ఒక్కసారి బాధల వరదల్లో
కొట్టుకుపోతున్న కన్నీటికి
ఆనకట్టలు కట్టి ఆదుకోండి!!
సర్వస్వం వదులుకుంటున్న
గుండెల్లో నీ రక్తం ఇంకిపోకుండా
నాలుగు గదుల్లో ఉదయం సాయంత్రాలను
బంధించండి!!
ప్రకృతి పోసిన ప్రాణం
ప్రకృతి తీసిన ప్రాణం
కళ్ళల్లో గుండెల్లో పూడ్చిపెట్టినట్లు
కడుపు కోతలు
కథలు కథలుగా చెప్పుకుంటూ
లోకం మనల్ని నిద్రపుచ్చినట్లు
కలలు కంటున్నాం!!
వేల ఏళ్ల నాటి గాయం
మాయం చేస్తానన్న కాలం మాట తప్పింది
లోకం దారి తప్పి మళ్లీమళ్లీ
మాయమాటలతో వైద్యం చేస్తుంది!!
కాళ్లు చేతులు పడిపోయినట్లు
కళ్ళు చూపు కోల్పోయినట్లు
అడుగులు పడటం లేదు
కనురెప్పలు తెచ్చుకోవటం లేదు!!
ఎవరి లోకంలో ఎవరు జన్మిస్తున్నారో
ఎవరెవరు మరణిస్తున్నారో
లెక్కలు తప్పినట్లు యమలోకంలో
ఒకటే గందరగోళం!!
గాలిని పంపిన సైన్యం
గుర్రాలపై ఊపిరితిత్తులని
పంపాలని చూస్తూ ఎవరు ఎవరిని
చంపాలని చూస్తున్నారు
స్పష్టంగా చెప్పటానికి కురుక్షేత్రం కాదు ఇది!!?
ఆగిపోయిన గుండెల్ని మళ్లీ
పనిచేయించడానికి
కవాటాల్ని తెరిపించడానికి
గీతోపదేశం చేసిన దేశం కాదు ఇది!!
శాంతి సందేశం తో
వ్యూహాల్ని కూల్చే యుద్ధం కాదు ఇది!!
అర్ధ నగ్నంగా ఆయుధాల్ని
ఉపయోగించిన అమరులు ఇక్కడ వీరులు!
ముఖాల్ని బహుముఖ పోటీల్లో
ఓడించిన తలలేని మొండాలను
ప్రదర్శించిన క్షేత్రంలో ఇంకా విత్తనాలు
మొలకెత్తాల్సి ఉంది!!?
శత్రువు ఇంకా ఓడిపోలేదు
యుద్ధం గాయం ఇంకా మానలేదు
బాధ భద్రంగా యుద్ధం చేస్తూనే ఉంది!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి