లక్ష్యసాధనలో అంకితభావం ప్రధానం!!;-- యామిజాల జగదీశ్
 చాలామంది క్లిష్టమైన పనైనా ఏదో ఒక ఉద్యోగం దొరికింది కదాని అందులో చేరుతారు. కానీ కఠినతరమైన పనే నిజానికి మనమేంటీ అని మనకీ ప్రపంచానికీ చూపుతుంది. అలాకాక అమ్మో ఆ పనిలో చేరాలా చేయాలా అనే ఆలోచన రావడంతోనే ఎందుకొచ్చిన తలనొప్పి అని అంతరంగం నుంచి వచ్చే ప్రశ్నతో దానినుంచి తప్పుకుంటాం.
కానీ, దిగి చూద్దాం అని నిర్ణయించుకున్న క్షణంలోనే కొత్త ప్రపంచం మనకోసం తలుపులు తెరచుకుంటాయి.
రాఫోర్ట్ అనే నగరం. ఇది అమెరికాలో మిసిసిపీ రాష్ట్రంలో ఉంది. అక్కడ పుట్టి పెరిగిన ఓ యువకుడి తండ్రి ఇళ్ళ నిర్మాణం జరిగే చోట ఇటుకలు మోసే కూలీగా పని చేస్తుండేవారు.
సెలవురోజుల్లో తండ్రికి తోడుగా ఆ యువకుడూ వెళ్తుండేవాడు. కలలను మోస్తున్న కాలేజీ విద్యార్థికి ఇటుకలు మోయడం ఆనందమిచ్చే పని కాదుగా!?
ఓ చోట నిల్చుని తనకు విసిరే ఇటుకను పట్టుకుని అందుకున్న వేగానికి ఏమాత్రం తగ్గక పట్టుకుని మరొకరికి విసిరే పని. ఎండనక చేసే పని. చెమటలు పట్టించే పని. 
కానీ ఆ యువకుడు దృఢ నిశ్చయంతో ఆ పని చేస్తుండేవాడు. సెలవురోజుల్లో తప్పనిసరిగా ఇటుకలు మోసే పనికి వెళ్తుండేవాడు.
తనకు విసిరే ఇటుకను కింద పడిపోకుండా పట్టుకోవాలనుకునే విషయంలో పట్టుగా ఉండేవాడు.
ఈ పని చేస్తూనే ఉన్నా అతని మనసులో మరొక ఆశ ఉండేది. తాను ఓ రగ్బీ క్రీడాకారుడిగా ఎదగాలని. ఆ కల నిజమైంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రగ్బీ rugby ఆటగాడయ్యాడు. అతనే జెర్రీ రైస్. రగ్బీ ఆటలో బంతిని కాళ్ళతో తన్నుకుంటూ పోవడంతోపాటు చేతులతో పట్టుకుని వేగంగా పరిగెడుతూ వెళ్ళి గోల్ సాధించాలి. ఇదొక ఫాస్ట్ గేమ్. అమెరికాలో చాలా ప్రసిద్ధిపొందిన క్రీడ.
అతను తన అనుభవాలను పంచుకుంటూ ఇలా చెప్పాడు...
నాకు విసిరే ఇటుకలను పట్టుకోవడం అనేది మరో దారి లేక చేసిన పని. కానీ మా పరిస్థితి తెలీక నన్ను విమర్శించేవాళ్ళు. ఈ పనీ ఓ పనేనా? చేసావులే పని హేళన చేసేవారు.
ఆ మాటలు చెవిన పడుతున్నాసరే వాటిని భరించానే తప్ప తిరిగీ ఒక్క మాటా అనే వాడ్ని కాను. భవిష్యత్తులో ఎలా ఉండాలనే విషయమై హృదయంలో ఓ గీత గీసుకుంటూనే వచ్చాను. 
ఇటుకలు మోస్తున్న పనిలో చెమటలు కక్కుతున్న సమయంలోనే నాలో వైరాగ్యం పుట్టింది. దేన్నయినా ఎదుర్కోవాలని అనుకున్నాను.
మండే ఎండలో చెమటలు పట్టినా ఓపికతో పని కొనసాగిస్తూ అవకాశాలను అందిపుచ్చుకునే తత్వాన్ని పెంచుకున్నా. అనుకున్నది సాధించాను. రగ్బీ ఆటగాడిగా గుర్తింపుపొందాను!
జీవితంలో విజయం సాధించడానికి సాధించాలనే పట్టుదల ఉండాలి. ఎన్నున్నా చేసి తీరుతానని అనుకోవాలి. అందుకు పట్టుదల, అంతులేని కృషి, అంకితభావం ముఖ్యం. అనుకున్నది చేసి తీరాలనే పట్టుదలే విజయానికీ అనుభవానికీ పునాది. ఈ క్రమంలో ఎన్ని కష్టాలెదురైనా ఓపికతో ఎదుర్కోవడం ప్రధానం. అందువల్లే అతను అనుకున్నది సాధించాడు.
1962 అక్టోబర్ 13న జన్మించిన జెర్రీ లీ రైస్ అమెరికా రగ్బీ మాజీ క్రీడాకారుడు. రగ్బీ అనేది అమెరికన్ ఫుట్ బాల్ స్టయిల్.  నేషనల్ ఫుట్ బాల్ లీగులో ఇరవై సంవత్సరాలు ఆడాడు. మూడుసార్లు ఛాంపియన్ షిప్ ట్రోఫీ అందుకున్నాడు. "శాన్ ఫ్రాన్సిస్కో 49ers" జట్టులో ప్రధాన ఆటగాడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. అతనిని " వరల్డ్ " world అనే నిక్ నేమ్ తో పిలిచేవారు. కారణం, తనకు విసిరే బంతిని పట్టుకుని వేగంగా పరుగెత్తడంలో అతను చూపించిన ప్రతిభ అందరినీ ఆకట్టుకునేది. అతని పేరిట అమెరికన్ రగ్బీ చరిత్రలో పలు రికార్డులు నమోదయ్యాయి. 1999లో ది స్పోర్టింగ్ న్యూస్ ప్రకటించిన వంద మంది అత్యుత్తమ ఆటగాళ్ళలో జెర్రీ లీ రైస్ రెండో స్థానంలో నిలిచాడు. 2010లో జాతీయ పుట్ బాల్ లీగ్ ఫిలిమ్స్ నిర్మించిన వంద మంది విశిష్ట ఆటగాళ్ళ చిత్రంలో ఇతనినికూడా ప్రముఖంగా చూపించింది.


కామెంట్‌లు