'కార్యసాధన;-ఎం బిందుమాధవి
 మనకి అప్పగించిన ఏదయినా కార్యాన్ని సాధించాలంటే...ఆ పని మనకప్పగించిన వారి పట్ల గౌరవం, మనకుండే లక్ష్య శుద్ధి...పూర్తి చెయ్యాలనే ఒక పూనిక, పట్టుదల, దీక్ష ముఖ్యం!
సాధనా క్రమంలో ఎదురైన ఆటంకాలని అధిగమించే తెలివి, సమయస్ఫూర్తి ఉండాలి.
రామాయణంలో ఉన్న అలాంటి ఎన్నో సంఘటనల్లోంచి ఒకదాని గురించి ఇప్పుడు చెప్పుకుందాం!
@@@@
ఆంజనేయ స్వామి తల్లిదండ్రులు అంజనా దేవి, కేసరి అనే వానర రాజు అని మనకి తెలుసు కదా! అంతే కాదు...హనుమ వాయు దేవుడి అంశతో జన్మించాడు.
హనుమ చిన్నగా ఉన్నప్పుడు..తల్లి అంజనా దేవి ఆహారం కొరకు పండ్లు తేవటానికి అడవికి వెళ్ళింది. ఆమె వాచే లోపు ఆకలికి ఆగలేని హనుమ తన నివాస కుటీరంలో నించి బయటికి వచ్చి తలెత్తి చూసేసరికి అప్పుడే సూర్యోదయం అవుతున్నది.
బాల హనుమ ఆ సూర్య బింబాన్ని చూసి పండనుకుని తినటానికి ఆకాశంలోకి ఎగిరాడు. అలా వస్తున్న హనుమని చూసి రాహు గ్రహం తనకి పోటీగా మరొకరు సూర్యుడిని గ్రసించటానికి వస్తున్నారని ఇంద్రుడికి చెబుతాడు. సూర్యడిని గ్రసించటానికి వచ్చిన రాహువు మరొక పండనుకుని..సూర్యుడిని వదిలేసి హనుమ రాహువు మీదికి వెళతాడు. ఇంద్రుడు ఐరావతం మీద ఎక్కి రాహువుతో కలిసి వస్తుంటే తెల్లటి ఐరావతాన్ని చూసి అది ఇంకొక పండనుకుని హనుమ దాన్ని తినటానికి అటు వెళతాడు. ఇదంతా చూసి కోపంతో ఇంద్రుడు హనుమని తన వజ్రాయుధంతో కొడతాడు. అప్పుడు హనుమ దవడకి దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ ధాటికి హనుమ మూర్ఛ పోయి కింద పడిపోతాడు.
తన కుమారుడికి కలిగిన ఆపదకి కోపం తెచ్చుకుని వాయుదేవుడు గాలి వీచకుండా స్తంభింపచేస్తాడు. అప్పుడు ప్రాణులన్నీ గాలి లేక కట్టెలాగా అయిపోతారు. ప్రపంచమంతా అల్లకల్లోలమయి బ్రహ్మ దేవుడి దగ్గరకి వెళ్ళి మొర పెట్టుకుంటారు. అప్పుడు బ్రహ్మ దేవుడు వచ్చి దిక్పాల్కులతో ఇతను కారణజన్ముడని ముందు ముందు మీకు రాబోయే సమస్యలు తీరుస్తాడని......ఇతనికి మీరందరు వరాలివ్వమని చెబుతాడు. అలాగే ఎవరి శాపాలు ఇతని మీద పని చెయ్యవని కూడా వారంతా వరమిస్తారు.
అలాగే బ్రహ్మ గారు కూడా తనకి సంబంధించిన బ్రహ్మాస్త్రం హనుమకి ఆపద కలిగించదని వాయుదేవుడికి చెప్పి అతని కోపాన్ని ఉపశమింపచేస్తాడు.
అతి బలవంతుడు, ధైర్యశాలి అయిన ఆంజనేయుడు...బాల్య చాపల్యం చేత వనాలన్నీ చెల్లాచెదురు చేస్తూ..చెట్లన్నీ విరిచేస్తూ...మునుల ఆశ్రమ వాటికల్లో అల్లరి పనులు చేస్తూ అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అతని మీద ఎవరి శాపాలు పని చెయ్యవనే వరం ఉండటం వల్ల మునులంతా బ్రహ్మ దేవుడి దగ్గరకి వెళ్ళి మొరపెట్టుకుంటారు.
