అజ్ఞాన ప్రదర్శన;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ప్రపంచంలో వ్యాప్తిలో ఉన్న విషయాలను, మన సంప్రదాయాలను, సంస్కృతిని  మర్చిపోతున్నాం అని తలచి  వేమన  మళ్లీ ఒకసారి ఆ విషయాలను జ్ఞాపకం చేయడం కోసం ఆట వెలదులతో మనకు ఎన్నో విషయాలు  సుబోధకం  చేశారు. మనం బంధువుల ఇంటికి కానీ, ఆత్మీయ స్నేహితుల ఇంటికి వెళ్ళినప్పుడు వారి మంచిచెడులను వివరించి తన విషయాలను చెప్పుకొన్న తర్వాత  ఆ గృహిణి భోజనానికి ఆహ్వానిస్తోంది. చక్కగా ఆకును కడిగి  నీళ్లు లేకుండా చూసి  షడ్రసోపేతమైన పంచభక్ష్య పరమాన్నాలు దాన్లో వడ్డిస్తోంది. ఎంతో చూడముచ్చటగా ఉంటుంది  ఆ విస్తరి ఈ అన్ని బరువులతో గాలి కి  రెపరెపలాడ కుండా  అణిగి మణిగి ఉంటుంది. భోక్త భోజనం చేసిన తరువాత పదార్థాలన్నీ అయిపోయి  ఏ కొంచెం గాలి వీచినా ఆ ఎంగిలి మొత్తం  మన మొహం పైన పడుతుంది. ఏదైనా సాహిత్య కార్యక్రమానికి వెళ్ళినప్పుడు  ఏదో ఒక అంశాన్ని గురించి  మాట్లాడవలసి వస్తుంది. మిడిమిడి జ్ఞానంతో వున్న వ్యక్తి వచ్చి  వేదిక పైకి వెళ్లే పద్ధతి కూడా తెలియకుండా  అక్కడ ఎలా ప్రవర్తించాలి అనే విషయం  మరచి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. కారణం తన ఆధిపత్యాన్ని  అందరి ముందు ప్రదర్శించాలి. అతనికి తెలిసిన అద్భుతమైన గొప్ప సాహిత్యం మరొకరికి తెలియదు  అన్న  భ్రమను కల్పించడానికి అతను చేసే ప్రయత్నం. అతను మాట్లాడవలసిన సమయం ఆసన్నమైనప్పుడు  తను ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియని స్థితిలో భాష మీద పట్టు గాని, భావం తెలిసి ఉండడం కానీ అసలు నిలబడే విధానం కూడా తెలియని వ్యక్తి  రసాభాస చేసి ప్రేక్షకుల మెదళ్లను తినడం తప్ప మరి ఏమి చేయలేడు. జ్ఞానవంతులకు జ్ఞానహీను లకు  భేదాన్ని తెలియజేయడం కోసం వివరణతో  చక్కటి పోలికతో మనకు ఆటవెలదిని అందించారు. అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది  ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది  అని మన పెద్దలు అతి చిన్న విషయానికి కూడా ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. అన్నీ తెలిసి విజ్ఞత కలిగిన వ్యక్తి నలుగురిలో పేరు సంపాదించుకోవడానికి కారణం అతడి మౌనం, అజ్ఞాని మాట్లాడినట్లుగా పొంతనలేని విషయాలన్నిటినీ తన ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలతో చెప్పేవారి కన్నా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్లు చెప్పేవాడిని  జ్ఞాని అంటారని  వేమన పద్యం. ఆ పద్యాన్ని మీరు కూడా చదవండి.

"నేరనన్నవాడు నెరజాణ మహిలోన  
నేరు నన్నవాడు నిందజెందు  ఊరుకున్న వాడే ఉత్తమ యోగిరా..."కామెంట్‌లు