఆ ఉచ్చు నుంచి  బయట పడడం మానవమాత్రుడికి అసాధ్యము  అని తేల్చి చెప్పారు 
ఈ సందర్భంగా గొప్ప ఉదాహరణ ఇచ్చాడు సన్ని పాతం అని. మన ఇండ్లలో చూస్తూ ఉంటాం ఎవరికైనా జ్వరం తగ్గకుండా వస్తే వాడికి సన్నిపాత జ్వరం వచ్చింది అని అంటారు. దానితో పోల్చడం వేమనకే తగు. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగాడు కనక  ఆ తత్వాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న మేధావి వేమన ఆ పద్యాన్ని రాయగలిగాడు మీరు చదవండి.

"కనియుగాన లేడు  
కదలపడానోరు  
వినియు వినగలేడు విస్మయమున  
సంపద గలవాని సన్నిపాతంబిది..."

కామెంట్‌లు