అప్పుడు బ్రహ్మ మళ్ళీ ప్రత్యక్షమై...అవసరమైన సందర్భం వచ్చినప్పుడు ఎవరైనా గుర్తు చేస్తే తప్ప ఇతనికి తన బలము, శక్తి గుర్తుకు రావని తరుణోపాయం చెప్పి వెళ్ళిపోతాడు.
@@@@
తరువాత ఆంజనేయుడు పెరిగి పెద్దవాడై సుగ్రీవుడికి మంత్రిగా ఉండి అతనికి ఎంతో సహాయం చెయ్యటమే కాక శ్రీ రామ చంద్ర మూర్తితో స్నేహం కుదురుస్తాడు.
సుగ్రీవుడు పంపగా సీతా దేవిని వెతకటానికి లంకకి వెళ్ళి ఆమెని అశోకవనంలో చూసి, సంతోషించి..వచ్చిన పని అయిపోయినా కూడా ... శత్రువైన రావణాసురుడి బలం, సైన్య సంపద, వారి యుద్ధ నీతి తెలుసుకుని వెళ్ళటం ముఖ్యం అనుకుంటాడు.
అప్పుడే రాముడు లంక మీద దండెత్తివచ్చినప్పుడు విజయం పొందటానికి సులువవుతుందని ఆలోచించి...నేరుగా రావణాసురుడి దగ్గరకి వెళ్ళటం కుదరదని...వారే తనని రావణ సభకి తీసుకువెళ్ళే విధంగా వ్యూహ రచన చేస్తాడు.
ఆ వ్యూహం ప్రకారం హనుమ లంకలోని తోటలు, ఉద్యానవనాలు అన్నిటినీ విరిచేసి అడ్డొచ్చినవారి మీద యుద్ధం చేసి వారిని సంహరిస్తాడు.
ఇతన్ని కట్టడి చెయ్యలేని రాక్షస వీరులు రావణుడి దగ్గరకి వెళ్ళి చెబితే అతను ఇంద్రజిత్తుని పంపిస్తాడు. ఇంద్రజిత్తు చాలా సేపు యుద్ధం చేసి హనుమని ఓడించలేనని తెలుసుకుని అతని మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. వెంటనే హనుమ కింద పడిపోతాడు. తన మీద బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగిందని తెలుసుకుని..అది తనని బంధించలేదని..తనకి బ్రహ్మ దేవుడు అలాంటి వరం ఇచ్చాడని తెలిసినా బ్రహ్మ దేవుడి మీద గౌరవంతో అస్త్రానికి కట్టుబడినట్టుగా నటిస్తాడు.
అప్పుడే తనని వాళ్ళు రావణ సభకి తీసుకెళతారని, అతన్ని చూడచ్చని మనసులో నిశ్చయించుకుని కదలక మెదలక అలా పడి ఉంటాడు.
ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో బంధించాక...ఇతర సాధనాలతో కడితే అస్త్ర శక్తి విఫలమవుతుందని తెలియని రాక్షసులు హనుమని తాళ్ళతో కట్టి దెబ్బలు కొడుతూ ఈడ్చుకుంటూ రాజ సభకి తీసుకెళతారు. అప్పుడు ఎలాగైనా రావణుడిని కలవాలని తనకి ఎంత బాధ కలుగుతున్నా ఓర్చుకుంటాడు.
“కార్య సాధకుడైన” హనుమ శ్రీరామచంద్ర మూర్తి తనకి వప్పగించిన కార్యం సీతాన్వేషణే కాకుండా శత్రువు బలాబలాలు, యుద్ధ సామగ్రి, ఆయుధాలు, సైనిక బలం మొత్తం తెలుసుకుని వెళ్ళటం అనే తెలివైన పని అత్యంత ఓర్పు సహనాలతో నిర్వహించాడు.
పిల్లలూ ఇప్పుడు తెలిసిందా...మనకప్పగించిన పని విజయవంతంగా పూర్తి చెయ్యాలంటే..దారిలో కలిగే ఆటంకాలకి కుంగిపోకూడదు. ఎక్కడ తగ్గాలో..ఎక్కడ మన శక్తి ప్రదర్శించాలో..ఎలా శత్రువుని అదుపులో పెట్టాలో..మన గురించి ధైర్యంగా ఎలా అవతలి వారికి తెలియచెయ్యాలో... అనే విచక్షణ తెలియాలి.
హనుమ అంత బలవంతుడే... తనని బంధించలేని 'బ్రహ్మాస్త్రానికి' కట్టుబడ్డట్టుగా నటించాడు. కార్య సాధన అంటే అది!
"అనువు కాని చోట అధికులమనరాదు" పద్యం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా! అవసర సమయంలో అవన్నీ గుర్తు తెచ్చుకోవాలి.


కామెంట్‌లు