మానవ ప్రయత్నం (నీతి కధ); -: సి.హెచ్.ప్రతాప్

 ఒకసారి ముగ్గురు అన్నదమ్ములు తమ పొలంలో పండించిన ధాన్యాన్ని ఒక బండిపై వేసుకొని పట్టణంలో బజారులో విక్రయించు కుందామని  ఒక అడవిలోంచి వెళ్తున్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్దపులి ఎదురొచ్చింది. దానిని చూసిన పెద్దవాడు " శొదరులారా, నిద్ర లేవగానే ఎవరి ముఖం చూసానో, ఇంత పెద్ద ప్రమాదం దాపురించింది..ఈ రోజుతో మనకు ఈ భూమికి ఋణం తీరిపోయింది. ఈ పెద్ద పులి మన ముగ్గురినీ చంపేస్తుంది కాబట్టి ఇక బ్రతకం" అని భయంతో ఏడవసాగాడు.
వెంటనే రెండవవాడు " ఏమీ పరవాలేదు. మన ముగ్గురికీ మన తల్లిదండ్రుల దయ వలన ఎంతో కొంత భక్తి అబ్బింది. వెంటనే కళ్లు మూసుకుని ఆ దేవుడిని ధ్యానిస్తే అయన వచ్చి గజేంద్ర మోక్షంలో శ్రీ మహా విష్ణువు ఏనుగును రక్షించినట్లు రక్షిస్తారు" అని కళ్ళు మూసుకొని ప్రార్థన చెయ్యసాగాడు.
ఇంతలో చిన్నవాడు , అన్నల్లారా ! దేవుని  పేరుతో సమయం వృథా చేయడమెందుకు? ఆయన మనలోనూ ఉన్నాడు, ఆ పులి లోనూ వున్నాడు. మనకు వున్న వివేచన, ఇంగిత జ్ఞానం ఆ క్రూర జంతువుకు వుండవు. ప్రవృత్తులపై ఆధారపడి జీవించే జంతువు ముందు వెనుక ఆలోచించవు. కాబట్టి క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎదురుగా వున్న ఈ చెట్టు ఎక్కేసి ముందు మన ప్రాణాలు కాపాడుకుందాం. తర్వాత మన ప్రాణాల్ని రక్షించినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుందాం" అని పరుగున వెళ్ళి ముందుగా  చెట్టు   ఎక్కేసాడు. తక్షణ కర్తవ్యం స్పురించి ,అతడిని అనుసరించి అన్నల్లిదరూ కూడా చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు..
 
‘మన కాలం తీరిపోయింది’ అని భయపడిన పెద్దవాడికి ‘భగవంతుడనే వాడున్నాడు, అతను మనల్ని రక్షిస్తాడు’ అన్నదే తెలియదు. ‘భగవంతుణ్ని ప్రార్థిద్దాం’ అన్న రెండవవాడికి ‘భగవంతుడు ఉన్నాడని, తానే ఈ ప్రపంచాన్ని, మనల్ని సృష్టించి పోషిస్తాడని’ తెలుసు. కనుకే, అతనిపైనే భారం వేసి ప్రార్థనలు చేద్దామన్నాడు. కాని ముందుగా మానవుడు గాలిలో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు అన్న చందాన కాకుండా పురుష ప్రయత్నం చేయాలని తెలియదు. మానవ ప్రయత్నం చిత్తశుద్ధితో చేసిన వారికే భగవంతుని అనుగ్రహం ప్రాప్తం అన్ని విషయం అతగాడికి స్పురణలో లేదు.
దైవవశాత్తూ చిన్నవాడికి భగవంతుని గురించి ‘సంపూర్ణ జ్ఞానం’ ఉంది. ‘భగవంతుడు సర్వవ్యాపి’ అన్న ప్రగాఢమైన నమ్మకం ఉంది. పరమాత్మునికి, జీవాత్మునికి అభేదాన్ని అవగాహన పరచుకున్నాడు. తాను నేర్చుకున్న జ్ఞానానికి సరైన అర్థాన్ని అతను ఆచరణలోకి తెచ్చుకున్నాడు. ఫలితంగా ‘మానవ ప్రయత్నానికి ఉపక్రమించి తనతోపాటు సోదరుల ప్రాణాలనూ రక్షించగలిగాడు.లోకంలో ప్రతి జీవి ఆ అనంత శక్తి నుంచే తయారైన ప్పటికీ పదార్థాన్ని బట్టి లక్షణాలు వస్తాయి. ఆయా లక్షణాలకు అనుగుణంగానే అవి ప్రవర్తిస్తాయన్న దాన్ని గుర్తెరగాలి. సమస్య ఎదురైనప్పుడు మనో నిబ్బరాన్ని అమాంతం పెంచుకోవాలి. పురుష ప్రయత్నం మాత్రం చిత్తశుద్ధితో చేయాలి.

కామెంట్‌లు