ఎవరికి థాంక్స్?;-- యామిజాల జగదీశ్
 "ఇక భయపడాల్సిందేమీ లేదు" రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న చిన్నారి అనూరాధకు ఇంజక్షన్ వేసి, మాత్రలకో చీటీ రాసిచ్చి డాక్టర్ వెళ్ళిపోయాడు.
అనూరాధ తల్లి రాధమ్మ దేవుడు పటం ముందు నిల్చుని "కృతజ్ఞతలు దేవుడా. పాపాని కాపాడావు" అని దణ్ణం పెట్టి ఇవతలకు వచ్చింది. 
"ఏంటి రాధా, ఇంజక్షన్ వేసి భయపడాల్సిందేమీ లేదని చెప్పిందేమో డాక్టరు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పకుండా దేవుడికి చెప్పావేంటీ?" అడిగాడు రాధమ్మ భర్త రాజు.
ఇలా అంటున్న సమయంలోనే రాజుకి పోస్ట్ మాన్ ఓ రిజిస్టర్ పోస్ట్ ఇచ్చి సంతకం చేయించుకుని వెళ్ళాడు. 
అనంతరం రాజు కవర్ చింపి చూడగా లోపల రెండు వేల రూపాయలకు ఓ డీడీ ఉంది. 
వెంటనే రాజు డీడీ పంపిన రమేష్ కి ఫోన్ చేసి " థాంక్సురా, అవసరానికి పంపావురా"  అన్నాడు.
భర్త ఫోన్ కాల్ కట్ చేయడంతోనే రాధమ్మ "ఏంటండీ...ఎండలో సైకిల్ మీదొచ్చి పోస్ట్ ఇచ్చిన పోస్ట్ మాన్ కి థాంక్స్ చెప్పకుండా మీ ఫ్రెండుకి చెప్పారేమిటీ" అని నవ్వింది.

కామెంట్‌లు